కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కిన తెలంగాణ
యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి
దిగువన నీటి అవసరాలు లేకున్నా విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులు తరలింపు
874.4 అడుగులకు తగ్గిపోయిన నీటి మట్టం
రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి
అయినా నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం
2014లో సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం
ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసుతో తెలంగాణకు హక్కులు తాకట్టు
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణను నిలువరించని ప్రభుత్వం
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టు
విభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది.
ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment