seeleru
-
‘సీలేరు’లో మరో రెండు విద్యుదుత్పత్తి యూనిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాలను పెంచడంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంలో మరో ముందడుగు పడింది. దిగువ సీలేరు హైడ్రో పవర్ హౌస్ వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి. తాజా అనుమతులతో యూనిట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. మరో 230 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద పవర్ కెనాల్ పనులను మెరుగుపరచనున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంపాక్ట్ అసెస్మెంట్ విభాగం నుండి ఏపీ జెన్కోకు ఆదేశాలు అందాయి. ఉత్పత్తి సామర్ధ్యం పెంచేలా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. మోతుగూడెం వద్ద గల సీలేరు కాంప్లెక్స్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్థాపిత సామర్థ్యం 460 మెగావాట్లు. పవర్ హౌస్ నిర్మాణ సమయంలోనే 115 మెగావాట్ల సామర్ధ్యం గల మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూ. 415 కోట్లతో నిర్మించే ఈ యూనిట్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి దోహదపడుతుంది. ఈ యూనిట్ల పనులను 2024 చివరికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్–3 ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ యూనిట్ రోజూ దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందిస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల నూతన యూనిట్ మరో నెల రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ ప్రారంభించిన 3 నెలల తర్వాత వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. కాంట్రాక్టర్ సిద్ధం దిగువ సీలేరు హైడ్రో ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ అనుమతి వచ్చిన విషయాన్ని ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయనంద్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పీక్ టైమ్ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రీమియం ధరకు విద్యుత్ కొనుగోలును నివారించడానికి అదనపు యూనిట్ల నిర్మాణాన్ని ఏపీ జెన్కో చేపట్టిందని, తద్వారా విద్యుత్, డబ్బు రెండూ ఆదా అవుతాయని చక్రధర్‌బాబు తెలిపారు. సీలేరులో అదనపు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని, కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నందున, పనులను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వివరించారు. విజయానంద్ స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం వల్లనే ఇంధన రంగంలో ఇన్ని మైలురాళ్లను సాధించగలుగుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెన్కో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశులురెడ్డి పాల్గొన్నారు. -
భారమంతా సీలేరుపైనే..
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రబీసాగు ఇక పూర్తిగా సీలేరుపై ఆధారపడాల్సిందే. సాగు కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో సహజ జలాలు గణనీయంగా పడిపోవడంతో సీలేరు నుంచి వచ్చే నీటినే పంట చేలకు మళ్లిస్తూ అధికారులు రబీని గట్టెక్కించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా సీలేరు నుంచి వచ్చే నీటిపైనే సాగు జరగగా, ఇక నుంచి మొత్తం సీలేరు నుంచి వచ్చే నీటిపైనే నెట్టుకు రావాల్సి ఉంది. పంట చేలు పాలుపోసుకుని గింజగట్టి పడే దశకు చేరుకుంది. సాగు ఆలస్యం కావడం వల్ల మార్చి నెలాఖరు నాటికి పూర్తికావాల్సిన రబీ ఏప్రిల్ నెలాఖరు నాటికి కాని పూర్తికాని పరిస్థితి నెలకొంది. అందువల్ల ఎంతలేదన్నా ఏప్రిల్ 20వ తేదీ వరకు డెల్టా కాలువలకు సాగునీరందించాల్సి వస్తోంది. రబీ డిసెంబర్ 1 నుంచి మొదలు కాగా మార్చి 6వ తేదీ వరకు మూడు ప్రధాన పంట కాలువలకు 70.982 టీఎంసీల నీరు అందించారు. దీనిలో సీలేరు నుంచి వచ్చింది 40.338 టీఎంసీలు కాగా, సహజ జలాలు 30.644 టీఎంసీలు. మరో 40 రోజుల పాటు కనీసం 21 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెల్టా కాలువలకు 7 వేల క్యూసెక్కులకు పైబడి నీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 10 తరువాత 5 వేల క్యూసెక్కులు సరిపోతుంది. సగటు ఆరు వేల క్యూసెక్కులు అంటే 40 రోజుల కాలానికి 2.40 లక్షల క్యూసెక్కులు అవసరం. 11 వేల 575 క్యూసెక్కులు ఒక టీఎంసీ. ఆ విధంగా చూస్తే కనీసం 21 టీఎంసీల నీరు అవసరం. డిసెంబర్ 1 నుంచి మార్చి 6వ తేదీ వరకు వినియోగించిన నీరు 70.982 టీఎంసీలు తూర్పుడెల్టాకు 20.994 మధ్యడెల్టాకు 13.901 పశ్చిమడెల్టాకు 35.982 సీలేరు డిసెంబర్ నెలలో 9.809 జనవరి నెలలో 12.182 ఫిబ్రవరి నెలలో 14.778 మార్చి 6వ తేదీ వరకు 3.569 మొత్తం 40.338 సహజ జలాలు 30.644 పడిపోతున్న సహజ జలాలు ఇంతవరకు సహజ జలాల రాక ఆశాజనకంగా ఉన్నా ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం నీటి రాక 8 వేల 100 క్యూసెక్కులు కాగా, దీనిలో సీలేరు వాటా 7వేల 831 క్యూసెక్కులు. అంటే సహజ జలాల రాక కేవలం 269 క్యూసెక్కులు మాత్రమే. వచ్చిన నీటిని తూర్పుడెల్టాకు 2300, మధ్యడెల్టాకు 1,500, పశ్చిమ డెల్టాకు 4,300 చొప్పున మొత్తం 8,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గడిచిన పది రోజులుగా వస్తున్న నీటికన్నా వదిలేది ఎక్కువ కావడం వల్ల బ్యారేజ్ వద్ద పాండ్ లెవెల్ తగ్గుతోంది. నీటి విడుదల అంతంత మాత్రం కావడం, కాలువలపై వంతుల వారీ విధానం వల్ల పంట చేలకు నీరందక రైతులు పాట్లు పడుతున్నారు. మరో 40 రోజుల పాటు వచ్చే సహజ జలాలు 2 టీఎంసీలు మాత్రమే. దీంతో సీలేరు నుంచి 19 టీఎంసీల నీటిని పవర్ జనరేషన్, బైపాస్ పద్ధతిలో విడుదల చేయాల్సి ఉంది. బలిమెలలో మన వాటా ఇంకా 40 టీఎంసీలు, సీలేరు, డొంకరాయల ప్రాజెక్టుల్లో 5 టీఎంసీలు కలిపి మొత్తం 45 టీఎంసీల వరకు ఉన్నందున డెల్టాకు ఇబ్బంది ఉండదని సాగునీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రబీ గట్టెక్కించేందుకు మొత్తం మీద 91 టీఎంసీల వరకు నీరు వినియోగిస్తుండగా అందులో సీలేరుది 60 టీఎంసీలు కావడం గమనార్హం. గతంలో రబీ సీజన్లో సీలేరు నుంచి వచ్చే 40 టీఎంసీలు సాగుకు సరిపోయేవి. అత్యవసర పరిస్థితుల్లో మరో 5 టీఎంసీలు అదనంగా తెచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా రబీ సీజన్లో 55 నుంచి 60 టీఎంసీలు వినియోగించాల్సి వస్తోంది. -
జలకళ తప్పింది
మోతుగూడెం (రంపచోడవరం):ఇంకా పూర్తి స్థాయిలో వేసవి రాకముందే సీలేరు జలాశయాలు కళ తప్పాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నీటిమట్టాలు పడిపోయాయి. గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్ధితి ఏర్పడలేదు. ముఖ్యంగా సీలేరు జలవిద్యుత్ కేంద్రాలకు సంబంధించి గుంటవాడ, డొంకరాయి, ఫోర్‌బే రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఏటా మార్చి నాటికి ఈ మూడు రిజర్వాయర్లలో 10 నుంచి 15 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. కానీ ఈసారి ఇప్పటికే నీటిమట్టాలు దారుణంగా పడిపోయి, మట్టిదిబ్బలు పైకి కనిపిస్తున్నాయి. మరో పది రోజుల్లో ఈ రిజర్వాయర్లలో ఉన్న మూడు టీఎంసీల నీటిని గోదావరి డెల్టాకు తరలిస్తే పరిసర గ్రామాలకు తాగునీటి సమస్య ఎదురు కానుంది. బలిమెల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప నీటి ఎద్దడి నుంచి గట్టెక్కె పరిస్థితి కనిపించడం లేదు. గోదావరి డెల్టాకు మరో 10 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంది. బలిమెల రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీల నీటి విడుదలకు కోరినా ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే బలిమెల రిజర్వాయర్ ఆంధ్రా టన్నెల్ నుంచి అధిక మొత్తంలో నీరు దిగువన ఉన్న సీలేరు కాంప్లెక్స్ జలాశయాలకు వచ్చింది. దీంతో అదనంగా నీరు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్టాలో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం పరంగా చర్చలు జరిగితేనే కానీ బలిమెల నుంచి నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
భార్యపై బ్లేడ్‌తో దాడి
విశాఖపట్నం: పిచ్చిలేసిన భర్త, భార్యపై విచక్షణారహితంగా బ్లేడుతో దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం విశాఖ జిల్లాలోని సీలేరు గ్రామంలో జరిగింది. సీలేరు గ్రామానికి చెందిన అర్జున్ మతిస్థిమితం కొల్పోయి భార్య తులాపై బ్లేడుతో దాడి చేశాడు. దీంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.