భద్రాచలం ఆలయానికి పొంచి ఉన్న ముప్పుపై కూడా..
ఐఐటీహెచ్‌కు నిర్వహణ బాధ్యత.. మంత్రి ఉత్తమ్‌తో కలిసి ప్రత్యేక సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
ఏపీ చేపడుతున్న ‘గోదావరి–బనకచర్ల’పై అభ్యంతరం తెలపాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సర్వే చేయించి నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పోలవరం ముంపు అంశంపై శనివారం సీఎం రేవంత్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షించారు.
గోదావరికి 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం వల్ల భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైనా అధ్యయనం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర అనుమతుల్లేకుండానే కొత్తగా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎస్‌కు అభ్యంతరం తెలపాని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి బోర్డుతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు సైతం లేఖలు రాయాలని కోరారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) జి.అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరిమితంగానే ఉమ్మడి సర్వే అంటున్న ఏపీ
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై సైతం జాయింట్ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కిన్నెరసాని, ముర్రెడువాగులతో పాటే మరో ఐదు వాగులకు ఉండనున్న ప్రభావంపై సైతం సర్వే నిర్వహించాలని కోరుతుండగా ఏపీ అంగీకరించడం లేదు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ముర్రెడువాగు, కిన్నెరసానిలకే సర్వేను పరిమితం చేస్తామని ఏపీ అంటోంది.
ఏపీ వాదనను తెలంగాణ అంగీకరించి కేవలం రెండు వాగులకే జాయింట్ సర్వే నిర్వహిస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుతో తెలంగాణ నష్టపోవాల్సి వస్తుందని విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ శనివారం అధికారులతో సమీక్షలో ఈ అంశంపై వివరణ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం రెండు వాగులకు ముంపుపై సర్వే నిర్వహించాలని, మిగిలిన వాగులకు ముంపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం గతేడాది సాంకేతిక కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలను చెప్పిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది.
18 తర్వాత ఉమ్మడి సర్వేకు సిద్ధం
పోలవరంలో గరిష్ట నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రేడువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించి డీమార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ నెల 18 తర్వాత ఉమ్మడి సర్వేకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉమ్మడి సర్వే నిర్వహించగా తదుపరి క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment