4 రోజులు కానీయ్ అని చూస్తున్నా... ఎర్రవల్లిలో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్
రాష్ట్రంలో జరుగుతున్నవి గంభీరంగా, మౌనంగా చూస్తున్నా
ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు
నాలుగైదు నెలలైతే జీతాలూ ఇవ్వడం కష్టమనే దుస్థితి
పాలనలో లోపాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారు
కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొడతామన్నట్టు జనం ఉన్నారు
ప్రాణం పోయినా సరే.. తెలంగాణకు గులాబీ జెండాయే రక్షణ
ప్రత్యక్ష పోరాటాలు లేవదీసి నీళ్లు, ప్రాజెక్టులు సాధించుకుందాం
ఫిబ్రవరి చివరిలో సభతో తెలంగాణ శక్తి చాటుదామని పిలుపు
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు కదా. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్(congress party) అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ను ఎండబెడుతున్నరు. ఈ అన్యాయాలపై ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ పెట్టి వీళ్ల సంగతి చూడాలి.
పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి తెలంగాణ శక్తిని మరోమారు చాటాలి. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి’ అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(Kcr) పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుంచి వందలాది మంది బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘మన పార్టీకి కులం, మతం, జాతి అనే భేదభావం లేదు. తెలంగాణ సరిహద్దు లోపల ఉన్న వారందరికీ న్యాయం జరిగి బాగుపడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే కొట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సింది బీఆర్‌ఎస్ అనే విషయంలో రెండో మాటే లేదు. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలి. అవసరమైన సందర్భంలో నేను, జిల్లా నాయకులు ఇచ్చే పిలుపునకు స్పందించి ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎదురు తిరిగి కొట్లాడాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన గులాబీ జెండా తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టింది.
కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు..
ఇన్నాళ్లూ కోటి రూపాయలు పలికిన భూమిని ఇప్పుడు రూ.50లక్షలకు కొనే పరిస్థితి లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్చి వరకు రూ.15వేల కోట్ల ఆదాయం తగ్గుతోందని కాగ్ రిపోర్టు చెబుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏటా ఆదాయంలో రూ.15 వేల కోట్ల వృద్ధిని సాధించింది. ఇప్పుడు మరో నాలుగైదు నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమనే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు.
మనం ప్రాజెక్టులు, చెరువుల కింద నీటి తీరువా రద్దు చేసి రైతులకు ఎన్నో సదుపాయాలు కల్పించాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అత్యాశకు పోయి ఓట్లేసి బావిలో పడ్డారు. మంది మాటలు పట్టుకుని మార్వాణం పోతే మళ్లీ వచ్చేసరికి ఇల్లు ఆగమైందన్నట్టు పరిస్థితి తయారైంది. తులం బంగారం ఇస్తామంటే నమ్మి ఓటేస్తే ఏమవుతుందో తెలంగాణలో మంచి గుణపాఠం అయింది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు.
ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నరు..
రైతుబంధుతో వ్యవసాయం మెరుగై అప్పులు తీర్చుకుని, చిట్టీలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడా సంతోషం మంటగలిసింది. వాళ్లు ఎన్నికల సమయంలో ఇస్తరో ఎప్పుడు ఇస్తరో దేవుడికే ఎరుక. కరోనా సమయంలో మేం రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు వేయించుకుని వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు కాన్వెంట్ విద్య అందిస్తే.. ఇప్పుడు పిల్లలు విషాహారం, పురుగుల అన్నం, కడుపునొప్పితో ఇంటి బాట పడుతున్నరు. కాంగ్రెస్ పాలన లోపాలను ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లకు పట్టిస్తున్నారు. ఏడాది పాలనతోనే కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొడతం అన్నట్లుగా జనం ఉన్నరు.
ఫామ్‌హౌజ్‌కు వస్తే పార పట్టొచ్చు
వాళ్ల పార్టీ నిన్న ఒక పోలింగ్ పెట్టింది. అందులో 70శాతం మనకు, 30శాతం వాళ్లకు వచ్చింది. ఫామ్ హౌజ్ అంటే ఇక్కడ వరి, మక్కలు, అల్లం తప్ప ఏముంటది. కాంగ్రెస్ వాళ్లు వస్తే తలాకొంత సేపు పారపట్టి పనిచేయచ్చు. ఫామ్‌హౌజ్ అని బదనాం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనకు విసిగి మళ్లీ మనమే రావాలని ప్రజలు వందశాతం కోరుకుంటున్నరు. కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
రైతులను సమీకరించి ఉద్యమం
జహీరాబాద్ నియోజకవర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసి రైతులను ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సూచించారు.
పాదయాత్రగా ఎర్రవల్లికి వచ్చిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, బోయిని చంద్రయ్య, పార్టీ నేతలు సంగమేశ్వర్, ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు కేసీఆర్‌ను సత్కరించి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment