సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది.
ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.
అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment