‘సుందిళ్ల’పై జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట నవయుగ డైరెక్టర్ రమేశ్ వాంగ్మూలం
బరాజ్ నిర్మాణం పూర్తయిన వెంటనే చేసుకోవాల్సి ఉండగా నీటిపారుదల శాఖ చేసుకోలేదని వివరణ
బుంగలు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ చేశామని, తర్వాత పూర్తిస్థాయి మరమ్మతులు చేశామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్ నిర్మాణం 2021లో పూర్తయిందని, ఆ వెంటనే బరాజ్ పర్యవేక్షణ, నిర్వహణ (ఓ అండ్ ఎం) కోసం నీటిపారుదల శాఖ తమతో ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా చేసుకోలేదని బరాజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ వై.రమేశ్ చెప్పారు. బరాజ్ వద్ద తమ కంపెనీ సిబ్బందితో పాటు నీటిపారుదల శాఖ సిబ్బంది ఉన్నారని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు ఆరోపణలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రమేశ్‌కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. బరాజ్ నిర్వహణ, పర్యవేక్షణలో నిర్మాణ సంస్థ బాధ్యతల గురించి ప్రశ్నించింది.
నీటిపారుదల శాఖ రూపొందించిన డిజైన్లతో పోల్చితే సుందిళ్ల బరాజ్ వాస్తవ షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉండడంతోనే బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయని గతంలో సమర్పించిన అఫిడవిట్‌లో రమేశ్ పేర్కొనడాన్ని గుర్తు చేసింది. రెండు పర్యాయాలు బరాజ్‌కు బుంగలు ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.
చివరి బిల్లు చెల్లించడం లేదు
తొలిసారి బుంగలు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేశామని రమేశ్ బదులిచ్చారు. 2022 వరదల్లో బరాజ్‌కి తీవ్ర నష్టం జరగగా, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్‌ను శాఖ నుంచి తీసుకున్నట్టు ధ్రువీకరించారు.
సుందిళ్ల బరాజ్‌లో లోపాలను గుర్తించడానికి పలు రకాల పరీక్షలను నిర్వహించాలన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనలతో.. నీటిపారుదల శాఖ అధికారుల సంతృప్తి మేరకు ఆ పరీక్షలన్నీ పూర్తి చేశామని వివరించారు. కాగా బరాజ్ నిర్మాణానికి సంబంధించిన చివరి బిల్లును ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని కమిషన్‌కు రమేశ్ ఫిర్యాదు చేశారు.
అనుబంధ ఒప్పందంతో కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదు
సుందిళ్ల నిర్మాణం 2021 డిసెంబర్‌లో పూర్తికాగా, 2023లో అదనపు పనులు చేసేందుకు నీటిపారుదల శాఖతో అనుబంధ ఒప్పందం చేసుకున్నామని నవయుగ ప్రాజెక్టు ఇన్‌చార్జి కె.ఈశ్వర్‌రావు తెలిపారు. అనుబంధ ఒప్పందంతో పాత కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు.
సుందిళ్ల బరాజ్ దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని చెప్పారు. నవయుగ కంపెనీ మరో ప్రాజెక్టు ఇన్‌చార్జి చింతా మాధవ్ సైతం విచారణకు హాజరు కాగా, ఆయనకు కేవలం మెటీరియల్ కొనుగోళ్లతో మాత్రమే సంబంధం ఉండడంతో కమిషన్ ఆయన్ను ప్రశ్నించలేదు.
కాపీ పేస్ట్‌లా అఫిడవిట్లు
నవయువ కంపెనీ డైరెక్టర్‌తో పాటు ఇద్దరు ప్రాజెక్టు ఇన్‌చార్జిలు దాఖలు చేసిన అఫిడవిట్లు కాపీ.. పేస్ట్ తరహాలో ఉన్నాయని కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. డైరెక్టర్ అఫిడవిట్‌కు కార్బన్ కాపీలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment