కృష్ణా జలాల వివాదం: రెండు రాష్ట్రాల ఆమోదం | Krishna River Board Meeting Over At Jalasoudha | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల వివాదం: రెండు రాష్ట్రాల ఆమోదం

Published Thu, Jun 4 2020 7:58 PM | Last Updated on Thu, Jun 4 2020 8:21 PM

Krishna River Board Meeting Over At Jalasoudha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా వరద జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల వాదనలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బోర్డు ఛైర్మన్‌ పరమేశం తెలిపారు. కృష్ణా జలాల వివాదాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు గురువారం జలసౌధలో నిర్వహించిన భేటీ ముగిసింది. ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ అంశంతో పాటు, టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై బోర్డు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం బోర్డు ఛైర్మన్‌ పరమేశం మాట్లాడుతూ.. కృష్ణ నదిపై నిర్మించే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖలు తమకు సమర్పించాలని కోరినట్లు తెలిపారు. అలాగే గత ఏడాది తీసుకున్నట్లు గానే ఈ నీటి సంవత్సరంలో కూడా 66-34 నిష్పత్తిలో నీటి కేటాయింపులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు 50-50 శాతం వాడుకునేలా  ఒప్పందం కురినట్లు వెల్లడించారు.

అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు వద్దు
భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బోర్డు చైర్మన్‌ పరమేశం మాట్లాడుతూ.. ‘రెండో దశ టెలిమెట్రీని అమలు చేసేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఈ ఏడాది నీటి వినియోగాలపై చర్చించాము. శ్రీశైలం-సాగర్ కేటాయింపుల్లో తెలంగాణ ప్రభుత్వం గతంలో పలు అంశాలను లెవనెత్తింది. ఏపీ కూడా పలు అభ్యంతరాలను తెలిపింది. ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను కేంద్ర జలాశక్తి శాఖకు పంపాము. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. రెండు రాష్ట్రాలు చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి డీపీఆర్ నివేదికలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. గతంలో వాడుకొని నీళ్లను భవిష్యత్‌లో ఇవ్వాలని తెలంగాణ కోరిన అంశంపై చర్చ జరిగింది. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

రావాల్సిన నీళ్లు మాత్రమే వాడుకుంటాం..
మిగుల జలాల వాడకంపై కమిటీ వేశాము. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక నిర్ణయం తీసుకుంటాము. కమిటీ ఇప్పటికే ఒకసారి వీడియో కాన్ఫరెన్స్‌ జరిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీళ్లను మాత్రమే వాడుకుంటామని చెబుతోంది. పట్టిసీమ 45 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాలకు ఎంత మేరకు రావాలని అనే దానిపై జలాశక్తికి పంపాము. బోర్డ్ నిధుల సమస్య పరిష్కారం అయినట్లు ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఉద్యోగుల విషయంలో కొన్ని చిన్న చిన్న విషయాలను చూసుకుని బదిలీలు చేయాలి. బోర్డు తరలింపు అనేది కేంద్ర జలశక్తి ఆధీనంలో ఉంటుంది. ’ అని అన్నారు. ఈ భేటీకి బోర్డు చైర్మన్‌ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డిలు హాజరు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆదిత్యాథ్‌ దాస్‌ బోర్డు ముందు వాదనలు వినిపించారు.

బోర్డు సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ వాదనలకు వినిపించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇచ్చామని రజత్‌ కుమార్‌ తెలిపారు. 16.5 టీఎంసీలు హైదరాబాద్‌కు రావాలనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాగునీటి కేటాయంపులను 20 శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి ఆ మేరకు అదనపు జలాలను ఇవ్వాలని కోరినట్లు రజత్‌ కుమార్‌ చెప్పారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్‌ అంశాల గురించి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement