joint project
-
నీటి వాటాలపైనా అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కనిష్టంగా 50 టీఎంసీలివ్వండి
కృష్ణా బోర్డు ముందు తెలంగాణ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న నీటిలో కనిష్టంగా 50 టీఎంసీలు రాష్ట్ర అవసరాలకు కేటారుుంచాలని కృష్ణా బోర్డు ను తెలంగాణ కోరింది. జూన్ వరకు తాగునీటి అవసరాలకు లభ్యత జలాలు సరిపోకుంటే ఉమ్మడి ప్రాజెక్టుల్లో గతేడాది మాదిరే కనీస నీటి మట్టాలకు దిగువ (ఎండీడీఎల్) నీటిని తోడాలని ప్రతిపాదన చేసింది. ఈ మేరకు నీటి పంపకాలపై తమను సంప్రదించిన బోర్డు పెద్దలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది. జూన్ వరకు మొత్తంగా 103 టీఎంసీలు అవసరమని తెలంగాణ కోరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఎండీడీఎల్‌కు పైన 130 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండటం, ఇరు రాష్ట్రాల అవసరాలు మాత్రం ఎక్కువగా ఉండటంతో మధ్యేమార్గాన్ని అనుసరించాలని బోర్డు రాష్ట్రాన్ని కోరింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత లభ్యత నీటిలో 50 టీఎంసీలు తెలంగాణకు, 80 టీఎంసీలు ఏపీకి కేటారుుంచేందుకు అంగీకారం తెలిపినట్లుగా తెలిసింది. శుక్రవారం ఏపీతో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ చర్చిస్తారని భావించినా, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో సమావేశం జరగలేదు. -
‘నియంత్రణ’ నిప్పు
♦ సాగర్, శ్రీశైలం నీటి విడుదలపై ఎవరి అజమాయిషీ వారిది ♦ ‘నియంత్రణ’పై అభిప్రాయాలు చెప్పాలని బోర్డు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ పరివాహక పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరు నిప్పును రాజేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఏపీ, నాగార్జునసాగర్‌పై తెలంగాణలు నియంత్రణ చేస్తుండటం, నీటి విడుదల విషయంలో ఎవరికి వారే పట్టింపులకు పోతుండటం సమస్యను జఠిలం చేస్తోంది. దీనికి తోడు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ అంశంపై వైఖరి తెలపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పంపిన ఆదేశాలు దీనికి మరింత ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది అనుకున్న స్థాయి నీటి లభ్యత లేకపోవడంతో శ్రీశైలంలో ఉన్న కొద్దిపాటి నీటిపై ఇరు రాష్ట్రాలు ఆధారపడిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలు తాగునీటి అవసరాల కోసం కనీస నీటి మట్టం దిగువకు వెళ్లి సైతం నీటిని తీసుకుంటున్నాయి. ఇటీవలే శ్రీశైలంలో 779 అడుగులు, సాగర్ 501 అడుగుల దిగువన లభ్యమయ్యే నీటిని లెక్కించి తెలంగాణకు 3 టీఎంసీలు, ఏపీకి 6 టీఎంసీలను బోర్డు కేటాయించింది. అయితే ఈ నీటి కేటాయింపులపై తెలంగాణ గుర్రుగా ఉంది. ఇప్పటికే శ్రీశైలంలో 785 అడుగుల దిగువకు నీరు చేరగా, సాగర్‌లో 506 అడుగుల దిగువన నీరుందని, ఈ మట్టాల్లో అంత నీటిని తీసుకోవడం అంత సులువు కాదని తెలంగాణ చెబుతోంది. ఇదే సమయంలో కేటాయించిన మేరకు మొదటగా శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయాలని తెలంగాణ కోరుతోంది. దీనిపై ఏపీ నుంచి సానుకూలత రావడం లేదు. శ్రీశైలం నీటిని వదిలిన అనంతరం సాగర్ నుంచి తెలంగాణ నీటి విడుదల చేయకుంటే ఎలా? అనే అనుమానాలు వ్యక్తపరుస్తూ, శ్రీశైలం నుంచి నీటి విడుదలకు అంగీకరించడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు తన నియంత్రణలో ఉన్నందున నీటి విడుదలపై షరతులు పెడుతోంది. ఏపీ వ్యవహారాన్ని తప్పుపడుతూ, సాగర్‌లోని నీటిని ముందుగా విడుదల చేసేందుకు తెలంగాణ నిరాకరిస్తోంది. సాగర్ పూర్తిగా తెలంగాణ ఆధీనంలో ఉండటంతో ఏపీ ఏమీ చేయలేకపోతోంది. దీంతో ప్రస్తుతం ఎవరు ఏ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయాలన్న దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. నియంత్రించేదెవరు..? కృష్ణా పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు దానిపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా దీన్ని బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ ఇటీవల బోర్డుకు విన్నవించింది. స్పందించిన బోర్డు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణపై తెలంగాణ అభిప్రాయం కోరింది. నియంత్రణ బోర్డు పరిధిలోకి అవసరం లేదని గతంలో ఓమారు స్పష్టం చేసిన తెలంగాణ, మరోమారు తన లేఖను పంపే అవకాశం ఉంది.