
ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ టెండర్లలో సీఆర్‌డీఏ అక్రమాలు
చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ. 9,433.06
కాంట్రాక్ట్ విలువ రూ.411.37 కోట్లతో నోటిఫికేషన్ జారీ
సీనరేజీ, జీఎస్టీ రూపంలో రూ.86.79 కోట్లు రీయింబర్స్‌కు హామీ
దాంతో రూ.498.16 కోట్లకు చేరనున్న కాంట్రాక్ట్ విలువ
5,28,100 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 115 బంగ్లాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో భవనాల నిర్మాణ పనుల టెండర్లలో అడుగు అడుగుకు కమీషన్లు దండుకోవడానికి ముఖ్య నేతలు ప్రణాళికాయుతంగా పావులు కదుపుతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల పనుల టెండర్లలోనైతే మరీ బరితెగించారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టేందుకు సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులపై ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచేసేలా చక్రం తిప్పారు.
ఆ కాంట్రాక్టు సంస్థ బ్రోచర్‌నే నిబంధనలుగా పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టాక.. అందులో పది శాతాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. దాన్నే తొలి విడత కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి స్కెచ్ వేశారు. ఆ తర్వాత చేసిన పనులకు బిల్లులు చెల్లించేటప్పుడు మిగతా కమీషన్ వసూలుకు ప్రణాళిక రచించారు. వివరాల్లోకి వెళితే..
రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్‌తో ఆర్‌సీ కాలమ్స్, బీమ్స్‌తో లోపల, బయట విద్యుదీకరణ, ఐటీ పనులు.. లోపల, బయటి ప్రాంతాల్లో ప్లంబింగ్‌తో బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బంగ్లాలకు రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి.
మొత్తం 5,28,100 చదరపు అడుగుల్లో 115 బంగ్లాలను నిర్మించాలని టెండర్‌లో పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు టెండర్‌లో పాల్గొంటూ బిడ్‌లు దాఖలు చేసుకోవడానికి మార్చి 3వరకు గడువు ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తారు. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మార్చి 7న తెరిచి, తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించనున్నారు.
వ్యయంపై నోరెళ్లబెడుతున్న బిల్డర్లు, ఇంజినీర్లు
ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1లో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1లో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగులతో 90 బంగ్లాలు నిర్మించాలి. మొత్తం నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు.. ఇందులో రూ.2,500 వెచ్చిస్తే అత్యంత విలాసవంతంగా నాణ్యంగా బంగ్లాలు కట్టవచ్చని బిల్డర్లు, ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 115 బంగ్లాల నిర్మాణ విలువ రూ.132.02 కోట్లే అవుతుంది.
బంగ్లాల నిర్మిత ప్రాంతంలో అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లకు మించి కాదని స్పష్టం చేస్తున్నారు. అంటే.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.232.02 కోట్లకు మించదు. మౌలిక సదుపాయాలను కూడా కలుపుకొంటే 115 బంగ్లాల నిర్మాణంలో చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపి రూ.4,393.48కు మించదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. సీఆర్‌డీఏ మాత్రం ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.498.16 కోట్లకు నిర్ణయించింది.
దీనిప్రకారం చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,433.06 అవుతోంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.5,040.12కు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా భారీగా పెంచేయడంపై బిల్డర్లు, ఇంజినీర్లు అవాక్కవుతున్నారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి దోచుకోవడానికి ముఖ్య నేతలు సీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, అంచనా వ్యయాన్ని పెంచేలా చక్రం తిప్పారని చెబుతున్నారు.
తన రికార్డు తానే బద్దలు
రాజధాని ప్రాంతంలో జీ+12 పద్ధతిలో (14 టవర్లలో 1440 ఫ్లాట్లు) గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్‌లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1806.29. రాజధానిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 పద్ధతిలో 12 టవర్లలో 1200 ఫ్లాట్ల నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.4,511.75. అంతస్తులు పెరిగే కొద్దీ భవన నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
బహుళ అంతస్తులతో అత్యంత విలాసవంతంగా నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని అప్పట్లో బిల్డర్లు, ఇంజినీర్లు స్పష్టం చేశారు. కానీ.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించిన ముఖ్య నేతలు కమీషన్ల దందాకు తెరతీశారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్లలో కూడా సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ తమ రికార్డులను తామే బద్ధలు కొడుతూ అంచనా వ్యయాన్ని పెంచేశాయనే చర్చ బిల్డర్లు, ఇంజినీర్లలో జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment