
7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు అనుమతి కోరాయి
వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ కోసమే ఈ ఒప్పందం
ఇందుకోసం ఏపీ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా సంస్థ పేరుతో ప్రత్యేక నోడల్ ఏజెన్సీ
ఆర్థిక సర్వే–2024, వనరుల ప్రణాళికలో అంగీకరించిన కూటమి ప్రభుత్వం
ఇన్నాళ్లూ ఇదే ఒప్పందంపై చంద్రబాబు, పచ్చ మీడియా తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) ఇటీవల ఆమోదించిన డిస్కంల ఆదాయ, అవసరాల నివేదికలో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అనుమతించింది. ఆ సందర్భంలోనే సెకీ ఒప్పందంపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించి, ఒప్పందాన్ని రద్దు చేసేందుకు తగిన కారణాలేమీ కనిపించడం లేదంటూ స్పష్టం చేసింది. దీంతో సెకీ ఒప్పందంపై కూటమి చేస్తున్న విమర్శలు, కరపత్రం రాసుకొచ్చిన కథనాలు అసత్యాలని తేలిపోయింది.
తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే–2024 కూడా సెకీ ఒప్పందం గురించి మరింత స్పష్టత ఇచ్చింది. ‘వనరుల ప్రణాళిక’లో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అంగీకరించింది. 2024–25 నుంచి 2028–29 వరకు (5వ నియంత్రణ కాలం), 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకు ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు సమర్పించిన విద్యుత్ వనరుల ప్రణాళికకు 2023 జూన్‌లో ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఏ విధంగా వస్తుందనే వివరాలున్న వీటిలో ‘సెకీ’తో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందం కూడా ఉంది.
అవే భవిష్యత్తుకు భరోసా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 డిసెంబరులో విజయవాడ సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల (స్టేజ్–5) యూనిట్ ఉత్పత్తి ప్రారంభించిందని కూటమి సర్కారు తెలిపింది. ఈ కేంద్రం నుంచి 25 ఏళ్ల పాటు వంద శాతం విద్యుత్ కొనుగోలుకు ఏపీజెన్‌కో 2022 అక్టోబరులో ఒప్పందం కుదర్చుకుందని పేర్కొంది.
ఇదికూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగింద్ధి. ఏపీ పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ) ప్రమోషన్ పాలసీ–2022 ద్వారా రాష్ట్రంలో 29 ప్రదేశాల్లో 33,240 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు టెక్నో–కమర్షియల్ ఫీజిబులిటీ రిపోర్ట్స్ సిద్ధం చేసినట్లు ఆర్థిక సర్వే సాక్షిగా తేటతెల్లమైంది. ఇది గత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం సూర్యఘర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది.
ఆచరణలో మాత్రం పురోగతి సాధించడం లేదని సర్వే తేల్చిచెప్పింది. ఈ పథకానికి 3 డిస్కంలలో కలిపి 16,35,672 మంది చేత రిజిస్టర్ చేయించారు. వారిలో 9,79,665 మంది చేత దరఖాస్తులు పెట్టించారు. కేవలం 10,278 మందికే రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ అమర్చారు.
పథకం అట్టర్ ఫ్లాప్ అని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. కేవలం గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన విద్యుత్ రంగ ప్రగతిని తమదిగా చెప్పుకొనే ప్రయత్నం మినహా ఆర్థిక సర్వే –2024లో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం విశేషం.
‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెకీ)తో 7వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాను కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరా సంస్థ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీవోఎం) పేరుతో ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం నియమించింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ స్కీమ్ నుంచి 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) అనుమతి కోరాయి. దానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించింది’
– ఏపీ సామాజిక ఆర్థిక సర్వేలో కూటమి ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment