పోలవరం అనుమతీ చెల్లదు! | Telangana Irrigation Department ENC writes to Godavari Board | Sakshi
Sakshi News home page

పోలవరం అనుమతీ చెల్లదు!

Jan 1 2025 1:29 AM | Updated on Jan 1 2025 1:29 AM

Telangana Irrigation Department ENC writes to Godavari Board

పోలవరంపై టీఏసీ భేటీకి మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ను కూడా పిలవలేదు 

తెలంగాణ ప్రాజెక్టులపై టీఏసీ భేటీకి తమను పిలవలేదన్న ఏపీ వాదనకు తెలంగాణ కౌంటర్‌ 

గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్‌ అవసరం లేదని స్పష్టీకరణ 

అనుమతి లేని ప్రాజెక్టులకు నీటి హక్కుల కోసమే ఏపీ వాదన అని ఆరోపణ 

గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. 

సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. 

‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్‌ ఇచి్చంది.  

గోదావరి ట్రిబ్యునల్‌ అవసరం లేదు 
అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్‌ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. 

‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్‌ ఏర్పాటును కోరుకుంటోంది. 

ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్‌ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది.  

ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది 
సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్‌ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 

35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.

పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు
‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్‌ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్‌ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. 

గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్‌ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement