Krishna River: 'కృష్ణా' తులాభారం | Krishna Water Sharing Dispute Between Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

Krishna Water: 'కృష్ణా' తులాభారం

Published Sun, Jul 11 2021 4:49 AM | Last Updated on Sun, Jul 11 2021 11:32 AM

Krishna Water Sharing Dispute Between Andhra Pradesh And Telangana - Sakshi

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా పారే కృష్ణమ్మ తనతో పాటే అనేక వివాదాలను మోసుకొస్తోంది. ఎడతెగని పంచాయతీలకు కారణమవుతోంది. వీటిని పరిష్కరించేలా ట్రిబ్యునళ్లు తీర్పులిచ్చినా..అంతరాష్ట్ర ఒప్పందాలు జరిగినా.. కేంద్రం మధ్యవర్తిత్వం చేసినా.. వివాదాలు షరా మామూలవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు తమ వాటాలకు మించి నీటి వినియోగం చేసేలా ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటే... ఉన్న వాటాల్లో నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలకు అవకాశం లేక పరీవాహకానికి, ఆయకట్టుకు తగ్గట్లుగా వాటాలు దక్కలేదని తెలంగాణ అంటుంటే.. తమకున్న నీటి వాటాల్లోంచే వినియోగిస్తున్నామని, అంతకుమించి ఒక్క చుక్క నీటిని అదనంగా వినియోగించబోమని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేస్తోంది. విభజన తరువాతైనా నీటి వాటాలను సవరించి కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలని తెలంగాణ కోరుతుంటే.. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ నీటి వాడకంతో తమ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఏపీ అంటోంది. దీనిపై అటు కేంద్రానికి, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు ఇరు రాష్ట్రాలు లేఖలు రాస్తున్నా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల విషయంలో ఇరు పక్షాల  వాదనలు, వాస్తవాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ తెలిపే ప్రయత్నం చేస్తోంది.  
– సోమన్నగారి రాజశేఖర్‌ రెడ్డి, ఆలమూరు రామగోపాల్‌ రెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధులు 

శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి
తెలంగాణ
శ్రీశైలం పూర్తిగా విద్యుత్‌ అవసరాల కోసం నిర్మించినదే. 1959లో శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుగా చేపట్టగా 1963లో ప్లానింగ్‌ కమిషన్‌ దానిని ఆమోదించింది. 
► బచావత్‌ అవార్డు పేజీ నంబర్‌ 104 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు.  
► విభజన చట్టం 12వ షెడ్యూల్, సెక్షన్‌  (1) ఏపీ జెన్‌కో పవర్‌ ప్లాంట్లను భౌగోళిక ప్రాంతం ఆధారంగా విభజించింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 50 శాతం చొప్పున పంచుకోవాలని విభజన చట్టంలో ఎక్కడా లేదు. 
► 1990–91 నీటి సంవత్సరం నుంచి 2019 – 20 వరకు ఏప్రిల్, మే నెలల్లో శ్రీశైలం కనీస మట్టం 834 అడుగుల్లో ఏపీ నీటిని నిల్వ ఉంచడం లేదు. పెన్నా బేసిన్‌ ప్రాజెక్టులకు  తరలించేందుకు 854 అడుగుల మట్టాన్ని నిర్వహించాలని ఏపీ కోరడం సమంజసం కాదు. 
► 2015 జూన్‌లో నిర్వహించిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ, బోర్డు భేటీల్లో శ్రీశైలం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 50 శాతం చొప్పున తాత్కాలిక పద్ధతిలో పంచుకున్నది కేవలం ఆ వాటర్‌ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీనిని క్లెయిమ్‌ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. 
► 2020–21 వాటర్‌ ఇయర్‌లో ఏపీ 629.06 టీఎంసీలను  కృష్ణా బేసిన్‌లో వాడింది. ఇంత భారీ ఎత్తున నీటిని తరలిస్తూ తెలంగాణ కరెంట్‌ ఉత్పత్తి చేయడం ద్వారా తమ తాగునీటి అవసరాలకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తుండటం అసంబధ్దం. 
► తెలంగాణ సముద్ర మట్టానికి ఎగువన ఉంది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. లిఫ్టులతో ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా కృష్ణా, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి రెండు పంటలకూ నీరందాలంటే జల విద్యుత్‌ ఉత్పత్తి కీలకం. అందుకే అన్ని ప్రాజెక్టుల్లోని జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 100 శాతం సామర్థ్యంతో కరెంట్‌ ఉత్పత్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌
► కేంద్ర ప్రణాళిక సంఘం 1963లో శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్‌ ప్రాజెక్టుగా అనుమతి ఇచ్చింది. కానీ ఆ తర్వాత  బహుళార్ధకసాధక ప్రాజెక్టుగా ప్రణాళిక సంఘమే గుర్తించింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ) ద్వారా 19 టీఎంసీలు వాడుకోవడానికి జూలై 4, 1994లో సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు అని తెలంగాణ సర్కార్‌ పేర్కొనడంలో అర్థం లేదు. 

► జూలై 10, 2014న కృష్ణా బోర్డు మొదటి సమావేశంలోనే శ్రీశైలంలో 834 అడుగుల కంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం ప్రాజెక్టులో జూన్‌ 1న 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నప్పటికీ బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది.  జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీశైలంలోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 26.05 టీఎంసీలను వదిలేసింది. 

► కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేకున్నా, బోర్డు æ కేటాయింపులు చేయకున్నా అక్రమంగా నీటిని వాడుకుంటూ నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 5.55 టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిశాయి. 

► ఉత్పత్తయ్యే విద్యుత్‌ చెరి సగం పంచుకునేలా 2015–16 సంవత్సరానికి మాత్రమే ఒప్పుకున్నాం. ఇకపై అంగీకరించం. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 512.04, తెలంగాణ వాటా 298.96 టీఎంసీలు. ఇదే నిష్ఫత్తిలో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో వాటా ఇవ్వాలి. ఈ ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే జలవిద్యుత్‌లో 66 శాతం వాటా మాకే దక్కుతుంది.  జాతీయ జలవిధానం ప్రకారం తొలి ప్రాధాన్యం తాగునీటికే. తరువాత సాగునీటికి ప్రాధాన్యం. చివరి ప్రాధాన్యం జలవిద్యుదుత్పత్తికి అది కూడా సాగునీటి అవసరాలున్నప్పుడే చేపట్టాలి. కనీస నీటిమట్టం దాటకుండానే డెడ్‌స్టోరేజీలోనే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది.
పెరిగిన జల విద్యుత్తు
థర్మల్‌ విద్యుదుత్పత్తి, సరఫరాను తెలంగాణ ఇటీవల గణనీయంగా తగ్గించింది. ప్రత్యామ్నాయంగా జలవిద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాను భారీగా పెంచింది. తెలంగాణ 9357.5 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సరఫరా సామర్థ్యాన్ని కలిగి ఉండగా కేవలం 6274 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ మాత్రమే జూలై 6న రాష్ట్రానికి సరఫరా అయింది. శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల, పులిచింతల తదితర జల విద్యుత్‌ కేంద్రాలు కలిపి తెలంగాణ జెన్‌కో మొత్తం 2441.8 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండగా జూలై 9న 751.1 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపిత సామర్థ్యంతో పోల్చితే 80 – 85 శాతం విద్యుత్‌ను రాష్ట్రాల డిస్కంలు కొనుగోలు చేయాలని విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలు పేర్కొంటాయి. అంతకు మించి తక్కువగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తే విద్యుదుత్పత్తి కంపెనీలకు ఫిక్స్‌డ్‌ చార్జీలను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. వదులుకున్న విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి వరకు పెనాల్టీలు ఉంటాయి.    ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కొనుగోళ్లకు ఒప్పందం ఉండగా, కనీసం 80 శాతం అంటే 800 మెగావాట్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంది. గత మంగళవారం కేవలం 97 మెగావాట్లను కొనుగోలు చేసింది. వదులుకున్న  703 మెగావాట్ల(16.8 మిలియన్‌ యూనిట్లు) విద్యుత్‌కు పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్‌కు రూ.2.75 ఫిక్స్‌డ్‌ చార్జీ చొప్పున 16.8 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు పెనాల్టీలు చెల్లించాల్సి రానుంది.

బచావత్‌  కేటాయింపులు
కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి 1969 ఏప్రిల్‌ 10న జస్టిస్‌ బచావత్‌ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ–1 ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్‌ 1976 మే 27న తుది తీర్పు ఇచ్చింది.  కృష్ణా జలాల పంపిణీకి బచావత్‌ ‘ఫస్ట్‌ ఇన్‌ యూజ్‌.. ఫస్ట్‌ ఇన్‌ రైట్‌(మొదటి నీటిని వాడుకున్న ప్రాజెక్టులకే ప్రథమ హక్కు)ను మూలసూత్రంగా పాటించింది. కృష్ణా డెల్టాకు 1854 నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తున్నారు. బేసిన్‌ పరిధిలోని మూడు రాష్ట్రాల్లో 1969 నాటికి పూర్తయిన ప్రాజెక్టుల్లో అత్యంత పురాతనమైనది. దాంతో.. కృష్ణా డెల్టా నుంచే నీటి పంపిణీని ప్రారంభించిన కేడబ్ల్యూడీటీ–1 ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు చివరగా కేటాయింపులు చేసింది. 

► కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు.. పునరుత్పత్తి కింద 70 టీఎంసీలు వెరసి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని లెక్కగట్టిన కేడబ్ల్యూడీటీ–1 మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. 

► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 నాటికి పూర్తయిన, 1976 నాటికి నిర్మాణంలోనూ, ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసింది. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు  749.16 టీఎంసీలు, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీలను కేటాయించింది.  పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. 

పునఃపంపిణీ చేసిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం.. 
కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలిన 30 టీఎంసీల్లో బీమా ఎత్తిపోతల పథకానికి 20, పులిచింతలకు 9 టీఎంసీలను కేటాయిస్తూ ఏప్రిల్‌ 16, 1996న ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేడబ్ల్యూడీటీ–1 పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్‌ ఆధునికీకరణతో మిగిలిన ఎనిమిది టీఎంసీలను కలిపి మొత్తం 19 టీఎంసీలను ఎస్సార్బీసీకి కేటాయిస్తూ జూలై 4, 1994లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే కేడబ్ల్యూడీటీ–1 ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం పునఃపంపిణీ ద్వారా రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కాయి. ఆ మేరకు మూడు ప్రాంతాలు కృష్ణా జలాలను వినియోగించుకున్నాయి. 

బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ఇలా... 
కృష్ణా జలాల పునఃపంపిణీకి ఏప్రిల్, 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌.. బచావత్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పునే ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేస్తూ 2016 అక్టోబర్‌ 19న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కొనసాగించింది. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య అందుబాటులో ఉన్న 163 టీఎంసీల్లో మహారాష్ట్రకు 46, కర్ణాటకకు 68, ఆంధ్రప్రదేశ్‌కు 49 టీఎంసీలను కేటాయించింది. 65 శాతం లభ్యత ఎగువన 285 టీఎంసీల మిగులు జలాల్లో మహారాష్ట్రకు 35, కర్ణాటకకు 105, ఆంధ్రపద్రేశ్‌కు 145 టీఎంసీలను కేటాయించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 173, ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను అదనంగా కేటాయించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 75 – 65 శాతం మధ్య లభ్యతగా ఉన్న జలాల్లో కేటాయించిన 49 టీఎంసీల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్‌ కింద 30 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు(కే–7) ప్రాంతంలో 9, ఆర్డీఎస్‌ కుడి కాలువకు 4, సహజ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది. 145 టీఎంసీల మిగులు జలాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్‌ కింద 120, తెలుగుగంగకు 25 టీఎంసీలను కేటాయించింది. అయితే ఈ తుది నివేదికను సవాల్‌ చేస్తూ  ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నుంచి ఉపసంహరించుకుంది. ఏపీ సర్కార్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారిస్తుండటంతో బ్రిజేశ్‌ తీర్పును కేంద్రం ఇప్పటిదాకా నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బచావత్‌ తీర్పే అమల్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును పొడిగించడంతో గత ఐదేళ్లుగా   కసరత్తు చేస్తోంది. 

కేంద్రం తాత్కాలిక సర్దుబాటు..  
బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయని నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా బచావత్‌ చేసిన కేటాయింపులను పరిగణలోకి తీసుకుని జూన్‌ 19, 2015న ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై కేంద్ర జలవనరుల శాఖ నాటి అదనపు కార్యదర్శి అమర్జీత్‌సింగ్‌ సమక్షంలో ఏపీ జలవనరుల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంతకాలు చేశారు. తాత్కాలిక సర్దుబాటును కృష్ణా బోర్డు తీర్మానం మేరకు ఏటా పొడిగిస్తున్నారు. 





బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అదనంగా కేటాయించిన జలాలు 
కేడబ్ల్యూడీటీ–1 చేసిన కేటాయింపులు 811 టీఎంసీలకు అదనంగా 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. ఇందులో తెలుగుగంగకు 25, జూరాలకు 9, ఆర్డీఎస్‌ కుడి కాలువకు నాలుగు.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో క్యారీ ఓవర్‌ స్టోరేజీ కింద 150 టీఎంసీలు, పర్యావరణ ప్రవాహాలు కింద 6 టీఎంసీలు కేటాయించింది.

విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో కేంద్రం ప్రకటించిన ఆరు ప్రాజెక్టులకు అవసరమైన జలాలు టీఎంసీల్లో  

కృష్ణా జలాల్లో వాటా
తెలంగాణ
కృష్ణా జలాల్లో మాకున్న 299 టీఎంసీల వాటా మరింత పెరగాలి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సరిదిద్దాలి. ఇందులో భాగంగానే కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కృష్ణా జలాలపై  సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి తెలంగాణకు నీటి హక్కులు దక్కేలా చూడాలి.  

కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. 

పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాలి. 

ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చేలోగా ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాన్ని పక్కనపెట్టి ఇకపై ఉమ్మడి రాష్ట్రానికి చేసిన వాటాల్లోంచి సగం వాటా నీటిని వినియోగించుకుంటాం.
 
ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పటివరకు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలి.  

ఆంధ్రప్రదేశ్‌
అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ) 1956 సెక్షన్‌ 6(2) ప్రకారం నదీ జలాలను పంపిణీ చేస్తూ ఒక ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానం. దాన్ని పునఃసమీక్షించడానికి అవకాశం లేదని చట్టం చెబుతోంది. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన 2,130 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లకపోవడానికి ఇదే కారణం. మొత్తంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిన బచావత్‌ మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించింది.

బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను కొనసాగిస్తూనే బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అదనంగా 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసింది. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 194 టీఎంసీలను మాత్రమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. బ్రిజే‹శ్‌ ట్రిబ్యునలే తెలుగుగంగకు 25, ఆర్డీఎస్‌ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. మిగిలిన 165 టీఎంసీల్లో.. విభజన చట్టం  ప్రకారం  ఏపీకి చెందిన హంద్రీ–నీవాకు 40, గాలేరు–నగరికి 38, వెలిగొండకు 43.5 టీఎంసీలు దక్కుతాయి. తెలంగాణకు చెందిన నెట్టెంపాడుకు 22, కల్వకుర్తికి 25 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పును కేంద్రం నోటిఫై చేసినా  ఆంధ్రప్రదేశ్‌ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందే తప్ప తగ్గదు.  

పోతిరెడ్డిపాడుపై..
తెలంగాణ
పోతిరెడ్డిపాడును ఏమాత్రం గుర్తించం. చెన్నైకి తాగునీటినందించేందుకు బచావత్‌ అవార్డులో 15 టీఎంసీలను కేటాయించగా ఏనాడూ అంతమేరకు అందించలేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ)కు 19 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పునఃకేటాయింపులు చేసింది. వీటిని కూడా జూలై–అక్టోబర్‌ వరకే తరలించాల్సి ఉంది. రెండింటికి కలిపి 34 టీఎంసీలను తరలించాల్సి ఉండగా వందల టీఎంసీలను తరలిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో లైనింగ్‌ చేయని కాలువను నిర్మించి రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాల్ని తరలించారు. దీనిపై ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఉమ్మడి ఏపీ పాలకులు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనికి అదనంగా కరెంటు ఉత్పత్తి ద్వారా దిగువకు 5 వేల క్యూసెక్కుల జలాలను విడుదలచేసే పవర్‌ ఛానెల్‌ కూడా చేపట్టారు. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు 1500 క్యూసెక్కుల లైనింగ్‌ కాలువను నిర్మించాల్సి ఉండగా.. 60,500 క్యూసెక్కులు (11,500+44,000+5000) లైనింగ్‌ చేయని కాలువను నిర్మించారు. ఇది అక్రమం. 

ఆంధ్రప్రదేశ్‌
శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎగువన నీటి మట్టం ఉంటేనే ప్రస్తుత డిజైన్‌ మేరకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కృష్ణా బేసిన్‌లో అతివృష్టి, అనావృష్టి వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. దీనివల్ల శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. వరద వచ్చినప్పుడు ఒకేసారి భారీ స్థాయిలో వస్తోంది. వరదను ఒడిసి పట్టేలా కాలువల సామర్థ్యం లేకపోవడంలో వందలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి.  వరద నీటిని ఒడిసి పట్టి చట్టబద్ధంగా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులను 35 నుంచి 40 రోజుల్లో నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కాలువలను విస్తరించే పనులు చేపట్టాం.

సముద్రంలో కలిసే వరద జలాలను మళ్లించి కరువు ప్రాంతాన్ని సుభిక్షం చేయడం తప్పుకాదు. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి, తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిందే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌. ఎస్సార్బీసీకి, తెలుగుగంగకు కేంద్ర జలసంఘం అనుమతి ఉంది. ఎస్సార్బీసీకి బచావత్, తెలుగుగంగకు బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ కింద నీటి కేటాయింపులు ఉన్నాయి. గాలేరు–నగరిని విభజన చట్టం ద్వారా కేంద్రం అధికారికంగా గుర్తించింది. ఈ ప్రాజెక్టుల ఆయకట్టుకు  పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేస్తాం. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను గుర్తించబోమని తెలంగాణ సర్కార్‌ ప్రకటించడంలో అర్థం లేదు. 

బేసిన్లలో నీటి వినియోగం 
తెలంగాణ
సహజ న్యాయ సూత్రాల ప్రకారం బేసిన్‌ తాగు, సాగు అవసరాలు తీరాకే నీటిని ఇతర బేసిన్‌కు తరలించాలని స్పష్టంగా ఉన్నా ఏపీ మాత్రం కృష్ణా నుంచి ఇతర బేసిన్‌లకు తరలిస్తోంది. 367 టీఎంసీలను పెన్నా, ఇతర బేసిన్లకు తరలిస్తున్నారు.
 
శ్రీశైలం నుంచి తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలిగొండ ద్వారా ఇతర బేసిన్లకు నీటిని తరలిస్తున్నారు. 
1977 అక్టోబర్‌ 28న కుదిరిన ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి సరఫరాకుగాను 15 టీఎంసీలను తరలించేందుకు 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న లైనింగ్‌ కాలువ నిర్మించాలి. ఈ కాల్వ ద్వారా కేవలం చెన్నై తాగునీటికే నీటిని సరఫరాచేయాలి. కానీ ఒప్పందానికి విరుద్ధంగా 11,150 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. అనంతరం 55,150 క్యూసెక్కుల  సామర్థ్యానికి పెంచారు. ఈ విషయాన్ని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లలేదు. 

ఒప్పందం ప్రకారం 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాల్సిన ఈ కాల్వ ద్వారా ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీల నీళ్లు ఇతర బేసిన్లకు తరలిపోతాయి. ఇక పెన్నా బేసిన్‌లో నిల్వ కోసం  185 టీఎంసీలతో రిజర్వాయర్లు కట్టారు. ఇందులో వెలిగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 16.950 టీఎంసీలు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్‌ సామర్థ్యం 17.735 టీఎంసీలు, సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 77.988 టీఎంసీలు, కండలేరు సామర్థ్యం 68 టీఎంసీలు, కడపజిల్లా కోసమని మైదుకూరు, దువ్వూరు మండలాల్లో 4.577 టీఎంసీల సామర్థ్యంతో ఉప రిజర్వాయర్లు (ఎస్‌ఆర్‌–1, 2)నిర్మించారు. ఇందులో కండలేరు మినహా మిగిలిన రిజర్వాయర్లన్నీ పెన్నా బేసిన్‌లోనివే.

ఆంధ్రప్రదేశ్‌
తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేస్తూ 1863లో జలరవాణా కోసం డచ్‌ సంస్థ కేసీ(కర్నూల్‌–కడప) కెనాల్‌ను తవ్వింది. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నివేదిక ఆధారంగా కేసీ కెనాల్‌ను 1933లో నీటిపారుదల ప్రాజెక్టుగా బ్రిటీష్‌ సర్కార్‌ మార్చింది. ఈ కెనాల్‌ కింద 2,65,628 ఎకరాలకు నీళ్లందించడానికి బచావత్‌ 39.90 టీఎంసీలను కేటాయించింది. ఫిబ్రవరి 15, 1976న జరిగిన ఒప్పందం మేరకు తెలుగుగంగ చేపట్టాం.  బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ 25 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టం ద్వారా గాలేరు–నగరిని కేంద్రం అధికారిక ప్రాజెక్టుగా గుర్తించింది. కృష్ణా జలాలను ఇతర బేసిన్‌లకు మళ్లించడం అక్రమమని తెలంగాణ సర్కార్‌ ఆరోపించడంలో అర్థం లేదు.  

తెలంగాణ సీఎం కేసీఆరే ‘బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. నదీ జలాలను మళ్లించి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తాం.. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి సహకరిస్తాం’ అని ప్రకటించారు.   

నదుల అనుసంధానంతో సముద్రం పాలవుతోన్న జలాలను మళ్లించి దుర్భిక్షాన్ని తరిమికొట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 27, 2012న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు కేంద్రం అనుసంధానాన్ని చేపట్టింది. ఈ అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రానికి పూర్వమే చేపట్టిన కేసీ కెనాల్‌.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపట్టిన తెలుగగంగే స్ఫూర్తి అని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పేర్కొంది.  

ప్రాజెక్టులపై..
తెలంగాణ
కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో  పాలనా అనుమతులు జారీ చేయడం అసమంజసం. ఈ ప్రాజెక్టును ఒప్పుకోం. ఈ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేవు, కేంద్ర జల సంఘం అనుమతులు సైతం లేవు. గతంలో కేంద్ర జల సంఘం ద్వారా నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు ఈఏసీ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు. 

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సైతం నిర్మాణ పనులు కొనసాగించవద్దని చెప్పినా వినడం లేదు. ఇది కోర్టు ధిక్కరణే. 
బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అవార్డు కాకుండానే ఆర్డీఎస్‌ కుడి కాల్వ విస్తరణ పనులను ఏపీ చేపడుతోంది. ఇది విభజన చట్టానికి విరుధ్దం. 
పాలమూరు ఎత్తిపోతలపై సమగ్ర అధ్యయన నివేదిక కోసం 2013 ఆగస్టు 8న జీవో 72 ఇచ్చారు. 2014 ఏప్రిల్‌ 22న అప్పటి ప్రధాని సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని  హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టును రీ డిజైన్‌ చేశాం.  ఇది పాత ప్రాజెక్టే. 
డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. 2010 డిసెంబర్‌ 10న ప్రధాని కార్యాలయం సైతం డిండిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకొనేందుకు ప్రతిపాదన కోరింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని రీ డిజైన్‌ చేశాం. 
తుమ్మిళ్ల ఎత్తిపోతలను సైతం తుంగభద్రలో మా వాటాను వినియోగించుకునేలా చేపట్టాం. 

ఆంధ్రప్రదేశ్‌
రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌(రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కుడి కాలువలను అక్రమ ప్రాజెక్టులగా అభివర్ణించడం, పనులను ఆపాలని తెలంగాణ సర్కార్‌ కోరడం అర్థరహితం.  

తెలుగుగంగ, ఎస్సార్బీసీ, తెలుగగంగ, కేసీ కెనాల్‌  శ్రీశైలం కుడి గట్టు కాలువలకు 111 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. మాకు దక్కిన 512 టీఎంసీలను సమర్థంగా వినియోగించుకుని ఆయకట్టును స్థిరీకరణకే రాయలసీమ 
ఎత్తిపోతల చేపట్టాం. 

శ్రీశైలంలో 796 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ  విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 4 టీఎంసీలు.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి ద్వారా 2.4 టీఎంసీలు, 825 అడుగుల నుంచి సామర్థ్యం పెంచిన ఎస్సెల్బీసీ ద్వారా 0.5 చొప్పున 2.9 వెరసి.. 6.9 టీఎంసీలను తరలించడం వల్ల  నీటి మట్టం తగ్గిపోతోంది. శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 44 వేల క్యూసెక్కులు తరలించడానికి అవకాశం ఉంటుంది. 854 అడుగులోల నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కాలువల నుంచి 7 వేలు క్యూసెక్కులు తీసుకెళ్లవచ్చు. 848 అడుగులకు నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు నీళ్లు చేరవు. 

శ్రీశైలం నుంచి తెలంగాణ సర్కార్‌ ఎడాపెడా తోడేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు నీళ్లందడం లేదు. నీటి కేటాయింపులు ఉన్న ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీళ్లందించడానికి, చెన్నైకి తాగునీటిని అందించడానికే సీమ ఎత్తిపోతల చేపట్టాం. ఆర్డీఎస్‌ కుడి కాలువకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికే కుడి కాలువ పనులు చేపట్టాం.  

కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, మిషన్‌ భగీరథ, భక్తరామదాస ఎత్తిపోతల, సామర్థ్యం పెంచిన  కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్సెల్బీసీసహా 24 ప్రాజెక్టులను తక్షణమే 
నిలిపేయాలి. 

నీటి కేటాయింపులపై
తెలంగాణ
రాష్ట్రానికి కృష్ణా బేసిన్‌లో 68.5 శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 36.9 శాతమే ఉన్నాయి. అదే ఏపీకి 31.5శాతం పరీవాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 367 టీఎంసీలు ఏపీ బేసిన్‌ బయటే వాడుకుంటోంది. కృష్ణా పరీవాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణకు 37.11 లక్షల హెక్టార్లు ఉండగా ఏపీకి కేవలం 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. అయినా ఏపీకి కేటాయింపులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్‌లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో కేవలం 78.29 లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్నా తెలంగాణకు కేటాయింపులు పెరగాలి.

ఆంధ్రప్రదేశ్‌
పరీవాహక ప్రాంతం ఆధారంగా నదీ జలాలను ట్రిబ్యునల్‌ పంపిణీ చేయదు. ఒప్పందాలు, వినియోగం ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తుంది. ట్రిబ్యునల్‌ ఏర్పాటయ్యేనాటికి పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకు లభ్యత ఆధారంగా కేటాయింపులు చేస్తుంది. బచావత్‌ ఏర్పాటయ్యేనాటికి అంటే 1969 నాటికే ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లో పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలవినియోగం ఉండేది. దాంతో ఆ ప్రాజెక్టులకు బచావత్‌ నీటి కేటాయింపులు చేసింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలు కేటాయించింది. ఎక్కడా పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ పరీవాహక ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక పరీవాహక ప్రాంతం ఉన్న కర్ణాటకకు 734 కేటాయించి.. తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించేది కాదు. 

మళ్లింపు జలాల్లో వాటా
తెలంగాణ
1976 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణాలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. కృష్ణా నీటిలో దక్కే 80 టీఎంసీలకుగానూ 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్‌ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుంది.  పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలి. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి.  

ఆంధ్రప్రదేశ్‌
పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, నాగార్జునసాగర్‌కు ఎగువన ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్‌ అవకాశం కల్పించింది. ఇందులో 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ సర్కార్‌ వాదిస్తుండటం అన్యాయం. నాగార్జునసాగర్‌కు ఎగువన ఆంధ్రపదేశ్‌కు కూడా ఆ జలాలు దక్కుతాయన్న వాస్తవం తెలుసుకోవాలి. తెలంగాణ సర్కార్‌ కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 6.43, ఎస్సారెస్పీ ద్వారా మున్నేరు, మూసీ సబ్‌ బేసిన్‌లకు 68.40, దేవాదుల ద్వారా 24.650, కాళేశ్వరం ద్వారా 83.190, వరద కాలువ ద్వారా 28.395 వెరసి 211.45 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ జలాలకుగానూ కృష్ణా జలాల్లో 211.45 టీఎంసీలను ఏపీకి అదనపు వాటాగా ఇవ్వాలి. 

తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్క 
తెలంగాణ
హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని 2016లో కృష్ణా బోర్డును కోరాం. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోంది. తాగునీటి కోసం కేటాయించిన మొత్తం జలాల్లో 80 శాతం తిరిగి నదిలోకే వస్తాయి. తాగునీటి కేటాయింపులను కేవలం 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ సైతం తేల్చిచెప్పింది. దీని ప్రకారం కృష్ణా జలాల్లో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కేటాయించిన 16 టీఎంసీల్లో కేవలం 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.  

ఆంధ్రప్రదేశ్‌
హైదరాబాద్‌ తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. తాగునీటి కోసం తరలించే జలాల్లో 20 శాతం తాగునీటికి వెళ్తాయి. మిగిలిన 80 శాతం నీరు మురుగునీటి కాలువల ద్వారా తెలంగాణలోని చెరువులు, చిన్నతరహా ప్రాజెక్టులకే చేరుతాయి. ఆ నీటితో తెలంగాణలో పంటలు కూడా పండించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు తాగునీటి కోసం తరలించే కృష్ణా జలాల్లో 20 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదన ఏమాత్రం సబబు కాదు. 

బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు
తెలంగాణ
కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నాలకు మేం వ్యతిరేకం. ఇప్పటికి జరిగిన రెండు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీల్లోనూ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడాన్ని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌¯  85(1) ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిగాకే నియంత్రణపై ముందుకెళ్లాలి.  

ఆంధ్రప్రదేశ్‌
బ్రిజేశ్‌  తీర్పును కేంద్రం నోటిఫై చేసేదాకా కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ వాదించడం అసంబద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా జలాలను బచావత్‌ కేటాయించింది. కేంద్రం తక్షణమే బోర్డు పరిధిని నోటిఫై చేయాలి.  శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తెచ్చి వాటిపై ఆధారపడిన సాగు, తాగునీటి ప్రాజెక్టులతోపాటూ విద్యుత్కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తెచ్చి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలి.

ఇతర బేసిన్లకు కుదరదు..
శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని బచావత్‌ చెప్పింది. విద్యుత్‌ అవసరాలకు మినహా వేరే అవసరాలకు ఒక్క బొట్టు కూడా వాడొద్దు అని చెప్పింది. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ కూడా ఇదే చెప్పింది. విద్యుదుత్పత్తిని ప్రాజెక్టుల్లోని ఏ మట్టం నుంచైనా చేపట్టవచ్చు. తెలంగాణ అవసరాలు పట్టించుకోకుండా పక్క బేసిన్‌లకు నీటిని తరలిస్తామంటే కుదరదు.      
– రంగారెడ్డి, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ 

కొత్తగా కోరడం లేదు
కృష్ణా జలాల్లో నీటి వాటాలు పెంచాలని కొత్తగా అడగడం లేదు. బేసిన్‌ అవసరాలు తీరాక వరద జలాలు తరలించుకుంటే ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. పోలవరానికి సీడబ్ల్యూసీ అధికారిక అనుమతి వచ్చిన వెంటనే సాగర్‌ ఎగువన ఉన్న తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలి’ 
– శ్యాం ప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి 

కేటాయింపులు పెరగాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు మొదటినుంచీ అన్యాయం జరిగింది. కేవలం 13శాతం పరీవాహకం ఉన్న ఆంధ్రా ప్రాంతం 45శాతం నీటిని అంటే 367 టీఎంసీలను వినియోగిస్తోంది. నిజానికి ఆంధ్రా ప్రాంతానికి ఉన్న అర్హత 106 టీఎంసీలు మాత్రమే. గతం నుంచి నీటిని అనుభవిస్తున్నామని సాకుగా చెబుతూ దానిని హక్కుగా చూపరాదు.  
– దొంతు లక్ష్మీనారాయణ, రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్‌ 

పునఃపంపిణీ చట్టవిరుద్ధం
ట్రిబ్యునల్‌ ఒక్క సారి నదీ జలాలను పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత పునఃసమీక్షించడానికి వీల్లేదు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్‌ కేటాయించిన 2130 టీఎంసీలను బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ పునఃపంపిణీ చేయకపోవడానికి కారణమదే. సెక్షన్‌–3 ప్రకారం  కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధం.   
– డి.రామకృష్ణ, రిటైర్డు సీఈ

సాగునీటి అవసరాలకే..
ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీశైలం, సాగర్, పులిచింతల నిర్వహణ ప్రోటోకాల్స్‌ రూపొందించారు. శ్రీశైలంలో మట్టం 834 అడుగులు దాటాకే సాగర్, కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేయాలి. 2014 నుంచి నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటి నుంచే కృష్ణా బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా తెలంగాణ  విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ఖాళీ చేస్తోంది.  
 – ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డు ఈఎన్‌సీ 

రాయలసీమ ఎత్తిపోతలే శరణ్యం
శ్రీశైలంలో 796 అడుగుల నుంచే  రోజుకు 4 టీఎంసీలు, అక్రమంగా చేపట్టిన పాలమూరు, డిండి, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ ద్వారా 800 అడుగుల నుంచే రోజుకు 2.9 టీఎంసీల చొప్పున మొత్తం 6.9 టీఎంసీలు తరలిస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. దీన్ని అధిగమించాలంటే 800 అడుగుల నుంచే  పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు దిగువకు ఎత్తిపోయడం మినహా మార్గం లేదు.  
– నారాయణరెడ్డి, ఈఎన్‌సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement