
సీబీఎస్‌ఈ విధానాలు, ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో ఇంటర్ విద్యా బోధన
2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూ. కాలేజీల్లో నూతన విధానం
ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు
ఏప్రిల్ 5 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు
టెన్త్ పరీక్షలు రాసిన వారందరికీ కాలేజీల్లో చేరే అవకాశం
పదో తరగతి పాసైనవారు కొనసాగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీ ఎస్‌ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఇంటర్ రెండో సంవత్సరం సిలబస్ బోధన మొదలవుతుంది. ఏప్రిల్ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు.
జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్‌ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తున్నారు. ప్రస్తు త (2024–25) విద్యా సంవత్సరంలో పదో తరగతి బోధన సైతం ఇదే విధానంలోకి మారింది. వచ్చే నెలలో (మార్చిలో) పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 వి ద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్‌ఈ విధానాలు అమలుచేస్తారు.
ఇంటర్ విద్యలో జాతీయ స్థాయి సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలు, చేపట్టాల్సిన మార్పులపై నియమించిన కమిటీలు 12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక మేరకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం, 2026–27లో రెండో సంవత్సరంలో కొత్త సిలబస్ ప్రవేశపెడతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ కోర్సును సైతం ప్రవేశపెడుతున్నారు.
సీబీఎస్‌ఈ తరహాలో మార్పులు
ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు, ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. 223 రోజులు పనిదినాలు ఉండేవి. అయితే, సీబీఎస్‌ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించి, ఇంటర్ రెండో ఏడాది బోధన మొదలు పెడతారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. జూన్ ఒకటిన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి.
తొలి 23 రోజుల్లో కనీసం 15 శాతం సిలబస్ పూర్తిచేసి వేసవి సెలవులు ఇస్తారు. పని దినాలు సైతం నెల రోజులు పెరిగాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏప్రిల్ 5 నుంచే మొదటి సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. అందువల్ల పదో తరగతి పరీక్షలు (రెగ్యులర్/ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ) రాసిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైనవారిని తొలగిస్తారు.
ప్రభుత్వ కాలేజీల్లో జేఈఈ, ఎంసెట్ శిక్షణ
రాష్ట్రంలోని సైన్స్ విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాస్తున్నందున ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా వీటిలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
అవసరం మేరకు ప్రత్యేక నిపుణులతో తరగతులు చెప్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అకడమిక్ తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకురెండు గంటలు జేఈఈ, ఎంసెట్ శిక్షణ ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment