కనిష్టంగా 50 టీఎంసీలివ్వండి
కృష్ణా బోర్డు ముందు తెలంగాణ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న నీటిలో కనిష్టంగా 50 టీఎంసీలు రాష్ట్ర అవసరాలకు కేటారుుంచాలని కృష్ణా బోర్డు ను తెలంగాణ కోరింది. జూన్ వరకు తాగునీటి అవసరాలకు లభ్యత జలాలు సరిపోకుంటే ఉమ్మడి ప్రాజెక్టుల్లో గతేడాది మాదిరే కనీస నీటి మట్టాలకు దిగువ (ఎండీడీఎల్) నీటిని తోడాలని ప్రతిపాదన చేసింది. ఈ మేరకు నీటి పంపకాలపై తమను సంప్రదించిన బోర్డు పెద్దలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది.
జూన్ వరకు మొత్తంగా 103 టీఎంసీలు అవసరమని తెలంగాణ కోరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఎండీడీఎల్‌కు పైన 130 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండటం, ఇరు రాష్ట్రాల అవసరాలు మాత్రం ఎక్కువగా ఉండటంతో మధ్యేమార్గాన్ని అనుసరించాలని బోర్డు రాష్ట్రాన్ని కోరింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత లభ్యత నీటిలో 50 టీఎంసీలు తెలంగాణకు, 80 టీఎంసీలు ఏపీకి కేటారుుంచేందుకు అంగీకారం తెలిపినట్లుగా తెలిసింది. శుక్రవారం ఏపీతో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ చర్చిస్తారని భావించినా, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో సమావేశం జరగలేదు.