
ఉద్యమ కాలం నాటి సభలను గుర్తు చేసిన రజతోత్సవ సభ
ఫలించిన భారీ జన సమీకరణ వ్యూహం.. గులాబీ మయం
ఉద్యమ కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసిన కేసీఆర్
తొమ్మిదిన్నరేళ్ల తన పాలనలో చేపట్టిన పథకాల మననం
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనను తూర్పార పట్టిన అధినేత
సభ సక్సెస్ కావడంపై బీఆర్‌ఎస్‌లో నూతన ఉత్సాహం
మళ్లీ మనదే సర్కారు అంటూ చేసిన ప్రసంగంతో జోష్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగసభ ఉద్యమకాలం నాటి సభలను గుర్తు చేసింది. భారీగా జనం తరలివచ్చి సభ విజయవంతం కావడం పార్టీలో కొత్త జోష్‌ను నింపింది. భారీ జన సమీకరణ లక్ష్యంగా కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిన ప్రయత్నాలు సఫలం కావడంతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికలో నిరాశ కలిగించే ఫలితాలు ఎదుర్కొన్న బీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సభ సాగింది. సుమారు ఏడాది కాలం తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు.
ఉద్యమ కాలం నుంచి నేటి దాకా
టీఆర్‌ఎస్ ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్న సామా జిక పరిస్థితులను కేసీఆర్ వివరించారు. ఉద్యమ కాలంలో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఎత్తు పల్లాలను గుర్తు చేశారు. తాను చేపట్టిన ఆమరణ దీక్ష మూలంగా తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యత కాంగ్రెస్‌కు ఏర్పడిన తీరును వివరించారు. ప్రత్యేక రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వ్యవసా యం, విద్యుత్, తాగునీరు, సాగునీరు, విద్య తదితర రంగాల్లో జరిగిన కృషిని గుర్తు చేశారు. రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తాను ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాన్ని కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మెరుపు దాడి
ఏడాది తర్వాత బహిరంగసభ వేదికగా మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పేరు ఎత్తకుండా వారి పనితీరుపై విమర్శల దాడి చేశారు. సీఎం రేవంత్ ప్రభుత్వ పాలనావైఫల్యం, అనుభవలేమి, అవినీతిపై విమర్శల దాడి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వైఫల్యాన్ని తనదైన శైలిలో సామెతలు, పిట్ట కథలతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
తెచ్చిన తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతోందని భావోద్వేగంతో వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది. వచ్చే రెండున్నర ఏళ్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రస్తావించారు.
కేటీఆర్ స్థానాన్ని బలోపేతం చేసేలా
సభావేదికను ‘బాహుబలి’గా పార్టీ నేతలు అభివర్ణించగా, సభా మైదానంలో చేసిన ఏర్పాట్లపై బీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా వేదికపైనా కేటీఆర్ వచ్చిన సందర్భంలో నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా కేటీఆర్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాట్లు జరిగాయని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.
భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలు
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించడాన్ని కేసీఆర్ ఖండించారు. అదే సమయంలో పార్టీ కేడర్ వెంట నిలుస్తానని, రాబోయే రోజుల్లో పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారు. ఇకపై ప్రజాక్షేత్రంలో చురుగ్గా వ్యవహరిస్తాననే సంకేతాలు ఈ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చారు. ఆపరేషన్ కగార్ మినహా బీజేపీకి సంబంధించిన ప్రస్తావన కేసీఆర్ ప్రసంగంలో పెద్దగా కనిపించలేదు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వరంగల్‌ను రజతోత్సవ సభ నిర్వహణకు ఎంపిక చేసుకున్న బీఆర్‌ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో తమ స్థానం చెక్కు చెదరలేదనే సంకేతం ఇచ్చేందుకు బలంగా ప్రయత్నించింది.
మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
హసన్‌పర్తి/వరంగల్‌క్రైం: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు. అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపై బారులుదీరడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల్ని నిలిపేందుకు మూడుచోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇటు హనుమకొండ నుంచి ఎల్కతుర్తి, దేవన్నపేట–అన్నాసాగరం మార్గంతోపాటు హుజూరాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఎటూ చూసినా మూడు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
సభకు వెళుతున్న బస్సుల అడ్డగింత
తిరుమలాయపాలెం: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులకు బీఆర్‌ఎస్ స్టిక్కర్లు వేసుకొని రజతోత్సవ సభకు వెళుతుండగా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఆర్‌టీఓ, అధికారులు అడ్డుకున్నారు. లైసెన్స్‌లు రద్దు చేసి, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య అక్కడకు చేరుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, బస్సులను పంపించారు. ఆ తర్వాత మళ్లీ బస్సులు ఆపుతుండగా, మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆగి రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ: కేసీఆర్
తెలంగాణ నలమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి బీఆర్‌ఎస్ సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
కిక్కిరిసిన గూడూరు టోల్‌ప్లాజా
బీబీనగర్: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జంట నగరాలు సహా.. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తల వాహనాలు భారీగా తరలి రావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. దీంతో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయి.. వాహనాలు నెమ్మదిగా కదిలాయి.