ఏపీ, తెలంగాణపై కృష్ణా బోర్డు ఆగ్రహం
జల విద్యుత్ ఉత్పత్తితో రిజర్వాయర్లను
ఖాళీ చేస్తున్న రెండు రాష్ట్రాలు
విద్యుదుత్పత్తిపై ఆర్‌ఎంసీ సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయం
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో నేటి సమావేశం వాయిదా
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తిని నిలిపేసి, జలాలను సంరక్షించాలన్న తమ ఆదేశాలను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఉల్లంఘించడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలపై చర్యలకు ఉపక్రమించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో పోటీ పడి విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల అధికారులతో మళ్లీ రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా శుక్రవారం ఈ సమావేశం నిర్వహిస్తామని బోర్డు సభ్యులు ఆర్‌ఎన్ శంఖ్వా ఇరు రాష్ట్రాలకు లేఖ రాయగా.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో వాయిదా వేశారు. ఈ నెల 25 తర్వాత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఏడాది తర్వాత ఆర్‌ఎంసీ సమావేశం
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలపై సరైన పర్యవేక్షణ, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణకు మార్గదర్శకాలను ఖరారు చేయడం ఆర్‌ఎంసీ ప్రధాన ఉద్దేశం. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన ముసాయిదా నిబంధనలను పరిశీలించి, అవసరమైన సవరణలతో తుదిరూపు ఇవ్వడం, జలాశయాలన్నీ నిండిన తర్వాత రెండు రాష్ట్రాలు జరిపే మిగులు జలాల వినియోగాన్ని లెక్కిల్లోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించడంపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీని కోరింది. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్‌ఎంసీ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ ఏడాదికి పైగా విరామం తర్వాత కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ సమావేశాన్ని తలపెట్టడం గమనార్హం.
21న కృష్ణా బోర్డు సమావేశం
కృష్ణా బోర్డు 19వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 21న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలిక కృష్ణా జలాల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment