‘నియంత్రణ’ నిప్పు | ap and ts joint projects Directions to the views of the Board | Sakshi
Sakshi News home page

‘నియంత్రణ’ నిప్పు

Published Sat, May 7 2016 4:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

‘నియంత్రణ’ నిప్పు

‘నియంత్రణ’ నిప్పు

సాగర్, శ్రీశైలం నీటి విడుదలపై ఎవరి అజమాయిషీ వారిది
‘నియంత్రణ’పై అభిప్రాయాలు చెప్పాలని బోర్డు ఆదేశాలు

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ పరివాహక పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరు నిప్పును రాజేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఏపీ, నాగార్జునసాగర్‌పై తెలంగాణలు నియంత్రణ చేస్తుండటం, నీటి విడుదల విషయంలో ఎవరికి వారే పట్టింపులకు పోతుండటం సమస్యను జఠిలం చేస్తోంది. దీనికి తోడు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ అంశంపై వైఖరి తెలపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పంపిన ఆదేశాలు దీనికి మరింత ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది అనుకున్న స్థాయి నీటి లభ్యత లేకపోవడంతో శ్రీశైలంలో ఉన్న కొద్దిపాటి నీటిపై ఇరు రాష్ట్రాలు ఆధారపడిన విషయం తెలిసిందే.

రెండు రాష్ట్రాలు తాగునీటి అవసరాల కోసం కనీస నీటి మట్టం దిగువకు వెళ్లి సైతం నీటిని తీసుకుంటున్నాయి. ఇటీవలే శ్రీశైలంలో 779 అడుగులు, సాగర్ 501 అడుగుల దిగువన లభ్యమయ్యే నీటిని లెక్కించి తెలంగాణకు 3 టీఎంసీలు, ఏపీకి 6 టీఎంసీలను బోర్డు కేటాయించింది. అయితే ఈ నీటి కేటాయింపులపై తెలంగాణ గుర్రుగా ఉంది. ఇప్పటికే శ్రీశైలంలో 785 అడుగుల దిగువకు నీరు చేరగా, సాగర్‌లో 506 అడుగుల  దిగువన నీరుందని, ఈ మట్టాల్లో అంత నీటిని తీసుకోవడం అంత సులువు కాదని తెలంగాణ చెబుతోంది. ఇదే సమయంలో కేటాయించిన మేరకు మొదటగా శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయాలని తెలంగాణ కోరుతోంది.

దీనిపై ఏపీ నుంచి సానుకూలత రావడం లేదు. శ్రీశైలం నీటిని వదిలిన అనంతరం సాగర్ నుంచి తెలంగాణ నీటి విడుదల చేయకుంటే ఎలా? అనే అనుమానాలు వ్యక్తపరుస్తూ, శ్రీశైలం నుంచి నీటి విడుదలకు అంగీకరించడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు తన నియంత్రణలో ఉన్నందున నీటి విడుదలపై షరతులు పెడుతోంది. ఏపీ వ్యవహారాన్ని తప్పుపడుతూ, సాగర్‌లోని నీటిని ముందుగా విడుదల చేసేందుకు తెలంగాణ నిరాకరిస్తోంది. సాగర్ పూర్తిగా తెలంగాణ ఆధీనంలో ఉండటంతో ఏపీ ఏమీ చేయలేకపోతోంది. దీంతో ప్రస్తుతం ఎవరు ఏ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయాలన్న దానిపై సందిగ్ధం కొనసాగుతోంది.

 నియంత్రించేదెవరు..?
కృష్ణా పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు దానిపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా దీన్ని బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ ఇటీవల బోర్డుకు విన్నవించింది. స్పందించిన బోర్డు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణపై తెలంగాణ అభిప్రాయం కోరింది. నియంత్రణ బోర్డు పరిధిలోకి అవసరం లేదని గతంలో ఓమారు స్పష్టం చేసిన తెలంగాణ, మరోమారు తన లేఖను పంపే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement