862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు తగ్గిన నీటి నిల్వ
ఎడమ కేంద్రంలో యథేచ్ఛగా తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి
దిగువన నీటి అవసరాలు లేకున్నా 35,315 క్యూసెక్కులు తరలింపు
కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కిన తెలంగాణ జెన్‌కో
అయినా నోరుమెదపని ఏపీ ప్రభుత్వం
ఇలాగైతే జనవరి 15 నాటికే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ
అవుతుందంటున్న అధికారులు
రాయలసీమతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీటి కష్టాలే
సాక్షి, అమరావతి: దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ కేంద్రాల ద్వారా తరలించాలన్న నిబంధనను తెలంగాణ జెన్‌కో తుంగలోకి తొక్కేసింది. కృష్ణా బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది.
శుక్రవారం సాయంత్రం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తరలించేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదు.
తెలంగాణ జెన్‌కో ఇదే రీతిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పోతే జనవరి 15వ తేదీలోగా శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల రాయలసీమతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే...
రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించింది. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని సాకు చూపుతూ దాన్ని తెలంగాణ సర్కార్ తన ఆ«దీనంలోకి తీసుకుంది.
ఇదే సమయంలో నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ దాన్ని కూడా తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై అప్పటి చంద్రబాబు సర్కార్ చూసీచూడనట్లు వ్యవహరించింది. తెలంగాణ, ఏపీలో టీడీపీ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అప్పట్లో చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు.
ఆ పాపం పర్యవసానంగానే కృష్ణా బోర్డు అనుమతి లేకుండా అక్రమంగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ మన రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తూ వస్తోందని రైతులు మండిపడుతున్నారు.
‘ఏపీ వాదన సహేతుకం కాదు’
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్–89 మార్గదర్శకాల ప్రకారమే వాదనలు వినాలన్న ఏపీ ప్రభుత్వ వాదన సహేతుకం కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సెక్షన్–89లోని మార్గదర్శకాలు, 2023 అక్టోబర్ 6న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం –1956లో సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన అదనపు నిబంధనలు రెండూ ఒకటేనని.. రెంటినీ కలిపి వాదనలు వినాలంది.
కాలయాపన, తాత్కాలిక ఏర్పాటును అడ్డంపెట్టుకుని నీటిని తరలించడం కోసమే ఏపీ ఆ రెండు భిన్నమైనవని వాదిస్తోందని పేర్కొంది. సెక్షన్–89, సెక్షన్–3 కింద ఇచ్చిన మార్గదర్శకాలు వేర్వేరని భావిస్తే.. తొలుత సెక్షన్–3 కింద వాదనలు వినాలని తేల్చి చెబుతూ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2లో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
కేంద్రం 2023 అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని తెలంగాణ తెలిపింది. అందువల్ల సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై విచారించడానికి వీల్లేదన్న ఏపీ వాదన అసంబద్ధమని కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment