నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా వరద జలాల తరలింపుపై ఏపీ ప్రతిపాదన
150 టీఎంసీలతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం
గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కింద తెరపైకి తెచ్చిన ఏపీ
కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు చేరడంతో అప్రమత్తమైన తెలంగాణ
భవిష్యత్‌లో రెగ్యులేటర్, కాల్వ సామర్థ్యం పెంచేస్తారనే ఆందోళన
కృష్ణా, గోదావరి బోర్డులు, ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
ప్రాజెక్టు వివరాలను అందించాలని గోదావరి బోర్డును కోరిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది.
కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు
నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది.
హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది.
కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది.
నికర జలాల తరలింపునకే !
వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది.
మళ్లీ తాజాగా సాగర్‌ను బొల్లపల్లి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్‌లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు
గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్‌లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.
రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది.
ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని పేర్కొంది.
ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లు
రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment