ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీళ్లు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు షురూ
నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్/రామగుండం/ధర్మారం: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల ద్వారా నీటి పంపింగ్ ప్రక్రియను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీళ్లను నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా నందిమేడారం, మిడ్‌మానేరు జలాశయాల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పంపింగ్ ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీటి నిల్వలు చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ కోరిందని, దీంతో ఈ మూడు జలాశయాల నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించడం సాధ్యం కాదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బదులిచి్చన విషయం తెలిసిందే. అయితే, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలిస్తామని ప్రకటించారు.
మంత్రి ప్రకటన మేరకు నీటిపారుదల శాఖ శనివారం నుంచే పంపింగ్ ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా భారీ వర్షాలతో వస్తువన్న వరదలతో శనివారం 17.34 టీఎంసీలకు నిల్వలు చేరాయి. 14,358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా శనివారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రావిటీ కాలువ ద్వారా తరలివస్తున్న నీటిని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఉన్న నంది పంప్‌హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు.
మొత్తం 7 పంపులు ఉండగా, 4 పంప్‌లను ఆపరేట్ చేస్తూ 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒక మోటారును ఆన్‌చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల వరకు మరో మూడు విద్యుత్ మోటార్లు రన్ చేశారు. నందిమేడారం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్‌హౌస్‌లోకి అంతే స్థాయిలో 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌లోని నాలుగు బాహుబలి పంపుల ద్వారా నీళ్లను గ్రావిటీ కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు.
అక్కడి నుంచి ఆ నీళ్లు మిడ్‌మానేరుకు తరలిపోతున్నాయి. నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో మడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నామని, దీనిని రైతులు సది్వనియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment