సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు.
జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది.
శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు.
సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది.
త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది.
శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.
తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment