నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఫైల్)
సాక్షి, అమరావతి: కృష్ణా నది దిగువ బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించడమే అజెండాగా బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించనున్నారు. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చించనున్నారు.
సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య నవంబర్ 30న వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు పరిధిని నిర్దేశించేవరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ(ఆంధ్రప్రదేశ్), సాగర్ నిర్వహణను ఆ ప్రాజెక్టు సీఈ(తెలంగాణ)కి అప్పగించింది.
కానీ తమ భూభాగంలో ఉందంటూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నా అప్పటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా దిగువకు నీటిని వదిలేస్తూ.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. శ్రీశైలం పాజెక్టును ఖాళీ చేస్తూ రాయలసీమ హక్కులను తెలంగాణ హరిస్తూ వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తూ సాగర్‌కు తరలించిన జలాలను.. కుడి కాలువకు విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులను కాలరాస్తూ వస్తోంది.
బోర్డు పరిధి నిర్దేశించినప్పటికీ..
దీనిపై 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలి. కృష్ణా బోర్డు సమావేశంలో ఆ ప్రాజెక్టులను అప్పగించడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరగడంతో ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్‌లో దిగువన నీటి అవసరాలు లేకపోయినా.. శ్రీశైలంలో ఏపీకి కేటాయించిన 17 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేసి సాగర్‌కు తరలించిన తెలంగాణ.. వాటిని ఏపీకి విడుదల చేయకుండా మొండికేసింది. దాంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి నవంబర్ 30న ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
సాగర్ వివాదంతో కదలిన కేంద్రం
సాగర్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం చెలరేగడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి డిసెంబర్‌లో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్‌పై యధాస్థితిని కొనసాగిస్తూ.. సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వివాదానికి తెరదించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించడంతోపాటు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 2015లో చేసిన సర్దుబాటు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాలు కొనసాగించడం, వరద జలాల మళ్లింపుపై బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment