
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కంటే ప్రైవేటు రంగానికే పాలకులు పెద్దపీట వేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీజెన్‌కో సమర్థతకు పూర్తిగా గండి కొట్టారు. అదేసమయంలో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రైవేటు రంగానికి ఎన్నో రెట్లు మేర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే అవకాశం కల్పించారు. కమీషన్లు ఇచ్చే సంస్థలను, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న వారిని టీడీపీ సర్కారు ప్రోత్సహించింది. ఫలితంగా ఏపీ జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం కోల్పోయి, అప్పుల ఊబిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. నిజానికి జెన్‌కోకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే.. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకే లభించి ఉండేది. కానీ, ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో అలా జరగలేదు. తాజాగా విద్యుత్ శాఖ సమీక్షలో నివ్వెరపోయే నిజాలు వెల్లడవుతున్నాయి.
కృష్ణపట్నం నుంచే 1,600 మెగావాట్లు
2014లో ఏపీ జెన్‌కో కరెంటు ఉత్పత్తి సామర్థ్యం 4,483.29 మెగావాట్లు కాగా, 2019 నాటికి ఇది కేవలం 7,429.84 మెగావాట్లకు చేరింది. అంటే 2014–19 మధ్య కాలంలో జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం 2,946.54 మెగావాట్లు మాత్రమే అదనంగా పెరిగింది. ఇందులోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 1,600 మెగావాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. 2016లో సీవోడీ ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే ఈ ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలో ఒక్క మెగావాట్ కూడా కొత్తగా ఉత్పత్తి కాలేదు. ప్రైవేటు విద్యుత్ మాత్రం 2014లో 3,997.30 మెగావాట్లు ఉండగా, 2019 మార్చి నాటికి ఏకంగా 9,176.81 మెగావాట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2,946.54 మెగావాట్లు పెరిగితే, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి 5,179.51 మెగావాట్లు పెరిగింది.
వినియోగదారులపైనే భారం
దేశవ్యాప్తంగా కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో సోలార్, పవన విద్యుత్ ధరలను నిర్ణయిస్తుండగా, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిదారులకు దోచిపెట్టింది. సోలార్ కరెంటుకు ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా రూ.6, పవన విద్యుత్‌కు రూ.4.84 వరకూ చెల్లించింది. ఐదేళ్లలో ప్రైవేటు రంగంలో పవన విద్యుత్ ఉత్పత్తి 777.02 మెగావాట్ల నుంచి 4,102.39 మెగావాట్లకు చేరింది. ఇదే సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి 76.85 మెగావాట్ల నుంచి 2,584.85 మెగావాట్లకు పెరిగింది. టీడీపీ ప్రభుత్వంలో పాలకులు తమ స్వలాభం కోసం జెన్‌కోను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం వల్ల విద్యుత్ సంస్థలు దాదాపు రూ.20 వేల కోట్ల మేర అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment