
విద్యుదుత్పత్తిలో కృష్ణపట్నం ‘ఎస్డీఎస్టీపీఎస్’ యూనిట్–3 సరికొత్త రికార్డు
83 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఇప్పటివరకూ 1,596.30 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
మూడు యూనిట్లూ కలిపి మొత్తం రోజుకు 45 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
ఈ ప్రాజెక్టు ఏపీ జెన్‌కో నిర్వహణ సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతకు ప్రతీక
ఫలితాలిస్తున్న గత ప్రభుత్వం చర్యలు
ఏపీ జెన్‌కో థర్మల్ కేంద్రాల మొత్తం ఉత్పత్తిలో కృష్ణపట్నం వాటా 40 శాతం
సాక్షి, అమరావతి : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లోని యూనిట్–3 తన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) అయిన 2024 నవంబరు 18 నుంచి నిరంతరాయంగా 100 రోజులపాటు విద్యుత్‌ను ఉత్పత్తిని చేసి సరికొత్త రికార్డును నమోదు చేసిందని ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు గురువారం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఏపీ జెన్‌కో నిర్వహణ సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందని ఆయన కొనియాడారు.
వాస్తవానికి.. ఏపీ జెన్‌కో ఈ ఏడాది జనవరి నుంచి రోజుకి 110 మిలియన్ యూనిట్లకు పైగా స్థిర విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ, ఫిబ్రవరి 22న 123 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తితో సరికొత్త రికార్డు నెలకొల్పిందని ఎండీ వివరించారు. ఇప్పటివరకూ 1,596.30 మిలియన్ యూనిట్ల మేర విద్యుదుత్పత్తి చేయగా, సగటున 83 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు.
ఈనెల 18న ఇదే యూనిట్‌లో 95 శాతం పీఎల్‌ఎఫ్‌తో 18,234 మిలియన్ యూనిట్ల గరిష్ట విద్యుత్ సాధించి రికార్డు సృష్టించిందని చక్రధర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఎస్డీఎస్టీపీఎస్‌లోని మూడు యూనిట్లు కలిపి మొత్తం రోజుకు 45 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. అంటే.. ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల మొత్తం ఉత్పత్తిలో కృష్ణపట్నం వాటా 40 శాతంగా ఉంది.
వైఎస్ జగన్ విజన్‌కు నిదర్శనం..
ఇది మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేయడంతో పాటు భవిష్యత్తులోనూ కొరత రాకుండా చేయాలనే సంకల్పంతో రెండు 800 మెగావాట్ల యూనిట్లతో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గత ప్రభుత్వంలో ఆయన అదనంగా సమకూర్చారు. అందులో ఎస్డీఎస్టీపీఎస్‌లోని యూనిట్–3 కూడా ఒకటి.
2023లోనే అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ యూనిట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎనీ్టటీపీఎస్ (నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టిసారించారు. అదే ఏడాది డిసెంబరులో దానినీ అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఏపీ జెన్‌కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం సమకూర్చే స్థాయికి చేరింది.
జగన్ హయాంలో పెరిగిన విద్యుదుత్పత్తి..
ఇక చంద్రబాబు గత హయాం 2018–19తో పోలిస్తే వైఎస్ జగన్ హయాం 2023–24 నాటికి ఏపీ జెన్‌కో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి జెన్‌కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,213 మెగావాట్లు ఉంటే.. అది జగన్ హయాంలో 8,789 మెగావాట్లకు పెరిగింది. ఇందులో కృష్ణపట్నంలోని ఎస్డీఎస్టీపీఎస్‌లోని 800 మెగావాట్ల యూనిట్, ఎన్టీపీఎస్‌లోని 800 మెగావాట్ల యూనిట్ ఉన్నాయి.
చంద్రబాబు హయాంలో మొత్తం విద్యుదుత్పత్తి 2018–19లో 27,197 మిలియన్ యూనిట్లు ఉంటే.. జగన్ హయాంలో 2023–24లో 34,181 మిలియన్ యూనిట్లుగా ఉంది. అంటే.. 6,984 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గింది. ప్రజలకు ఇంధన సర్దుబాటు చార్జీల భారం కూడా తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment