
పాత మద్దతు ధరతో 25 శాతానికి మించి కొనలేమన్న కేంద్రం
75 శాతం మేర కొనుగోలు తమ చేతుల్లో లేదంటున్న రాష్ట్రం
మొత్తంగా రైతన్నలతో కేంద్ర, రాష్ట్రాలు దోబూచులాట
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రోడ్డెక్కడం వల్లే కదలిక
డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ.. ఆ శాఖ మంత్రితో చర్చలు
క్వింటాకు రూ.11,600 ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదన
రూ.10,025 మాత్రమే అంటూ ఐసీఏఆర్ రేటు ఫిక్స్
ఇంతకు మించి పెంచాలంటే కేబినెట్ అనుమతి తప్పనిసరి
75% సేకరణకు ఒప్పుకున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: మిరప రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ చేతులెత్తేస్తున్నాయి. మద్దతు ధర పెంచలేమని, పాత మద్దతు ధరతో 25 శాతానికి మించి పంట కొనలేమని కేంద్రం తేల్చి చెప్పగా, ఇందులో రాష్ట్రం బాధ్యత ఏమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మిర్చి పంట కొనుగోలు విధాన నిర్ణయంపై మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తోంది. రాష్ట్రంలో కొంత కాలంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 19న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో రూ.21–27 వేలు పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8–11 వేలకు పడిపోయిందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మొద్దు నిద్ర వీడిన కూటమి ప్రభుత్వ పెద్దల్లో కంగారు మొదలైంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ‘మూడు లేఖలు రాశాను.. ఎంపీల ద్వారా ఒత్తిడి తెచ్చాను’ అంటూ పరోక్షంగా నెపాన్ని కేంద్రంపై నెట్టారు. హుటాహుటిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ అయ్యి, వర్చువల్‌గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంబంధిత అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వర్చువల్‌గా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. మద్దతు ధర రూ.11,600 ఇవ్వాలని రాష్ట్రం కోరగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ (ఐసీఏఆర్) మాత్రం రూ.10 వేలకు మించి ఇవ్వలేమని స్పష్టం చేసిందని తెలిసింది.
ఇప్పుడెలా?
కనీస మద్దతు ధర పెంచడంతో పాటు ప్రైస్ డెఫీషియన్సీ పేమెంట్ (పీడీపీ) పథకం కింద పంట దిగుబడుల్లో 75 శాతం కేంద్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రం కోరింది. సేకరణకయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలంది. ఇప్పటికప్పుడు నిబంధనల మేరకు 25 శాతానికి మించి మిరపను గతంలో నిర్ధేశించిన కనీస మద్దతు ధర రూ.10,025 కంటే ఎక్కువతో కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చి చెప్పినట్లు, ఇందుకు అయ్యే ఖర్చులో 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిoదేనని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇతర ప్రతిపాదనలేవీ కూడా తమ పరిధిలో లేవని, వాటిని ఆమోదించాలంటే తక్షణమే కేంద్ర కేబినెట్ భేటీ జరగాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో.. ఎలా ముందుకెళ్లాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం గుంటూరు మిర్చి యార్డు రైతులు, ట్రేడర్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
ఇదిలా ఉండగా శుక్రవారం మంత్రి శివరాజ్ చౌహాన్‌తో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. క్వింటాకు రూ.11,600 చొప్పున సేకరణకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో 25 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం ఒప్పుకుందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment