విద్యుత్ సంస్థల డైరెక్టర్ల నియామకంలో నిబంధనలు గాలికి
ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే పోస్టింగులు
కొనసాగుతున్న మొక్కుబడి ఇంటర్వ్యూలు
అన్నీ మీకే అయితే మేమేమవ్వాలంటున్న కాపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టుల భర్తీకి జరుగుతున్న ఇంటర్వ్యూలు రెండో రోజు మంగళవారమూ మొక్కుబడిగానే సాగాయి. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోలో డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నిబంధనలు గాలికొదిలేసి, ఇస్టానుసారం మార్చేసుకుంది. కనీస అర్హత లేకున్నా వారికి నచ్చిన వారైతే అన్నింటినీ ఉల్లంఘించి అర్హత ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ పోస్ట్‌కు కనీస అర్హత మూడు సంవత్సరాల కాలంలో సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి ఉండాలి. కానీ జెన్‌కోలో డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కార్పొరేషన్‌లో చేరిన ఓ అధికారికి నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ పోస్టుకు అర్హత కల్పించారు. ఆయన సహచరులు జెన్‌కోలో డీఈలుగానే ఉన్నారు. ఆయనకు హెచ్‌ఆర్ డైరెక్టర్ పోస్టుకు అవకాశమిచ్చారు.
చిత్రమేమిటంటే ఇదే అభ్యర్ధిని థర్మల్, హైడల్ డైరెక్టర్ పోస్టులకు అనర్హుడిగా పేర్కొన్నారు. డైరెక్టర్ల పోస్టుల భర్తీలో అడ్డగోలు నిబంధనలకు ఇదో ఉదాహరణ. దాదాపు అన్ని పోస్టులకు తమ వారికి అనుగుణంగా ఇలా నిబంధనలు మార్చేశారు. బుధవారం ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
కాపు సంఘాల ‘సామాజిక’ ఉద్యమం
విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు పైరవీల కారణంగా తమ సామాజిక వర్గం అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో గత ఎన్నికల్లో కాపులు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారని, కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ రంగంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనుభవజ్ఞులు, నిజాయితీపరులు, చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పని చేసిన వారు చాలా మంది ఉన్నారని, వారందరూ డైరెక్టర్ పోస్టులకు అర్హులని, దామాషా పద్ధతిలోనైనా న్యాయం జరగకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామాషా పద్థతిలో ఇస్తే 15 పోస్టుల్లో జెన్‌కోలో ఒకటి, ట్రాన్స్‌కోలో ఒకటి, డిస్కంలలో ఒక్కొక్కటి చొప్పున కనీసం 5 పోస్టులు కాపులకు వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు.
ఈ వాట్సప్ మెసేజ్‌లను సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కు, మంత్రి లోకేశ్‌కు చేరే వరకూ ఫార్వార్డ్ చేయాలని ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేయడంతో మంగళవారం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment