Power generation
-
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
రక్తం తాగే గబ్బిలం..పరుగెడుతోంది మన కోసం..
గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..ఆహార అలవాటే కీలకం..సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా. శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.ట్రెడ్‌మిల్‌పై పరుగుపెట్టించడం ఎందుకు? సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్‌మిల్‌పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.దీనివల్ల మనకేంటి లాభం? సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్‌లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
హైడల్.. పవర్ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఈ ఏడాది జలవిద్యుత్ ఆదుకుంది. కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నిరంతర వరద కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది (2024–25)లో 4,050 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుదుత్పత్తి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అంచనా వేసింది. ఇప్పటికే 3,828.52 ఎంయూల ఉత్పత్తి జరిగింది. కృష్ణా పరీవాహకానికితోడు గోదావరి పరిధిలోని సింగూరు, నిజాంసాగర్, పోచంపాడు జలాశయాల్లో ప్రస్తుతం గరిష్ట నీటిమట్టం మేరకు నిల్వలుండగా, ఎగువ నుంచి ఇంకా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా జలాశయాల్లో 584.1, గోదావరి జలాశయాల్లో 137.5 కలిపి మొత్తం 721.6 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నిల్వలతో మరో 2,206 ఎంయూల జలవిద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6,034 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశముంది. దిగివచ్చిన జలవిద్యుత్ ధరలుతెలంగాణ పరిధిలో 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాలుండగా, అందులో 2,324 మెగావాట్ల వాటాను మన రాష్ట్రం కలిగి ఉంది. వీటికి సంబంధించిన విద్యుత్ ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం 2024–25లో రూ.1,129 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా జెన్కోకు ఈ మేరకు ఫిక్స్డ్ ధర వ్యయాన్ని డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో గతేడాది(2023–24) 830 ఎంయూల జలవిద్యుదుత్పత్తి మాత్రమే జరిగింది.జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్ ఫిక్స్డ్ ధర 2022–23లో యూనిట్‌కు రూ.2.32 ఉండగా, 2023–24లో ఉత్పత్తి తగ్గడంతో రూ.8.51కు పెరిగింది. దీంతో డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయి. డిస్కంల సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగి యూనిట్‌కు రూ.5.72కు చేరడానికి కారణమైంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 2.69 శాతం అధికం. ఈ ఏడాది 6000 ఎంయూలకు పైగా జలవిద్యుదుత్పత్తి జరిగే అవకాశాలుండడంతో మళ్లీ వాటి ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం గణనీయంగా తగ్గనుంది. యూనిట్‌కు కేవలం రూ.1.9 పైసల ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం అవుతుందని అంచనా. జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్‌కు ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. వెరియబుల్ కాస్ట్ ఉండదు. మొత్తంగా రూ.1129 కోట్ల వ్యయానికే 6,000 ఎంయూల జలవిద్యుత్ లభించనుంది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఇది భారీ ఊరటతోపాటు వినియోగదారులకు భవిష్యత్‌లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల వసూళ్ల నుంచి కొంత వరకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా 2021–22లో 5,371 ఎంయూలు, ఆ తర్వాత 2022–23లో 5,741 ఎంయూల జలవిద్యుదుత్పత్తి అయ్యింది. మరమ్మతులు జరగక..459 ఎంయూల విద్యుదుత్పత్తికి గండి రాష్ట్రంలో మొత్తం 2,442 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాలుండగా, సుదీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో మొత్తంగా 301.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో 12.35 శాతం నిరుపయోగంగా మారింది. ఒకవేళ వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించి ఉంటే పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేసుకోవడానికి ఈ ఏడాది అవకాశముండేది మరమ్మతులు జరపకపోవడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 459 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి గండిపడింది. యూనిట్‌కు అత్యల్పంగా రూ.2.5 ధరతో లెక్కించినా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగి ఉంటే ఇప్పటి వరకు మొత్తం 4,287 ఎంయూలకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగి వార్షిక లక్ష్యాన్ని దాటిపోయేది. -
బయటపడ్డ నాగార్జునసాగర్ జెన్ కో అధికారుల నిర్లక్ష్యం
-
నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం
సాక్షి, నల్లగొండ జిల్లా: జెన్కో అధికారుల తీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం ఏర్పడింది. ఎనిమిది యూనిట్లలో కేవలం ఏడింటిలోనే విద్యుదుత్పత్తి జరుగుతోంది. రెండో యూనిట్ పనిచేయడం లేదు. ఏడాది క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. అయినా నేటికి మరమ్మతులు చేయించకపోవడంతో రెండున్నర నెలలుగా విద్యుదుత్పత్తికి అంతరాయం కలుగుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్లలో ఒక్కో యూనిట్లో ప్రతి రోజూ 100 మెగా వాట్ల ఉత్పత్తి జరుగుతుంది. 75 రోజులుగా సాగర్‌లో ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఒక్కో రోజు 100 మెగా వాట్ల చొప్పున 750 మెగా వాట్ల నష్టం వాటిల్లుతోంది. అయినా మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ నుంచి సాంకేతిక పరికరాలు రావాలని అధికారులు సమాధానం చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. -
‘విద్యుత్’కు రోల్‌మోడల్‌గా రాష్ట్రం
సాక్షి, పెద్దపల్లి: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో తెలంగాణను దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 2030 నాటికి ఉండే డిమాండ్‌ను అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజీ తదితర రంగాల్లో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం, పెద్దపల్లిలో ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో భట్టి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ వ్యవసాయ మోటార్లకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వ్యవసాయ రంగానికి ఉపయోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా నందిమేడారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాచాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడ అందుబాటులో ఉన్న 12 ఎకరాలు సేకరించి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను డిప్యూటీ సీఎం ఆదేశించారు.రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు. దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపించి, వారి ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు బజారున పడటం బాధ కలిగించింది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ.. బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారునపడి కొట్లాడుకోవడం బాధ కలిగించిందని భట్టి అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితమని పేర్కొన్నారు. కాగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘యాదాద్రి’లో డిసెంబర్‌లోగా విద్యుదుత్పత్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని అన్ని యూనిట్ల (ఐదు)లో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రా రంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నా రు. మిగతా రెండు యూనిట్లలో మార్చి 31 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిపై అ«ధికారులతో సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు.. మార్చి 31కి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సివిల్ పనులతోపాటు రైల్వే లైన్, రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి చెప్పారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి యూనిట్ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో ఉద్యోగాలు కలి్పస్తామని, ఇచి్చన మాట ప్రకారం వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2015 జూన్ 8న థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగ్గా, 2017 అక్టోబర్‌లో పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాలని చేయాల్సి ఉన్నా.. చేయలేదన్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వం 50 శాతం దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బొగ్గును వినియోగించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వినియోగించిందని, దీంతో పర్యావరణ వేత్తలు కేసు వేశారన్నారు. అందువల్లే ఎన్జీటీ క్లియరెన్స్‌ను సస్పెండ్ చేసిందని వివరించారు. అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ఆలస్యమయ్యేది కాదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్జీటీ క్లియరెన్స్‌ను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తద్వారానే ఆయిల్ సింక్రనైజేషన్ చేసే స్జేజీకి తెచి్చనట్లు పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులను పూర్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జెన్కో ఎండీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. -
వరద కాలువలోనూ ‘విద్యుదుత్పత్తి’ చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను సది్వనియోగం చేసుకునే లక్ష్యంతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తారు. వరద కాలువ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. 2010 నుంచి దీని ద్వారా మిడ్‌మానేరుకు నీటిని వదులుతున్నారు. గతంలో ఒక సీజన్లో అత్యధికంగా 56 వేల క్యూసెక్కుల నీటిని సైతం వదిలారు. ఈ కాలువ వద్ద పంప్‌హౌస్ నిర్మాణం చేస్తే 90 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి ఆధారంగా 4 టర్బైన్లతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించారు. ఈ కాకతీయ కాలువ సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. ఒక్కో టర్బైన్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటి ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4 టర్బైన్ల ద్వారా 8,800 క్యూసెక్కుల నీటితో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వరద కాలువ నుంచి సైతం విద్యుదుత్పత్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. 13 ఏళ్లుగా వరద కాలువ ద్వారా ప్రతి సంవత్సరం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో గరిష్టంగా వరద కాలువ ద్వారా ఒక సీజన్లో 56 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భంగా కూడా ఉంది.ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా చేస్తున్న విద్యుదుత్పత్తికి మూడు రెట్లు ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. కాకతీయ కాలువ టర్బైన్లతో పోలిస్తే వరద కాలువకు ఇలాంటి 10 టర్బైన్లు నిర్మించే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతుండడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీంతో గత పదేళ్లుగా 42 వరద గేట్లును ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. మరోవైపు వరద కాలువ ద్వారా కూడా నీటిని మిడ్‌మానేరుకు విడుదల చేస్తున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి ప్రతిఏటా భారీగా వరద నీరు వస్తోంది. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదకాలువ వద్ద పంప్‌హౌస్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్‌తో వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలించారు. కాగా 1,091 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న ఎస్సారెస్పీకి 1,075 అడుగుల మేర నీటిమట్టం చేరగానే వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. -
ఇంత సోమరితనమా?
సాక్షి, హైదరాబాద్: ‘జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.జలవి ద్యుత్ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్‌లో జెన్కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. మనసుపెట్టి పనిచేయండి.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘విద్యుత్’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ.. విద్యుత్ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..
దేశీయంగా చిన్న, మధ్య తరహా న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 2070 నాటికి జీరో ఉద్గారాలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు. భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించే విదేశీ కంపెనీలు ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’, ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల’కు సమీప భవిష్యత్తులో చాలా గిరాకీ ఏర్పడుతుందంటున్నారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కార్బన్ నిర్మూలన ప్రణాళికల్లో భాగంగా అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1000 MWe(మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ) సామర్థ్యం ఉన్న సంప్రదాయ అణు కర్మాగారాలు భారీ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. భద్రతా సమస్యల కారణంగా భూమి లభ్యత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులుఇదిలాఉండగా, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం 300 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లగా నిర్వచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ సమయమే పడుతుంది. వీటి ద్వారా వచ్చే విద్యుత్తును సులభంగా సరఫరా చేయవచ్చు. మాడ్యులర్ డిజైన్ ప్లాంట్లను రిమోట్ ఏరియాల్లో నిర్మించేలా అనుమతులు కూడా త్వరితగతినే లభిస్తాయి. అందుకే ప్రభుత్వం బడ్జెట్లో ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రియాక్టర్ల నిర్మాణం, ఇంజినీరింగ్ టెక్నాలజీ, విద్యుత్ పరికరాలు, భద్రత సేవలందించే సంస్థలు ప్రభుత్వ నిర్ణయంతో లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్‌స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్‌లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్‌కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్‌ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్‌లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్‌లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్‌కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. -
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్‌లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
సౌర విద్యుత్‌లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతోంది. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక రూపొందించింది. దేశంలో గతేడాది (2022–23లో) సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలో టన్నులకు చేరుతుందని వెల్లడించింది. సౌర వ్యర్థాల్లో దాదాపు 67 శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. మన దేశంలో 2070 నాటికి కాలుష్యపూరితమైన కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కాలుష్యాన్ని వాతావరణం నుంచి పారద్రోలాలని రాష్ట్రాలకు చెప్పింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతోంది. మన దేశం 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ ఇప్పటికే స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించి ఆదర్శంగా నిలిచింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రాష్ట్రం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుతూ రాష్ట్రం టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ చేస్తే సరి వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరుల కారణంగా ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23 రెట్లు పెరిగింది. రానున్న ఆరేళ్లలో (2030 నాటికి) 292 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని పెంచాలనేది లక్ష్యం. అయితే సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుండి వచ్చే వ్యర్థాలు ఓ సవాలుగా మారనున్నాయి. నిజానికి ఫోటో వాల్టాయిస్ (పీవీ)ల జీవిత కాలం 25 ఏళ్లు. ఆ తర్వాత అవి వ్యర్ధాలుగా మారతాయి. కాకపోతే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పీవీలు పగిలిపోవచ్చు. కొంత కాలం తరువాత కొన్ని పనిచేయకపోవచ్చు. కొన్ని నాణ్యత పరీక్షల్లో విఫలమై పక్కన పడవచ్చు. రవాణా సమయంలో కొన్ని దెబ్బతింటాయి. అలాంటివి వ్యర్థాలుగా మారుతుంటాయి. ఈ మాడ్యూల్స్‌లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే 2030 నాటికి సుమారు 340 కిలోటన్నుల వ్యర్ధాలు రావచ్చని అంచనా. ఈ వ్యర్ధాల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో కలిపి వ్యర్ధాలు 600 కిలోటన్నులకి చేరుకోవచ్చు. 2050 నాటికి దాదాపు 19,000 కిలో టన్నులకి పెరుగుతాయని అంచనా. వ్యర్ధాలను తొలగించడం కోసం రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గం. అంతేకాదు రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్‌ను కూడా తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
‘పునరుత్పాదక విద్యుత్’.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్‌క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్లో క్లీన్ ఇన్వెస్ట్మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. 21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది.. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. అదే ఏడాది నాటికి భారత్‌లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
‘మాచ్‌ఖండ్’లో రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 88.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తరచూ జనరేటర్ల మరమ్మతులతో సతమతమయ్యే ఉద్యోగులు, ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమించి ఈ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యేలా ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉన్నాయి. మూడు జనరేటర్ల నుంచి 51 మెగావాట్లు, మరో మూడు జనరేటర్ల నుంచి 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 66 ఏళ్లుగా ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్నా, పురాతన యంత్రాలు కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీరు డుడుమ, జోలాపుట్టు జలశాయాల్లో ఉన్నప్పటికీ, తరచూ జనరేటర్ల మరమ్మతులతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఈ సమస్యలతో స్టేషన్ ఐదుసార్లు షట్‌డౌన్ అయ్యేసరికి దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ, డీఈఈలు, ఏఈఈలు దృష్టి పెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో తీవ్రంగా శ్రమించి ప్రాజెక్టును గాడిలో పెట్టారు. దీని ఫలితమే గతేడాది డిసెంబరులో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. గడచిన 25 ఏళ్లలో ఇదే అత్యధికం. గత ఏడాది జూన్ నెలలో 79.42 మిలియన్ యూనిట్లు, జూలైలో 84.75, ఆగస్టులో 86.275, సెప్టెంబర్‌లో 69.54, అక్టోబర్‌లో 86.58, నవంబర్‌లో 82.62, డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరిగింది. శతశాతం ఉత్పాదన విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం పని తీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన శత శాతం జరుగుతోంది. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాలకు దీటుగా ఉత్పాదకత ఉంటుంది. డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తి జరగడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తాం. – ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరావు, సీనియర్ ఇంజనీర్, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం -
గృహాలపై సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకునే విధంగా గృహాలు, కమర్షియల్ భవనాలపై సౌరవి ద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకునేవారి కోసం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పా దక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో)పై సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీతో కలిసి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. 1–3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.18 వేలు, 3–10 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.9 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. సమీక్షలో టీఎస్ రెడ్కో ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
Isro: ఫ్యూయెల్ సెల్ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త(ఇస్రో) ఏడాదిలోనూ దూసుకుపోతోంది. కొత్త సంవత్సరం తొలిరోజున పీఎస్ఎల్వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరుకు సంబంధించిన డేటాను సేకరించింది. ఈ డేటాతో ఫ్యుయెల్ సెల్ పనితీరును పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది. ఈ విషయాన్ని ఇస్రో శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్రో ఫ్యుయెల్ సెల్‌ను రూపొందించింది. వంద వాట్ల క్లాస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయెల్‌సెల్‌ను విజయవంతంగా పరీక్షించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రసాయన చర్యలో ఫ్యుయెల్ సెల్ కేవలం నీటిని మాత్రమే బై ప్రోడక్ట్‌గా విడుదల చేసింది. ఇదే లాంచ్ వెహికిల్లలో ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్‌పోశాట్‌ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో పాటు మరో 10 పరికరాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. అంతరిక్షంలో వెలువడే ఎక్స్-రే కిరణాల మూలాలపై పరిశోధించేందుకు ఎక్స్‌పోశాట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. నాసా తర్వాత అంతరిక్షంలో వెలువడే ఎక్స్‌రే కిరణాలపై పరిశోధన చేస్తున్నది ఇస్రోనే కావడం విశేషం. ఎక్స్‌రే కిరణాల మీద పరిశోధనకుగాను అమెరికా 2021లో ఐఎక్స్‌పీఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. POEM-3 on PSLV-C58: VSSC/ISRO successfully tests a 100 W class Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58's orbital platform, POEM3.https://t.co/f5SGqh1ZUR Powering missions with efficiency and emitting only water, these fuel cells are the future for power production in… pic.twitter.com/lCbsZF9UIB — ISRO (@isro) January 5, 2024 ఇదీచదవండి..15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’ -
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్‌ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్‌కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్‌కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్‌కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్‌ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
విద్యుత్ పొదుపుతో భవిష్యత్‌కు వెలుగు
సాక్షి, అమరావతి: ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది.. కానీ విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. బయటి నుంచి చల్లగాలి శరీరాన్ని తాకుతున్నా.. ఫ్యాన్లు, ఏసీలు ఆపడానికి ఇష్టపడం. ఈ విధంగా విద్యుత్ పొదుపులో మనం చేస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదముంది. వచ్చే 39 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వనరులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మేలుకోకపోతే విద్యుత్ వెలుగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అనేక దేశాలు విద్యుత్ పొదుపు చర్యలకు నడుం బిగించాయి. మన దేశంలో ఈ బృహత్తర యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 20 వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. భవిష్యత్ తరాల కోసం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టిస్తోంది. అలాగే భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటోంది. మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ.. 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. అయితే విద్యుత్ వెలుగులను భావితరాలకు అందించడానికి నేటి తరం కూడా తమ వంతు బాధ్యతగా విద్యుత్ పొదుపు పాటించాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బొగ్గు కొరతతో తిప్పలు.. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. చైనా, ఆ్రస్టేలియాలో బొగ్గు కొరత వల్ల పలు దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం నెలకొంది. శీతాకాలంలోనైనా వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ఉపయోగించాలని.. హీటర్లకు వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. అమెరికాలో గతేడాది కంటే 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధన ధరలు పెరగడంతో అక్కడ ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. భారత్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. అలాంటి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈపీడీసీఎల్‌కు ఈఈఎస్ఎల్ ప్రశంసలు సాక్షి, విశాఖపట్నం: ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3,265.47 కోట్ల విలువైన 5,062.48 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆదర్శంగా నిలిచింది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈపీడీసీఎల్‌ను ఎనర్జీ ఎఫీషియన్సీ సర్విస్ లిమిటెడ్ సీఈవో విశాల్‌కపూర్ ప్రశంసించారు. అలాగే 2018–19 నాటికి 6.68 శాతంగా ఉన్న నష్టాలను.. 2023–24 సెపె్టంబర్ నాటికి 5.14 శాతానికి తగ్గించుకుంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వి తేజ్ మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టిన పాలసీని అమలుచేస్తూ విజయాలు సాధిస్తున్నాం. పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు ఎక్కువగా జరిగేలా చూస్తున్నాం. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాం. వినియోగదారులు చేస్తున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తున్నాం’ అని చెప్పారు. -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్‌పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్‌స్టవ్‌లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్‌తో ఆరోగ్యం.. ‘ఎన్‌ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్‌లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్‌పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్‌లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్