పేదల గోడు పట్టని ప్రభుత్వం | Chandrababu Naidus government not paying bills to network hospitals | Sakshi
Sakshi News home page

పేదల గోడు పట్టని ప్రభుత్వం

Published Mon, Jan 20 2025 5:22 AM | Last Updated on Mon, Jan 20 2025 8:42 AM

Chandrababu Naidus government not paying bills to network hospitals

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం

రూ. 3 వేల కోట్లకు పెరిగిపోయిన బకాయిలు

రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పి, పైసా విదల్చని ప్రభుత్వం

ఈ నెల 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు

సేవలు నిలిచిపోయి 13 రోజులైనా పట్టించుకోని సర్కారు

వైద్యం కోసం తీవ్ర అవస్థలు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు

వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందంటూ పేదల ఆవేదన

చంద్రబాబు పాలన రాష్ట్ర ప్రజలకు పెనుశాపంగా మారిందనడానికి ఇవే ప్రబల నిదర్శనాలు. ప్రజలు, చిరుద్యోగులకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ కింద నగదు రహిత వైద్య సేవలు అందించడంలోనూ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపశయ్య ఎక్కించింది. 

ప్రజల ప్రాణాలను గాలిలో దీపంలా మార్చేసింది.  ‘రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. మీరే డబ్బు కట్టి వైద్యం చేయించుకోండి’ అని ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు కరాఖండిగా చెప్పేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అంటేనే రోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నాయి. – సాక్షి, అమరావతి

కర్నూలు జిల్లా హలహర్వి మండలం సిరుగాపురానికి చెందిన ఎ. తిమ్మన గౌడు(54) షుగర్‌ వ్యాధి కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కర్నూలులోని అమీలియా ఆస్పత్రిలో వారం క్రితం చేరారు. తిమ్మన గౌడ్‌ అనారోగ్య సమస్య ఆరోగ్యశ్రీలో కవర్‌ అవుతుంది. పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. అయితే, ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడానికి అదనంగా రూ. 40 వేలు వసూలు చేశారు. తప్పనిసరై డబ్బు కట్టాడు. ఈ డబ్బుకు ఆస్పత్రి యాజమాన్యం బిల్లు కూడా ఇవ్వలేదు. చికిత్స పొందుతూ తిమ్మన మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా కంభంకు చెందిన నరసింహులు పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగి. కాలి మడిమ వద్ద సమస్యకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) కింద చికిత్స కోసం కర్నూలులోని జెమ్కేర్‌ కామినేని ఆస్పత్రికి వెళ్లాడు. ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఈహెచ్‌ఎస్‌ కింద చికిత్స చేయాలని కోరగా ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈహెచ్‌ఎస్‌ కింద నగదు రహిత వైద్య సేవలు నిలిపి వేశామని స్పష్టం చేసింది. చికిత్సకు డబ్బు చెల్లించి, కావాలంటే రియింబర్స్‌మెంట్‌ పెట్టుకోవాలని సూచించింది. డబ్బు చెల్లించే స్తోమతు లేక నరసింహులు తల్లడిల్లుతున్నాడు.

ఇన్ని రోజులు సేవలు ఆగడం ఇదే తొలిసారి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథ­కం పరిధిలోకి తెస్తూ ప్రొసీజర్‌లను 3,257కు పెంచింది. అంతేకాకుండా వైద్య సేవల ఖర్చు­ల పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.­25 లక్షలకు పెంచింది. దీంతో రాష్ట్రంలో 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నెట్‌వర్స్‌ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల బిల్లులు ఆగిపోవడంతో ఇక ఆస్పత్రులు సేవలకు ముఖం చాటేశాయి. 

ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీ­తా­లు కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో ఉన్నామని వెంటనే బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలను నిలిపేశాయి. దీంతో చర్చలకని పిలిచిన ప్రభుత్వం రూ.500 కో­ట్లు బిల్లులు ఇస్తామని, వెంటనే సేవలు ప్రా­రంభించాలని ఆస్పత్రులకు చెప్పింది. ప్రభుత్వం ప్రతిసారీ ఇలాగే చెబుతోందని, రూ.500 కోట్లు బిల్లులు ఇచ్చాకే సేవలు ప్రారంభిస్తామని ఆస్పత్రులు తేల్చి చెప్పేశాయి. 

ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తామన్న మొత్తం కూడా ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలు ప్రా­రంభం కాలే­దు. దీంతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని రోజుల పాటు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలు ఆగిపోవడం ఇదే తొలిసారి అని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యజమాన్యాలు తెలిపాయి. గతంలో త­మ­కు ఇబ్బందులొస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకొనేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

వైద్యం కోసం అప్పులు
ప్రభుత్వం పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపివేయడంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గత డిసెంబర్‌ నెల వరకూ మెజారిటీ ఆస్పత్రుల్లో గుండె, న్యూరో, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ అదనంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కొత్త ఏడాది మొదలయ్యాక మొత్తం చికిత్సలకే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలని తేల్చి చెబుతుండటంతో పేదలు, ప్రభుత్వ చిరుద్యోగులు, మాజీ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సేవలు నిలిపేశామన్నారు
మెట్ల మీద నుంచి జారి పడి నడుము ఎముకలు విరిగాయి. ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీకి రూ.1.8 లక్షలు అవుతుందన్నారు. డబ్బు పెట్టి చికిత్స చేయించుకోలేను. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాను. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసినట్లు అక్కడ చెప్పారు. 

ఎందుకని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదన్నారు. సర్పవరం జంక్షన్‌లోని మరో ఆసుపత్రికి వెళితే అక్కడా అదే చెప్పారు. గత్యంతరం లేక మందులు వాడుతూ నొప్పిని భరిస్తూ రోజువారీ జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. 
– వింజమూరి సరస్వతి, కాకినాడ

ఇది చాలా అన్యాయం
మా బంధువుకు అనారోగ్యంగా ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయడంలేదని చెప్పారు. ఇది చాలా అన్యాయం. నిరుపేద, మధ్య తరగతి ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? పేదలకు ఆపద్బాంధవిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాలి.– కవిత, ప్రశాంతి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా

అందరినీ వెనక్కి పంపేస్తున్నారు
వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే, ఈ కార్డు కింద ఉచిత వైద్యం చేయబోమని చెబుతున్నారు. రెండు రోజుల నుంచి ఉచితంగా ఆపరేషన్లు ఆపేశామన్నారు. నా లాగే చాలా మందిని వెనక్కి పంపించేస్తున్నారు. కూలికి పోతే గానీ గడవని బతుకులు మావి. డబ్బులిచ్చి ఆపరేషన్లు చేయించుకోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? – ఎన్ని నర్సయ్య, సైరిగాం, శ్రీకాకుళం జిల్లా

డయాలసిస్‌కు చేతి నుంచి డబ్బు పెట్టుకున్నా
కిడ్నీలు ఫెయిల్‌ అవడంతో వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. గతంలో కర్నూలులోనే కిమ్స్‌ ఆస్పత్రిలో ఈహెచ్‌ఎస్‌ కింద డయాలసిస్‌ చేయించుకునేవాడిని. ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఈహెచ్‌ఎస్‌ సేవలు ఆపేశారు. ఇప్పుడు డబ్బు చెల్లించి డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. ఇది నాకు పెను భారమే అయింది.– వెంకటేశ్వర్లు, మాజీ ఉద్యోగి వైద్య, ఆరోగ్య శాఖ కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement