తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్‌ | Irrigation Dept Will Be Empty If Kaleshwaram Engineers Face Action, Says CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంటే ఉండదు: సీఎం రేవంత్‌

Published Thu, Sep 26 2024 9:00 PM | Last Updated on Fri, Sep 27 2024 11:03 AM

irrigation dept will be empty if Kaleshwaram engineers face action: CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన  700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్‌లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్‌ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.  రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.

‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.

పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. 

మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు.  దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.

మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. 
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్  నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.

పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement