
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నీలి నీడలు
పది నెలలుగా పట్టించుకోని చంద్రబాబు సర్కారు
మనకు హక్కుగా కేటాయించిన 44 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట వాదించలేని బేలతనం
ఫలితంగా పనులు యథాస్థితికి తేవాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశం
ఇది రాయలసీమ వాసులకు కూటమి ప్రభుత్వం చేసిన ద్రోహం
శ్రీశైలంలో 798 అడుగుల్లోనే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తోడేస్తున్న తెలంగాణ
800 అడుగుల నుంచే సాగుకు నీరు.. ఆ మేరకు అక్రమంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం
ప్రాజెక్టులో 854 అడుగుల మేర నీరొస్తేనే మనకు 7 వేల క్యూసెక్కులు
ఈ లెక్కన 880 అడుగుల మేర నీరెప్పుడు రావాలి? 44 వేల క్యూసెక్కులు ఎప్పుడు తరలించాలి?
దీన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన
800 అడుగుల నుంచే నీళ్లు తీసుకుని ‘సీమ’ దాహార్తి తీర్చే ప్రాజెక్టు ఇది
దీనిపైనా బాబుకు అక్కసు.. జగన్‌కు మంచి పేరొస్తుందని ఈర్ష్య
తెలంగాణ రైతులతో అప్పట్లో ఎన్జీటీలో కేసులు వేయించిన వైనం
తెలంగాణలో అనుమతి లేకుండానే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల
ఆపేయాలని ఎన్జీటీ ఆదేశం.. రూ.920.85 కోట్ల జరిమానా.. అయినా పనులు కొనసాగిస్తున్న వైనం.. నోరెత్తని చంద్రబాబు ప్రభుత్వం
బనకచర్ల ప్రాజెక్టు పైనా డ్రామాలు
రాయలసీమకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాలను వాడుకునే విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ యథేచ్ఛగా అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతున్నా, ఇంకా అదనంగా దండుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... ఏమాత్రం అడ్డు చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. మాకు కేటాయించిన నీటిని మేము తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఎలా తప్పవుతుందని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఎదుట గట్టిగా నోరు విప్పి వాదించలేదు. ఎవరి మేలు కోసం.. ఎందుకీ ఈ బేలతనం? ‘సీమ’పై కోపమా? లేక వైఎస్ జగన్‌కు పేరొస్తుందని కుళ్లా..?
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీరు.. చెన్నై తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవితవ్యం కూటమి సర్కారు తీరుతో ప్రశ్నార్థకంగా మారింది. పది నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని వాదించలేకపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పటి నుంచే పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తున్నా, 800 అడుగుల నుంచే ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటున్నా.. కొత్తగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నా అడ్డుచెప్పలేక పోతోంది.
880 అడుగులకు నీళ్లొచ్చినప్పుడు మాత్రమే మనం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గరిష్టంగా హక్కుగా దక్కిన 44 వేల క్యూసెక్కులు తరలించాలంటే ఎన్ని రోజులు ఆగాలని, ఆ మేరకు వరద ఎన్ని రోజులు ఉంటుందని.. ఇలాగైతే ఆ మేరకు నీటిని తరలించడం ఎలా సాధ్యమని గట్టిగా వాదించలేదు. కోటా మేరకు నీటిని వాడుకునేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నోరు విప్పి చెప్పలేదు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని కూడా వాదించలేదు.
ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం.. చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని గత నెల 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై ఆ రోజు ఈఏసీ 25వ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చర్చించింది. ఆ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పేర్కొన్న విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడం వల్లే రాయలసీమ ఎత్తిపోతలకు శరాఘాతంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలను తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కొనసాగిస్తూ.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను హరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014–19 మధ్య నాటి చంద్రబాబు సర్కార్ రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ, ఓటుకు నోటు కేసుతో వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడూ వ్యవహరిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు.
తాగునీటి పనులకూ బ్రేక్
చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్‌లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు.
రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. పది నెలలుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడం ద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించలేదు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడినట్లయింది.
‘బనకచర్ల’ ప్రాజెక్టుపైనా డ్రామాలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టుపైనా నాటకాలాడుతున్నారని స్పష్టమవుతోంది. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని ఓవైపు చెబుతూనే.. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం. కేవలం ప్రచారం కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారని ఇట్టే అర్థమవుతోంది.
నిర్విఘ్నంగా పాలమూరు– రంగారెడ్డి పనులు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. మన రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టులపై అప్పటి చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ని ఆశ్రయించారు. ఈ కేసులో రైతులతో నాటి వైఎస్సార్‌సీపీ సర్కార్ జత కలిసింది.
ఆ రెండు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే లేవని.. వాటి వల్ల శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని వాదించింది. దీంతో ఏకీభవించిన ఎన్జీటీ తక్షణమే పనులు నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తుండటంతో 2022 డిసెంబర్ 22న తెలంగాణ సర్కార్‌కు రూ.920.85 కోట్ల జరిమానా సైతం విధించింది. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా పనులు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.
హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల
⇒ ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.
⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా
తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.
⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల
వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.
⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment