ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం
ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం
జనవరి వరకూ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన జగన్ సర్కార్
జనవరి, ఫిబ్రవరి బిల్లులు ప్రాసెస్ చేసి, సీఎఫ్‌ఎమ్‌ఎస్ కోడ్ వచ్చేలోపే ఎన్నికల కోడ్
నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి బిల్లులేవీ చెల్లించకుండా అడ్డుకుంది బాబే
ఏప్రిల్, మే, జూన్, బకాయిల ఊసెత్తని బాబు సర్కార్
ఆరోగ్యశ్రీనే కాదు.. మందుల కొరత, కొత్త వైద్య కళాశాలలపైనా తీవ్ర నిర్లక్ష్యం
ప్రజలకు తాముంటున్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఆరోగ్య సురక్ష అందకుండా నిలుపుదల
మొత్తంగా ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ఏదైనా ఓ వ్యవస్థను నిర్వీ ర్యం చేయాలనుకుంటే సీఎం చంద్రబాబు తొలుత పథకం ప్రకారం దానిపై దుష్ప్రచారం ప్రారంభిస్తారు. తాను అనుకున్నది సాధించడం కోసం ప్రజల మెదడును ట్యూన్ చేసేలా పార్టీలోనే కొందరు నాయకులతో ప్రకటనలు చేయిస్తారు. అనుకూల మీడియాలో ఈమేరకు కథనాలతోపాటు టీవీ చానళ్లలోనూ తన మనుషుల ద్వారా చర్చలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టోలో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చి చివరకు ప్రజల ఆరోగ్యానికి పొగ బెట్టారు.
ఇన్నాళ్లూ ఆరోగ్యశ్రీ పథకం ట్రస్టు పర్యవేక్షణలో పకడ్బందీగా కొనసాగుతుండగా అధికారంలోకి వచ్చీ రాగానే ఆ స్థానంలో బీమా ప్రవేశపెట్టడానికి సిద్ధం కావాలంటూ వైద్య శాఖకు హుకుం జారీ చేశారు. మరోవైపు ‘‘ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు. రోగులకు చికిత్సలు అందడం లేదు. ప్రజలు వైద్యం కోసం కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ కార్డును వెంటబెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లాలి..’’ అని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు.
మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్‌ల ముద్రను చెరిపేయాలనే దురుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఆరోగ్యశ్రీని నిర్వీ ర్యం చేసే పనికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు చెల్లించకుండా, ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందకుండా చేస్తున్నారు.
అడ్డుకుని అభాండాలు
2019–24 మధ్య ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో జరిగిన తీవ్ర ఉన్న జాప్యానికి చెక్ పెట్టారు. ప్రజలకు వైద్య సేవలపై ఏ మాత్రం ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులను చెల్లిస్తూ వచ్చారు. ఈ ఏడాది జనవరి వరకూ పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి వైద్య సేవల క్లెయిమ్‌లను ట్రస్ట్ పరిశీలించి, ఆమోదించడం.. అనంతరం బిల్లులను ట్రస్ట్ ప్రాసెస్ చేసి ఆర్థిక శాఖకు పంపి అక్కడ సీఎఫ్‌ఎంఎస్ ఐడీలు రావడానికి రెండు నెలల సమయం పట్టింది.
సాధారణంగా ప్రతి నెలా ఇదే పద్ధతిలో బిల్లులను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియలో మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బిల్లులను చెల్లించలేకపోయారు. వాస్తవానికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకం ఎన్నికల నియమావళిలోకి రాదు. పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. అయితే ఆ సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటికే అమలులో ఉన్న పథకాలకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారు.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోడ్ అమలులో ఉంది. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలలకు మరో మూడు నెలల బిల్లులు వచ్చి చేరాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తూ యథావిధిగా గత ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ పథకాన్ని నిరీ్వర్యం చేయాలనే లక్ష్యాన్ని అమలు చేస్తోంది.
పేదల్లో కలవరపాటు
ఓవైపు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం, మరోవైపు బీమా పేరిట ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు సర్కారు పొగబెడుతుండటంతో పేదల్లో కలవరపాటు మొదలైంది. గత ఐదేళ్లలో దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డుతో వెళితే ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా లభించే పరిస్థితి ఉండేది. 2019 అనంతరం రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేయడంతో ప్రైవేట్ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ రక్షగా నిలిచింది.
అనంతరం చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు వైఎస్ జగన్ పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి ఆరోగ్యశ్రీ పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. అంతేకాకుండా శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించి కష్టకాలంలో గత ప్రభుత్వం అండగా నిలిచింది.
మరోవైపు నాడు–నేడు కింద రూ.17 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వాస్పత్రులను సదుపాయాలతో తీర్చిదిద్దడంతోపాటు 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. 108, 104 వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. తద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించారు.
ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా..
కేవలం ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో గత ఐదేళ్లలో చేపట్టిన సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడానికి తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయంలోనూ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలకు తాముంటున్న చోటే స్పెషాలిటీ వైద్య సేవలను అందించడంతోపాటు నిరంతర వైద్య పర్యవేక్షణ కల్పిస్తూ తెచి్చన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూటమి సర్కారు నిలిపివేసింది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తున్నా ఆస్పత్రుల్లో మందుల సరఫరాపై కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో ఆస్పత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వందకుపైగా రకాల మందుల కొరత ఉంది. గత ప్రభుత్వంలో బోధనాస్పత్రుల్లో 607 రకాల డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉండేవి. గ్రామ స్థాయిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోనూ 105 రకాల మందులను అందుబాటులో ఉంచిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment