అలలపై కలల విహారం | Luxury cruise tourism as latest trend in country | Sakshi
Sakshi News home page

అలలపై కలల విహారం

Published Sun, Mar 9 2025 4:39 AM | Last Updated on Sun, Mar 9 2025 4:39 AM

Luxury cruise tourism as latest trend in country

దేశంలో సరికొత్త ట్రెండ్‌గా లగ్జరీ క్రూజ్‌ టూరిజం 

ముంబై నుంచి గోవా, కొచ్చి, లక్షదీవుల దాకా అందుబాటులో టూర్లు 

చెన్నై నుంచి విశాఖకు కూడా నడుస్తున్న సముద్ర విహారయాత్రలు 

మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో ప్యాకేజీలు 

కేంద్రం చర్యలతో గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్‌ క్రూజ్‌ సర్విసులు ప్రారంభం 

కృష్ణా, గోదావరి తదితర నదుల్లోనూ ఈ సర్విసుల కోసం ప్రయత్నాలు

అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్‌ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్‌ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.

అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్‌ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్‌కు సిద్ధమైపోండి. గెట్‌ సెట్‌ క్రూజ్‌!! 

దేశంలో క్రూజ్‌ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్‌ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్‌ టు గెదర్‌ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్‌ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్‌ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్‌లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్‌’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్‌ పర్యాటకానికి తెరతీసింది.

బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్‌ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్‌ పోర్టుగా సెపె్టంబర్‌–జూన్‌ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్‌–సెప్టెంబర్‌ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్‌ పోర్ట్‌గా క్రూజ్‌ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్‌ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్‌ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్‌–సెపె్టంబర్‌ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‌‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్‌ అడ్వెంచర్లు, జంగిల్‌ సఫారీలు, ఆన్‌షోర్‌ సిటీ టూర్, అవుట్‌డోర్‌ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్‌ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్‌ బైలోమ్‌ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్‌ ట్రాఫిక్‌ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు.  

కేంద్రం దన్ను.. 
దేశంలో సముద్ర క్రూజ్‌ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్‌ క్రూజ్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్‌ టెర్మినల్స్, 100 రివర్‌ క్రూజ్‌ టెర్మినల్స్‌ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్‌ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్‌ క్రూజ్‌ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్‌ క్రూజ్‌ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్‌ లక్ష్యం.

వైజాగ్‌ హాట్‌ డెస్టినేషన్‌... జూలైలో మళ్లీ క్రూజ్‌ రెడీ
2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్‌ ‘ఎంప్రెస్‌’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్‌’అనే విదేశీ లగ్జరీ క్రూజ్‌ షిప్‌ గ్లోబల్‌ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్‌ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్‌ నౌక వైజాగ్‌–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.

సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్‌ క్రూజ్‌ టెర్మినల్‌ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్‌ పర్యటకానికి కూడా వైజాగ్‌ హాట్‌ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్‌ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్‌లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్‌ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్‌ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.

విదేశీ క్రూజ్‌ల క్యూ
ఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్‌ తొలిసారిగా 2023లో భారత్‌ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్‌ అనుభూతితోపాటు ఇటాలియన్‌ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్‌ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.

ఆసియా పసిఫిక్‌ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్‌ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్‌ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్‌ వరల్డ్‌ వన్‌’క్రూజ్‌ లైనర్‌ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్‌ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్‌ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.

ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! 
భారత క్రూజ్‌ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్‌ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్‌ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్‌లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్‌ (ఫుకేట్‌), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్‌ చేరుకోవచ్చు.

అలాగే సింగపూర్‌ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్‌ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్‌ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్‌సైట్‌ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్‌ పోర్టల్స్‌లో బుకింగ్స్‌ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్‌ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్‌ చేసే అవకాశం ఉంటుంది.

ప్యాకేజీలు ఇలా... 
కార్డీలియా ‘ఎంప్రెస్‌షిప్‌లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్‌ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్‌ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...

అన్‌లిమిటెడ్‌ ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మూడు రోజులపాటు ఫైవ్‌ స్టార్‌ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్‌ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్‌ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్‌ సూట్‌ కూడా ఉన్నాయి.

విదేశీ టూర్ల విషయానికొస్తే... 
చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్‌ రౌండ్‌ ట్రిప్‌) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్‌ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్‌ మీదుగా వన్‌వే ట్రిప్‌ – 10 నైట్స్, 11 డేస్‌) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్‌ స్టేట్‌రూమ్‌ ప్యాకేజీలు ఇవి.

క్రూజ్‌ లెక్కలు ఇలా.. 
3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్‌ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 

30 బిలియన్‌ డాలర్లు: క్రూజ్‌ జర్నీ మార్కెట్‌ విలువ

45 బిలియన్‌ డాలర్లు: 2029 నాటికి క్రూజ్‌ జర్నీ మార్కెట్‌ విలువ అంచనా

4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్‌ ప్రయాణికుల సంఖ్య

5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement