సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు వల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ నిరాటంకంగా నడిచాయి. విద్యుత్ సంస్థలు సమర్థవంతంగా కరెంటు అందించాయి. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును సమకూర్చుకుంటున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రోజు బొగ్గు కోసమే నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతో పాటు, విదేశీ బొగ్గునూ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో వారానికి సరిపడా నిల్వలు ఉంటున్నాయి.
కొరత లేకుండా నిల్వలు
వీటీపీఎస్‌కి రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,24,324 మెట్రిక్ టన్నులు ఉంది. ఆర్టిపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా.. 60,203 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంటుకు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,66,606 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో 19,200 మెట్రిక్ టన్నులు ఒక రోజుకి వాడుతుండగా, ఇక్కడ 1,04,891 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు మూడు రోజుల నుంచి వారం రోజులకు సరిపోతాయి.
ఈ బొగ్గు వాడుతూనే, తర్వాతి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నిత్యం మరింత బొగ్గును రాష్ట్రం దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా 65 నుంచి 75 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) వద్ద 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ మేరకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టిపీపీ) కోసం 8 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు ఏపీ జెన్‌కో టెండర్ ఖరారు చేసింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఈ బొగ్గు వస్తుంది.
విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తికి వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇప్పటికే 7.5 లక్షల విదేశీ బొగ్గు టెండర్‌ను జెన్‌కో ఖరారు చేసింది. ఆర్టీపీపీకి 2 లక్షల టన్నులు, వీటీపీఎస్‌కు 3 లక్షల టన్నుల చొప్పున మరో 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం మరో టెండర్‌ను పిలిచింది. పూర్తి విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్)కు 7.5 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చే ప్రయత్నం కూడా జరుగుతోంది.
అవసరాలకు తగ్గట్టు..
రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నది ఏపీ జెన్‌కో లక్ష్యం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక ఉత్పత్తి నమోదు చేస్తూ రాష్ట్ర అవసరాల్లో దాదాపు 40 శాతం విద్యుత్‌ను అందిస్తోంది.
కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల యూనిట్, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్‌టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్లు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి ఈ ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకి 78.677 మిలియన్ యూనిట్ల విద్యుత్ జెన్‌కో థర్మల్ యూనిట్ల నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి కొరత రాకుండా బొగ్గు సమకూర్చుకుంటున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment