‘సాగర్‌’లో సగం ఏపీ స్వాధీనం | Tension at Sagar Dam | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’లో సగం ఏపీ స్వాధీనం

Published Fri, Dec 1 2023 1:22 AM | Last Updated on Fri, Dec 1 2023 3:14 AM

Tension at Sagar Dam - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, నరసరావుపేట/­మాచర్ల/­విజయపురిసౌత్‌ :కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో నాలుగున్నరేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాల వినియోగం విషయంలో ఇప్పుడు సాహసోపేత నిర్ణయం తీసు­కున్నారు. రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల శాఖాధికారులు నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు.

అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు వాస్తవాలను వివరించి.. రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసె­క్కులు విడుదల చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు­ల పరిరక్షణలో సీఎం జగన్‌ రాజీలేని పోరా­టం చేస్తున్నారనడానికి ఇది మరో తార్కాణమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

తెలంగాణ తొండాట..
నిజానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్టోబరు 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి 30 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 15 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్‌ తరలించింది. మాకు కేటాయించిన ఆ 15 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని ఏపీ అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ సర్కార్‌ పట్టించుకోవడంలేదు.

ఇదే అంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డిలు వివరించారు. వాస్తవానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్‌ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను సీఎం జగన్‌ ఆదేశాలతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

రాష్ట్ర హక్కులు తెలంగాణకు చంద్రబాబు తాకట్టు..
♦ విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. దీని పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించాలని నిర్దేశించింది. 

♦  దీంతో సాగర్‌ను 2014–15లో పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్‌.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్కేంద్రాన్ని సైతం తన ఆధీనంలోకి తీసుకుంది. అయినాసరే.. నాటి సీఎం చంద్రబాబు ఇటు రాష్ట్రంలో.. అటు తెలంగాణలో టీడీపీని బతికించుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. 

♦  ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్య­మవుతుంది. అంతకంటే తగ్గితే.. శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాల కోసం నీటిని వినియోగించలేని దుస్థితి. కానీ, శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దిగువన నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా తెలంగాణ సర్కార్‌ చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో రాష్ట్ర వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది.

♦  శ్రీశైలం నుంచి 2015లో ఇదే రీతిలో సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ అధికారులు తోసిపుచ్చారు. దీంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకునేందుకు 2015, ఫిబ్రవరి 13న ఆదిత్యనాథ్‌ దాస్‌ పోలీసులతో కలిసి సాగర్‌కు చేరుకున్నారు. కానీ, తక్షణమే వెనక్కి రావా­లని ఆదిత్యనాథ్‌ దాస్‌ను చంద్రబాబు ఆదే­శించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను ఆయన తెలంగాణకు తాకట్టు పెట్టారు. 

♦ శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో­పాటు కల్వకుర్తి, నెట్టెంపాడుల సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్‌ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్‌ అక్రమంగా చేపట్టింది. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరించి వేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు వాటిని తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. 

సాగర్‌ నుంచి నీరు విడుదల
గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తీరనున్న తాగునీటి కష్టాలు  రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వలన తాగునీరు లేక మూడు జిల్లాల చెరువులు, భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు మంచినీటికి అల్లాడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఊపిరిపోసింది. ఏపీ భూభాగంలోని 13 గేట్లను, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు స్వాధీనం చేసుకుని కుడికాలువ రెండు గేట్ల ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేశారు.

అంతకుముందు.. భారీ స్థాయిలో ఏపీ పోలీసులు అక్కడ మోహరించారు. కుడికాలువపై పట్టు సాధించే క్రమంలో డ్యాంపై ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ పోలీసులు ఏపీ జలవనరుల శాఖ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఏపీ పోలీసులు శాంతియుత వాతావరణంలోనే వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం.. సాగర్‌ డ్యాంపై ఏపీకి చెందిన భూభాగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గేట్లను దాటి సగభాగం వరకు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో ఏపీ పరిధిలోని 13 క్లస్టర్‌ గేట్ల వరకు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈ చర్యలతో నాగార్జునసాగర్‌లో ఏపీ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించినట్లయ్యింది. మరోవైపు.. నీరు విడుదల చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీఎం జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ఆ జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

హక్కుల పరిరక్షణకు సీఎం జగన్‌ రాజీలేని పోరాటం..
ఇక వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ అక్రమ ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు.

దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడంతో.. దాన్ని పరిష్కరించడానికి  2020, అక్టోబర్‌ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టంచేసిన సీఎం జగన్‌.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపు­దల చేయాలని డిమాండ్‌ చేయడమే కాక.. సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. 

♦ శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే 2021లో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి ప్రారంభించి.. సాగర్‌కు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

♦  దీంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లలో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంకాగా.. తెలంగాణ నిరాకరించింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని.. లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని జగన్‌ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

1,311 మంది పోలీసులతో బందోబస్తు
ఇక నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో.. ఏపీ పోలీసు శాఖ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. గుంటూరు రేంజ్‌ ఐజి పాల్‌రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎస్పీ రవీంద్రబాబుల ఆ«ధ్వర్యంలో 1,311 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సాగర్‌ వద్ద పరిస్థితులు చక్కబడే వరకు వీరు అక్కడే ఉండే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement