ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం..
కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు
త్వరలో కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం
సాక్షి, అమరావతి: ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
కేటాయించిన నీటి కంటే 8.66 టీఎంసీలు అధికంగా వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ హక్కులను కాలరాస్తోందని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బోర్డుకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 5 టీఎంసీలకు అదనంగా మరో 3 టీఎంసీలు విడుదల చేయాలని ఈఎన్‌సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనకు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయ్‌పురే అంగీకరించారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 8.5 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్‌సీ చేసిన విజ్ఞప్తికి కూడా కమిటీ సానుకూలంగా స్పందించింది. త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment