15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సేవలు నిలిపివేస్తాం
ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ
రూ.1,600 కోట్లకుపైగా బకాయిలు ఆస్పత్రులకు చెల్లించకుండా పెండింగ్‌లో..
పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పెండింగ్ బిల్లులను ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించకుంటే వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య సేవ ట్రస్ట్ సీఈవోకు మంగళ వారం లేఖ రాసింది. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్య సేవలు నిలిపివేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పథకం ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరింది. పెండింగ్ బిల్లుల అంశాన్ని వైద్య శాఖమంత్రి దృష్టికి తెచ్చినప్పటికీ తమకు ఎలాంటి హామీ లభించలేదని తెలిపింది.
బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన వైఎస్ జగన్
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బిల్లులు రాకపోవడంతో రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెల కొందని, కేంద్ర ప్రభుత్వ పథకంతో పేదలు సరిపెట్టుకోవాలని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తద్వారా రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యానికి భరోసానిచ్చిన ఆరోగ్యశ్రీకి పొగబెట్టి రూ.5 లక్షల వరకే పరిమితమైన కేంద్ర పథకం దయా దాక్షిణ్యాలకు ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసినట్లు స్పష్టమైంది. గతంలోనూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించిన విషయం తెలిసిందే.
2014–19 మధ్య ప్రొసీజర్లు పెంచకుండా అరకొర సేవలతో పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆరోగ్యశ్రీకి 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రాణం పోశారు. వెయ్యి లోపు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను ఏకంగా 2,371కి విస్తరించారు. చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా వాటిని 3,257కి పెంచారు.
ఆరోగ్యశ్రీ ద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద మరో రూ.1,465 కోట్లకుపైగా సాయం అందించారు. దేశంలోనే తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి విపత్తు వేళ భరోసా కల్పించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా టీడీపీ సర్కారు దిగిపోతూ బకాయి పెట్టిన దాదాపు రూ.700 కోట్లను సైతం చెల్లించారు.
అసోసియేషన్ లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ ఏడాది జనవరి వరకు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ఆ తరువాత బిల్లులను కూడా సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆస్పత్రులకు దాదాపు రూ.1,600 కోట్లకుపైగా బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడంతో పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment