
జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్ భద్రతపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం
నిబంధనల ప్రకారం 139 మందితో భద్రత కల్పించాలి
ఎన్నికలు అవగానే ఏకపక్షంగా భద్రత కుదింపు
సీఎం కాకుండానే చంద్రబాబు మౌఖిక ఆదేశాలు
58 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటన
వాస్తవంగా ఇస్తున్నది ఇద్దరు కానిస్టేబుళ్లనే
జగన్ నివాసం వద్ద అసలు భద్రతా సిబ్బందే లేరు
జగన్‌కు రక్షణ వలయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు
సాక్షి, అమరావతి: జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. అత్యంత పటిష్టమైన భద్రత కల్పించాల్సిన వైఎస్ జగన్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా భద్రత సిబ్బందిని కుదించేసింది. జగన్‌పై గతంతో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గుర్తు తెలియని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ నివాసం, పార్టీ ఆఫీసు వద్ద కూడా భద్రతను తొలగించడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. వైఎస్ జగన్ జిల్లా పర్యటనల్లోనూ కనీస భద్రత కూడా కల్పించడంలేదు. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు కుట్రకు తెరతీశారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ భద్రత కుదించాలంటూ పోలీసులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు వైఎస్ జగన్‌కు 139 మందితో ఉన్న జడ్ ప్లస్ భద్రతను ఏకపక్షంగా ఉపసంహరించారు. పైకి 58 మందితో భద్రత కల్పిస్తున్నట్లు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. వాస్తవానికి ఏ సమయంలో చూసినా ఆయన భద్రతకు కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లనే కేటాయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
వైఎస్ జగన్ ఆఫీసు, నివాసం వద్ద భద్రతా సిబ్బందిని పూర్తిగా తొలగించింది. ఆయనపై ఎవరైనా దాడికి యతి్నస్తే వెంటనే ఆగంతకులపై ప్రతి దాడి చేసేందుకు ఉద్దేశించిన ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీమ్‌లనూ ఉపసంహరించింది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల భద్రతకు నియోగించిన సిబ్బందికంటే వైఎస్ జగన్‌కు తక్కువ మంది సిబ్బందిని కేటాయించడం చంద్రబాబు కుట్రపూరిత విధానాలకు నిదర్శనం.
కొనసాగుతున్న బెదిరింపులు
వైఎస్ జగన్ లక్ష్యంగా రాష్ట్రంలో కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన అంతు తేలుస్తామని 2024 ఎన్నికల ముందే టీడీపీ కూటమి నేతలు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల అనంతరం టీడీపీ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విభ్రాంతి కలిగించాయి.
‘వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడిపోయాడు గానీ చనిపోలేదు. చచ్చేంత వరకూ కొట్టాలి’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వైఎస్ జగన్ నివాసానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఆయన భద్రతకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్నది సుస్పష్టం.
అడుగడుగునా భద్రతా వైఫల్యం
చంద్రబాబు ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి వైఎస్ జగన్ జిల్లా పర్యటనల్లో ప్రస్ఫుటంగా బయటపడుతూనే ఉంది. జగన్ జిల్లా పర్యటనల్లో అడుగడుగునా భద్రతా వైఫల్యం సర్వసాధారణంగా మారింది. వైఎస్సార్, తిరుపతి, కాకినాడ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆయన పర్యటనల్లో ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించ లేదు. అందుకు కొన్ని తార్కాణాలు..
» గత ఏడాది పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ గూండాలు హత్య చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వినుకొండ వెళ్లగా, ఆయనకు ప్రభుత్వం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడం విభ్రాంతి కలిగించింది. వాస్తవానికి జగన్ తన వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పర్యటించేందుకు అనుమతి కోరగా పోలీసులు తిరస్కరించారు. దాంతో పోలీసులు సమకూర్చిన డొక్కు వాహనంలోనే ఆయన వినుకొండ బయల్దేరారు. కాసేపటికే అది మొరాయించడంతో జగన్ బుల్లెట్ ప్రూఫ్ లేని మరో ప్రైవేటు వాహనంలో వెళ్లాల్సి వచ్చింది.

» వైఎస్సార్ జిల్లాలో జగన్ హెలికాప్టర్‌లో వెళ్లారు. అక్కడ పోలీసులు కనీస భద్రత ఏర్పాట్లు కూడా చేయలేదు. హెలికాప్టర్ ల్యాండ్ కాగానే వేలాదిమంది హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. జగన్ హెలికాప్టర్ నుంచి కిందకు దిగడమే కష్టమైంది. అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు ఆ గుంపులో చేరితే పరిణామాలు ఎలా ఉండేవన్నది ఆందోళన కలిగిస్తోంది.
» వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనలోనూ భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కొందరు ఆగంతకులు ఏకంగా ఆయన కారుపైకి ఎక్కడం గమనార్హం. బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు వేగంగా ఆయనవైపు దూసుకొచ్చాడు. అక్కడున్న వారు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
» తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు వాహనంలో వెళ్లేందుకు వైఎస్ జగన్‌కు పోలీసులు అనుమతించలేదు. దాంతో ఆయన నడుచుకుంటూనే వెళ్లారు. అయినా పోలీసులు అక్కడా కనీస భద్రత కల్పించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఎగబడేందుకు ప్రయత్నించారు. పార్టీ నేతలే ఎస్కార్టుగా మారి ఆయనకు భద్రత కల్పించాల్సి వచ్చింది.
» మిర్చికి ధరలేక అవస్థలు పడుతున్న రైతులను పరామర్శించేందుకు జగన్ బుధవారం గుంటూరులో పర్యటించినప్పుడు కూడా పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. వైఎస్సార్‌సీపీ నేతలే ఆయనకు ఇరువైపులా నిలబడి భద్రత కల్పించాల్సి వచ్చింది.
వైఎస్ జగన్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు
వైఎస్ జగన్ భద్రతకు ముప్పు ఉందన్న విషయం ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తెలుసు. ఆయనపై గతంలో రెండుసార్లు హత్యాయత్నాలకు తెగబడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉండగా 2018లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోనే ఆయన మెడపై కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఆ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.
భుజంపై తగిలిన తీవ్రమైన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచి్చంది. ఆయన్ని హత్య చేసే పన్నాగంతోనే ఈ దాడి చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 2024లో విజయవాడలో ఎన్నికల ర్యాలీలో ఓ ఆగంతకుడు ఆయన తలపైకి పదునైన గ్రానైట్ రాయి విసిరి హత్య చేసేందుకు యత్నించాడు.
ఈ దాడి నుంచి కూడా ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ రెండు హత్యాయత్నాల కేసులు విచారణలో ఉన్నాయి. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ భద్రతను పూర్తిగా కుదించడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

జడ్ ప్లస్ కేటగిరీలో 139 మందితో భద్రత ఉండేది ఇలా..
జడ్ ప్లస్ కేటగిరీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్‌కు 139 మందితో భద్రత కల్పించాలి. ఇందులో భద్రతా అధికారులు, సిబ్బంది ఇలా ఉంటారు..
» నివాసం వద్ద 6 + 24 విధానంలో సాయుధ భద్రతా సిబ్బంది : 30 మంది
» వ్యక్తిగత భ్రదతా సిబ్బంది షిఫ్టుకు ఐదుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో : 15 మంది
» ఆఫీసు, నివాసం వద్ద షిఫ్టుకు ఆరుగురు చొప్పున : 18 మంది
» షిఫ్టుకు ఆరుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీమ్ : 18 మంది
» 1+ 3 విధానంలో మూడు షిఫ్టుల్లో రెండు ఎస్కార్ట్ టీమ్‌లు : 24 మంది
» వాచర్లు : ఐదుగురు
» అదనపు ఎస్పీలు : ఇద్దరు ∙షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో ఫ్రిష్కర్లు : ఆరుగురు
» షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో స్క్రీనర్లు : ఆరుగురు
» షిఫ్టుకు ఐదుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో ట్రెయిన్డ్ డ్రైవర్లు : 15 మంది
58 మందితో భద్రత ఇలా..
జడ్ ప్లస్ భద్రతా కేటగిరీలో ఉన్న జగన్‌కు 58 మందితో భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా చూసినా ఆయనకు కల్పించాల్సిన భద్రత ఇలా ఉండాలి..
» నివాసం వద్ద 2 + 8 విధానంలో సాయుధ భద్రత సిబ్బంది: 10 మంది
» వ్యక్తిగత భద్రతా సిబ్బంది షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో: ఆరుగురు
» 1+ 3 విధానంలో మూడు షిఫ్టుల్లో రెండు ఎస్కార్ట్ టీమ్‌లు : 24 మంది
» వాచర్లు : ఐదుగురు
» ఇద్దరు అదనపు ఎస్పీలను తొలగించారు. ఒక సీఐని కేటాయించారు
» షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో ఫ్రిష్కర్లు : ఆరుగురు
» షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో స్క్రీనర్లు : ఆరుగురు
Comments
Please login to add a commentAdd a comment