
విద్యార్థులకు ముంచుకొస్తున్న వార్షిక పరీక్షలు
పిల్లలకన్నా తల్లులకే ఎక్కువ మానసిక ఒత్తిడి
చిన్న తరగతులైనా, బోర్డ్ ఎగ్జామ్స్ అయినా తేడా లేదు
తామే పరీక్షలు రాస్తున్నంతగా హడావుడి
చిరాకు పడుతూ, సరిగ్గా తినకుండా ఉక్కిరిబిక్కిరి
ఇది సరికాదంటున్న నిపుణులు..
ఆంక్షలు పెట్టకూడదు.. తాము సైతం మంచి ఆహారం,
తగిన విశ్రాంతి తీసుకోవాలి.. తమకు తామే కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి..వాటిని పాటించాలి
పరీక్షల సమయంలో ఎక్కువమంది తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మలు.. ‘పిల్లల సిలబస్ పూర్తవుతుందో లేదో, ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, అనుకున్న గ్రేడ్ వస్తుందా.. అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు. మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. భావోద్వేగాలకు గురవుతుంటారు. త్వరగా చిరాకు పడటం, టైమ్‌కి తినకపోవడం, ఎవరినీ కలవకపోవడం, పిల్లల్ని కలవనివ్వకపోవడం వంటివి చేస్తుంటారు. కొందరు తల్లులు తమ పిల్లలకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఇది సరికాదని అమ్మలు కొంత సంయమనంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. సరైన ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు.
ఎందుకు ఒత్తిడికి గురవుతారు..?
⇒ ముందు నుంచీ సిలబస్ ప్రకారం ప్రాక్టీస్ చేయించలేకపోవడం ఒక కారణం. మొదట స్కూల్లో టీచర్లే చూసుకుంటారులే అనే ధీమా ఉంటుంది. పరీక్షల సమయంలో అదికాస్తా సన్నగిల్లుతుంటుంది.
⇒ పెద్ద పిల్లలైతే సిలబస్ పూర్తి చేయడంలో వెనకబడు తున్నారేమో అనే సందేహం వెంటాడుతుంటుంది.
⇒ ఫెయిల్ అవుతారేమో, ఇతరుల పిల్లలు ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారేమో అనే ఆందోళనకు గురవుతుంటారు.
ఒత్తిడిని ఎలా అధిగమించాలి..
⇒ తల్లిదండ్రులు పిల్లల విజయాన్ని కోరుకుంటారు. తమ పిల్లలు అందరికన్నా ముందుండాలనే ఆలోచన ఒత్తిడికి గురి చేస్తుంది. అలా ఒత్తిడికి గురవకుండా.. వాస్తవికంగా సాధించగల లక్ష్యాలపై పిల్లలతో కలిసి పనిచేయాలి.
⇒ మీ ఆందోళన పిల్లల ముందు బయటపడకుండా సానుకూల వైఖరిని చూపాలి. రోజువారీ షెడ్యూల్‌ను రూపొందించుకోవడంలో పిల్లలకు సాయపడాలి.
⇒ ఒత్తిడి అనేది అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యే. దానిని అధిగమించేందుకు వ్యూహాత్మకంగా పనిచేయ డంలోనే అసలైన సవాల్ ఉంటుంది. అది మీ బిడ్డలకు మద్దతునిచ్చే అతి ముఖ్యమైన వనరుగా ఉండాలి. కలిసి భోజనం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
⇒ తల్లిదండ్రులు తమ స్కూల్ రోజుల్లో మార్కుల గురించి తమ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలను గుర్తుకు తెచ్చుకోవాలి. దీన్ని నివారించాలి.
⇒ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఒంటరిగా గదిలో వదిలేయ కుండా.. మరో పనిచేస్తూ పిల్లలకు సమీపంలో ఉండాలి.
⇒ ‘ఎక్స్’లో మేరీ కోమ్, సచిన్, రిచర్డ్ బ్రాన్సన్, మార్క్ జుకర్‌బర్గ్.. లాంటి ప్రముఖులను ఫాలో అవ్వాలి. వారంతా కాలేజీ డ్రాపౌట్స్. కానీ నైపుణ్యాలే వారిని ప్రముఖుల జాబితాలో చేర్చాయనే విషయం గమనించాలి. ‘పిల్లల్లో ఉండే నైపు ణ్యాలను గుర్తించాలి’ అనే భావనను పెంపొందించుకోవాలి.
తల్లిదండ్రులు కొన్ని గమనించాలి.. మరికొన్ని పాటించాలి..
ప్రొ.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ ట్రైనర్
ఈ రోజుల్లో తల్లిదండ్రులు తామే పరీక్షలు రాస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంటుంది వారి మానసిక స్థితి చూస్తుంటే. ముఖ్యంగా తల్లులు తమ ఆందోళనతో పిల్లల్ని ప్రభావి తం చేస్తుంటారు. అలాకాకుండా మానసిక స్థితిని అదుపులో పెట్టుకుంటూ, పిల్లల్ని గమనిస్తూ సమయానుకూలంగా జాగ్రత్తలు పాటిస్తే తల్లులు ఎగ్జామ్స్ అనే గండాన్ని దాటొచ్చు.
⇒ మీ టీనేజర్ పరీక్షల గురించి ఆందోళన చెందుతూ, ఎక్కువ విచారంగా ఉంటున్నారేమో చూడాలి.
⇒ గోళ్లు కొరకడం లాంటివి చేస్తున్నారా? రాత్రంతా మేల్కొని ఉంటున్నారా?.. గమనించాలి.
⇒ పిల్లల పక్కన కూర్చొని చదువులో సాయం చేయా లి. అందుకు అవసరమైతే స్కూల్ టీచర్ల సాయం తీసుకోవచ్చు.
⇒ ఫోన్, ట్యాబ్, టీవీ స్క్రీన్ల వాడకం.. చదువు నుంచి దృష్టి మరల్చేలా చేస్తుంది. అయితే దీన్ని పూర్తిగా దూరం చేయకుండా, సమయపు హద్దులు పెట్టడం మేలు.
⇒ సరైన పోషక ఆహారం ఆందోళన స్థాయి లను తగ్గిస్తుంది. అందుకని పిల్ల లకు సమతుల ఆహారం ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.
⇒ వారి అలసటను నివారించేలా చిన్న విరామం తీసుకోనివ్వాలి.
తల్లులు ఇలా ప్రమాణం చేసుకోవాలి..
‘పిల్లల పరీక్ష సమయంలో తల్లులు తమకు తాముగా కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి.. వాటిని పాటించాలి..’ అని అంటున్నారు సోష ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కిడ్స్‌స్టాప్‌ప్రెస్. కామ్ ఫౌండర్ మాన్సి జవేరీ. అవేంటంటే..
⇒ ‘ఇది మీ భవిష్యత్తు.. పరీక్ష ఫలితం పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..’ అనే పదాలను పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించను.
⇒ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సమయంలో నేను, నా పిల్లల స్నేహితు లను కలిసినప్పుడు.. ‘సిలబస్ పూర్తయ్యిందా? ఇప్పటివరకు ఎన్ని అధ్యాయాలు చదవడం పూర్తి చేశారు?..లాంటి ప్రశ్నలను అడగనే అడగను. ళీ ఎక్కువ గంటలు పుస్తకాల ముందు కూర్చోపెట్టను. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడను.
Comments
Please login to add a commentAdd a comment