‘కృష్ణా’పై కొత్తగా విధి విధానాలు చట్ట విరుద్ధం | Ambati Rambabu: We will protect every drop of water given to AP | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’పై కొత్తగా విధి విధానాలు చట్ట విరుద్ధం

Published Sun, Oct 8 2023 5:43 AM | Last Updated on Sun, Oct 8 2023 5:44 AM

Ambati Rambabu: We will protect every drop of water given to AP - Sakshi

సాక్షి, అమరావతి : కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడం కోసం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు కొత్తగా విధి విధానాలు (టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్సెస్‌) జారీ చేస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం చట్టవిరుద్ధమంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. విభజన చట్టంలో సెక్షన్‌–89 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు విధి విధానాలను ఇప్పటికే నిర్దేశించారని గుర్తు చేస్తూ.. మళ్లీ కొత్తగా విధి విధానాలు జారీ చేయడాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు.

విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయంగా, అక్రమంగా కొత్తగా జారీ చేసిన విధి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. వాటిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్సెల్పీ) దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డే ప్రామాణికమని.. దాని ద్వారా న్యాయబద్ధంగా హక్కుగా రాష్ట్రానికి దక్కిన ప్రతి నీటి బొట్టునూ రక్షించుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

ఇప్పటికే ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు  

  •  బచావత్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1976లో 811 టీఎంసీలు కేటాయించింది. ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. ఈ కేటాయింపుల ఆధారంగా 2015 జూలై 18–19న ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ చేసిన తాత్కాలిక సర్దుబాటుపై రెండు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు చేశారు. 
  • కృష్ణా నది జలాలను పంపిణీ చేయడానికి 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 2010లో తొలి నివేదిక, 2013లో తుది నివేదిక కేంద్రానికి ఇచ్చింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కొనసాగించింది. ఆ రెండు నివేదికలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎస్సెల్పీలు దాఖలు చేయడంతో వాటిపై స్టే ఇచ్చింది. దాంతో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదికను కేంద్రం నోటిఫై చేయలేదు. 
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్‌–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కే కేంద్రం కట్టబెడుతూ దాని గడువును పొడిగించింది.
  • విభజన చట్టంలో సెక్షన్‌–89లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాలలో ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే నియమావళిని రూపొందించాలని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం విధి విధానాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకే నీటి పంపిణీపై బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 2016 నుంచి విచారణ జరుపుతోంది. 

రాష్ట్ర హక్కుల పరిరక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌ కృషి 

  • అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో కృష్ణా జలాలను సెక్షన్‌–3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తే సీఎం వైఎస్‌ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క నీటిని వదులుకోబోమని, అన్యాయంగా చుక్క నీటిని వాడుకోబోమని తేల్చి చెప్పారు.
  •  సెక్షన్‌–3 ప్రకారం నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర జల్‌ శక్తి శాఖకు 2021లో లేఖ రాయగానే.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి చట్టబ­ద్ధంగా ట్రిబ్యునల్‌ కేటాయించిన జలాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్‌ 25న సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి లేఖ రాశారు. 
  •  రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఈ నెల 4న ఆమోదం తెలపడం అశాస్త్రీయమని, దీని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని.. అందువల్ల తదుపరి చర్యలను నిలిపేసి రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అదే రోజున ఢిల్లీలో హోం శాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై ఇదే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధి విధానాలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు నిర్దేశిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.
  •  కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం నాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నడుంబిగిస్తే.. నేడు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల­ పై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీఎం వైఎస్‌ జగన్‌పై విషం చిమ్ముతూ తప్పుడురాతలు అచ్చేస్తున్నారు. వారి విషపురాతలను ప్రజలు నమ్మరు. టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న విమర్శలను జనం పట్టించుకోరు.

పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌ పొలిటికల్‌ బఫూన్లు 
జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయా పార్టీల వారికే తెలి­యక జట్టు పీక్కుంటున్నారు. పెడనలో ఎన్డీయే నుంచి బయటకొచ్చానని ప్రకటించిన పవన్‌.. ముదినేపల్లికి వచ్చే సరికి మాట మార్చారు. జైలులో చంద్రబాబును ములా­ఖత్‌లో కలిసి బయటకొచ్చాక.. చంద్రబాబు అవినీతిని ఇంటింటా ప్రచారం చేస్తానని లోకే‹శ్‌ ప్రకటించారు.

అందుకే వారిద్దరినీ పొలిటికల్‌ బఫూన్లుగా ప్రజలు చూస్తున్నా­రు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాల ద్వారా ప్రజాధనాన్ని దోచుకున్నారని నిరూపితమైంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. అలా జైల్లో ఉన్న చంద్రబా­బును కలిశాక టీడీపీతో పొత్తును పవన్‌ ప్రకటించారంటే.. ఆయన అవినీతిలో ఈయ­నకు వాటా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బలహీనపడ్డ టీడీపీ తన మద్దతుతో బలం పుంజుకుంటుందని పొత్తు పెట్టుకున్న జనసేన.. క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి చతికిలపడింది. అవనిగడ్డ, పెడన, ముదినేపల్లిలలో పవన్‌ సభలు అట్టర్‌ ఫ్లాప్‌ కావడమే అందుకు నిదర్శనం. టీడీపీతో పొత్తు ప్రజలెవరికీ ఇష్టం లేకపోవడంతో జనసేన బలహీన పడిందన్న వాస్తవాన్ని పవన్‌ తెలుసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement