సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాలను పెంచడంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంలో మరో ముందడుగు పడింది. దిగువ సీలేరు హైడ్రో పవర్ హౌస్ వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి.
తాజా అనుమతులతో యూనిట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. మరో 230 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద పవర్ కెనాల్ పనులను మెరుగుపరచనున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంపాక్ట్ అసెస్‌మెంట్ విభాగం నుండి ఏపీ జెన్‌కోకు ఆదేశాలు అందాయి.
ఉత్పత్తి సామర్ధ్యం పెంచేలా
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. మోతుగూడెం వద్ద గల సీలేరు కాంప్లెక్స్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్థాపిత సామర్థ్యం 460 మెగావాట్లు. పవర్ హౌస్ నిర్మాణ సమయంలోనే 115 మెగావాట్ల సామర్ధ్యం గల మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నారు.
రూ. 415 కోట్లతో నిర్మించే ఈ యూనిట్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి దోహదపడుతుంది. ఈ యూనిట్ల పనులను 2024 చివరికి పూర్తి చేయాలని ఏపీ జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్–3 ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభించింది.
ఈ యూనిట్ రోజూ దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందిస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్‌టీటీపీఎస్)లో 800 మెగావాట్ల నూతన యూనిట్ మరో నెల రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ ప్రారంభించిన 3 నెలల తర్వాత వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి.
కాంట్రాక్టర్ సిద్ధం
దిగువ సీలేరు హైడ్రో ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ అనుమతి వచ్చిన విషయాన్ని ఏపీ జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయనంద్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పీక్ టైమ్ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రీమియం ధరకు విద్యుత్ కొనుగోలును నివారించడానికి అదనపు యూనిట్ల నిర్మాణాన్ని ఏపీ జెన్‌కో చేపట్టిందని, తద్వారా విద్యుత్, డబ్బు రెండూ ఆదా అవుతాయని చక్రధర్‌బాబు తెలిపారు.
సీలేరులో అదనపు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని, కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నందున, పనులను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వివరించారు. విజయానంద్ స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం వల్లనే ఇంధన రంగంలో ఇన్ని మైలురాళ్లను సాధించగలుగుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెన్‌కో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశులురెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment