క్షురకుల పొట్టకొడుతున్న ఆ«ధునిక సెలూన్లు
భారీగా తగ్గిన రోజువారి రాబడి
వృత్తిని వదులుకోవాల్సిన దుస్థితి
ఇతర మార్గాల అన్వేషణలో పలువురు
నాయీబ్రాహ్మణుల ఉపాధిపై ‘కత్తెర’ పడింది. ఏళ్ల తరబడి నమ్ముకున్న సంప్ర దాయ వృత్తిపై ఆధునిక సెలూన్‘కత్తి’కట్టింది. నాడు వైఎస్ జగన్ క్షురకుల కత్తికి వరాల సాన పట్టగా.. నేడు చంద్రబాబు సంక్షేమాన్ని అటకెక్కించి ‘మొండికత్తి’గా మార్చేశారు. ఫలితంగా ఓ వైపు రాబడి లేక.. మరోవైపు ప్రభుత్వాల నుంచి చేయూత దొరక్క నాయీ బ్రాహ్మణుల బతుకుబండి ముందుకు కదలనంటోంది.
కడప సెవెన్‌రోడ్స్: ఆధునిక సెలూన్స్ వచ్చి సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న క్షురకుల జీవనోపాధిని చిధ్రం చేస్తున్నాయి. దీంతో ఎంతోమంది ఉపాధి కోల్పొయి రోడ్డున పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సంక్షేమ పథకాల వల్ల వీరికి ఆర్థిక భరోసా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం డీబీటీ పథకాలు ఎత్తివేయడంతో ఉపాధి లేక..ప్రభుత్వం నుంచి చేయూత కానరాక క్షురకులు అష్టకష్టాలు పడుతున్నారు.
వైఎస్సార్ జిల్లాలో నాయీ బ్రాహ్మణులు చాలా మంది సాంప్రదాయంగా వస్తున్న తమ కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు అద్దె గదుల్లో క్షౌరశాలలు ఏర్పాటు చేసుకుని బతుకుతుంటే... మరికొందరు వీధుల్లో బంకులు ఏర్పాటు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. ఇలాంటి వారు ఒక్క కడపలోనే 400 కు పైగా ఉంటారు. వీరు క్షౌరానికి రూ. 70–100 తీసుకుంటారు. షేవింగ్‌కు రూ. 20 అడుగుతారు. తల వెంట్రుకలకు రంగు వేసేందుకు రూ. 50 వసూలు చేస్తారు. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు వీరి వద్దకు వెళుతుంటారు.
క్షౌర వృత్తితో పాటు వాయిద్యం తెలిసిన వీరు వివాహాలు, ఉత్సవాలు, చావులకు వెళుతుంటారు. కులవృత్తిని నమ్ముకున్న వీరికి రోజుకు సగటున రూ. 600 రాబడి ఉంటుంది. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, ఆరోగ్యం, పిల్లల చదువులు ఇలా జీవన వ్యయం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో వచ్చే రాబడితో కష్టంగా కుటుంబాలను నెట్టుకొచ్చేస్తున్నామని చెబుతున్నారు.
జగన్ సంక్షేమ పథకాలతో నాడు భరోసా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేయూత కింద ఏడాదికి రూ.10 వేలు ఉచితంగా ఇస్తుండేవారని, ఆ డబ్బులు విద్యుత్ చార్జీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేదని చెబుతున్నారు. అలాగే జగన్ అమలు చేసిన ఇతర సంక్షేమ పథకాల ద్వారా తాము లబ్ది పొందేవారమని చెబుతున్నారు.
అలాగే తమ సామాజిక వర్గానికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని పలువురు గుర్తు చేశారు. వీటితోపాటు దేవస్థానాల్లో తమకు ఉపాధి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. దీంతో తమకు ఎంతో ఆర్థిక భరోసా ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఈ పథకాలన్నీ రద్దు చేయడంతో తమలాంటి వారి బతుకు దుర్భరంగా మారిదంటూ క్షురకులు వాపోతున్నారు.
హంగుల వైపే మొగ్గు..
ఆధునికత అంటూ ఇటీవల వైఎస్సార్ జిల్లాలో కొత్తకొత్త పేర్లతో సెలూన్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా కడప నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు ఏసీలతో కూడిన భారీ సెలూన్లు ఏర్పాటు చేశారు. గ్రీన్ ట్రెండ్స్, మోజ్, (బీ)యూ, డబల్ సెవెన్ తదితర సెలూన్ల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి.
కొత్త కొత్త హంగులతో ఇవి యువతను ఆకర్షిస్తు్తన్నాయి. బుల్లెట్ కటింగ్, మిడ్ ఫేడ్, లోఫేడ్ వంటి పేర్లతో కటింగ్, షేవింగ్, హెడ్ వాష్ చేసి రూ. 500 చొప్పున రాబడుతున్నారు. తల వెంట్రుకలకు రంగు వేయాలంటే రూ. 300 అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. రకరకాల క్రీముల పేరిట డబ్బులు బాగానే గుంజుతున్నారు. వీరి వద్దకు వెళ్లాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
వీధి బంకుల నిర్వాహకులు కూడా రకరకాల రీతుల్లో కటింగ్, షేవింగ్స్ చేయగలరు. హంగు ఆర్భాటాలు ఉండవు గనుక యువత వెళ్లడం లేదు. దీంతో రాబడి నామమాత్రంగా ఉంటోందని బంకు నిర్వాహకులు వాపోతున్నారు. బంకు ఏర్పాటు చేసుకున్నందుకు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment