పరీక్షలు జరపకుండా మరమ్మతులు చేయడమే కారణం
నిపుణుల కమిటీ సిఫారసులకు విరుద్ధంగా గ్రౌటింగ్ పనులు
దీంతో బరాజ్‌లు దెబ్బతినడానికి కారణాలు తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయాం
రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఎన్డీఎస్‌ఏ లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్‌లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్‌ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది.
ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్‌ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు.
బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు
‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్‌ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్‌లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది.
బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్‌లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్‌ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా..
‘అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్‌లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్‌కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు.
ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్‌ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్‌ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్‌ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది.
160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్
ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment