Silver Jubilee
-
‘కారు’ ఇక పరుగు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతల మధ్య పని విభజన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడంపై దృష్టి సారించింది. ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి దగ్గర కావాలని నిర్ణయించింది.తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే అభిప్రాయంతో ఉంది. తద్వారా కొత్త తరాన్ని ఆకర్షించే ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఈ నెల 19న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు కీలక నేతల నడుమ పని విభజన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీ రామారావుకు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు బాధ్యతను అప్పగించనున్నారు. ఇప్పటికే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన రైతు ధర్నాల్లో పాల్గొన్న కేటీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుకు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు తదితరాలను హరీశ్ పర్యవేక్షిస్తారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా హరీశ్‌రావుకే అప్పగించనున్నట్లు సమాచారం. అనుబంధ సంఘాలపై కవిత దృష్టి ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత వరుస సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ శక్తుల ఏకీకరణ.. యువతకు చేరువ ఉద్యమ కాలంలో పార్టీతో కలిసి వచ్చిన వ్యక్తులు, శక్తులకు తిరిగి దగ్గర కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ఏడాది పొడవునా సాగే పార్టీ రజతోత్సవాల్లో ఉద్యమంలో కలిసి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు, వివిధ జేఏసీల్లో క్రియాశీలంగా పనిచేసిన వారితో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయడంతో పాటు కొత్త తరానికి తెలంగాణ నేపథ్యం, రాష్ట్ర సాధన ఉద్యమం తదితరాలను పరిచయం చేయాలని, పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, పదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పుట్టిన పసికందులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న యువతగా ఎదిగారు. వారిలో తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తిని రగిలించేలా సదస్సులు, సమావేశాలు, సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కార్యక్రమాలకు రూపకల్పన బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. కార్యాచరణ రూపకల్పనకు కోర్ గ్రూప్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ప్రణాళికల రూపకల్పనకు సుమారు 25 నుంచి 30 మంది సీనియర్ నేతలతో కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని అధినేత భావిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిన నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లకు చోటు కలి్పస్తారు. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోజనశాల, పార్కింగ్ తదితర వసతుల కల్పన పూర్తయిన తర్వాత మినీ సభలను తలపించేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. -
25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్
రాజా.. 1999 మార్చి 18న ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు రీమేక్.. ఇప్పటికి టాలీవుడ్లో ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలోనే రాజా చిత్రం తెలుగులో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలయిన ఈ సినిమా వెంకటేశ్- సౌందర్య జోడీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వాస్తవంగా 'రాజా'లో హీరోయిన్ మొదట సౌందర్య కాదట. ఈ సినిమాకు మొదటగా రోజాను హీరోయిన్గా అనుకున్నారట. అందుకు కారణం రాజా మాతృక అయిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే చిత్రంలో మొదట నటించింది రోజానే కావడం. తమిళంలో వచ్చిన ఆ సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తమిళంలో లీడ్ రోల్స్‌లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్‌లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా. కానీ ఆ సమయంలో రోజా వద్ద అవసరమైన డేట్స్ లేకపోవడంతో సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్‌గా అనేవారు. అంతలా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయింది. ఆ రోజుల్లో రాజా సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మొదట దొంగగా కనిపించిన వెంకీ ఆ తర్వాత తన సరైన నటనతో ప్రేక్షకులను కదిలించాడు. అంతే స్థాయిలో సౌందర్య తన సెంటిమెంట్‌తో కట్టిపడేసింది. 71 కేంద్రాల్లో రాజా సినిమా 100 రోజులు ఆడింది. 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్ కెరియరల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు ఉత్తమ ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు దక్కింది. రాజా విడుదలయ్యి నేటితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలు, ఆలోచనలకు పదును పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచంలో భారతదేశం తనదైన ముద్ర వేసినా ఆవిష్కరణలు లేకపోవడంతో దేశీయంగా అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులు రావడం లేదని మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశంలో ఆవిష్కరణల వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు తమవంతుగా జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాము లు కావాలని విద్యార్థులను ఆహ్వానించారు. హైదరా బాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా టాక్ సిరీస్‌ను ప్రారంభించిన కేటీఆర్ టెక్నాలజీ అభివృద్ధి–ఆర్థిక ప్రగతితో పాటు హైదరాబాద్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం విద్యా ర్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. ‘సాంకేతిక ఆధా రిత ఆవిష్కరణలపై పనిచేస్తున్న విద్యార్థులు, యువత దేశ భౌగోళిక ఆర్థిక సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినపుడే విజయం సాధిస్తారు. నేటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న పేదదేశంగా ఉందని గణాంకాలు చెప్తున్నాయి. భారత్‌కు వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపా ల్సిన అవసరముంది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువు తున్న విద్యార్థులు ప్రపంచస్థాయి ఆవిష్కరణల కోసం సృజనాత్మకంగా ఆలోచించాలి. పరిశోధన, అభివృద్ధి రంగాలపై దేశంలో ఖర్చు పెంచాల్సిన అవసరముంది. ట్రిపుల్ ఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలను మరింత పదును పెట్టాలి. పరిశోధన–అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా పాఠ్య ప్రణాళికలు, విద్యా బోధన మార్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధ్యం’ అని కేటీఆర్ సూచించారు. వచ్చే ఐదేళ్లలో వంద బిలియన్ డాలర్లకు లైఫ్‌సైన్సెస్ ‘హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైన్సెస్ వాతావరణం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకొని ఉంది. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. భారతీయ యువత అన్ని రంగాల్లో వినూత్న ఆవిష్కరణల దిశగా పని చేయాలి. స్టార్టప్‌లు ఏర్పాటు చేసే యువత వాటిపై పెట్టుబడిదారులకు ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. తమ ఉత్పత్తుల గురించి వివరించగలిగితే భారతీయ స్టార్టప్‌లలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.’ అని కేటీఆర్ వివరించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో పలు స్టార్ట్ అప్స్ రూపొందించిన ప్రయోగాలు, ఉత్పత్తులను కేటీఆర్ పరిశీలించారు. సమావేశంలో ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులు జయేష్ రంజన్, అజిత్ రంగనేకర్, శ్రీని రాజు, చంద్రశేఖర్, ప్రొఫెసర్ లింగాద్రి తదితరులు హాజరయ్యారు. -
NSE INDIA : మహీంద్రా గ్రూప్ సిల్వర్ జూబ్లీ
దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా అనేక రికార్డులు సృష్టిస్తున్న మహీంద్రా గ్రూపు నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో అడుగు పెట్టి నేటికి 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. దేశంలో రెండో స్టాక్ ఎక్సేంజీగా వచ్చిన నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో సైతం మహీంద్రా తనదైన ముద్రను వేసింది. 1996 జనవరి 3న ఎన్ఎస్ఈలో మహీంద్రా లిస్టయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఈ ట్విట్టర్ వేదికగా మహీంద్రా గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మీకి జీపులు తయారు చేసే కంపెనీగా మార్కెట్లోకి అడుగు పెట్టిన మహీంద్రా అండ్ మహ్మద్ కంపెనీ ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రాగా మారింది. గత 75 ఏళ్లలో మహీంద్రా గ్రూపు ఎన్నో విజయాలు సాధించింది. వాహనాల తయారీ నుంచి బ్యాంకింగ్ సెక్టార్ వరకు అనేక రంగంలో పాదం మోపి విజయం సాధించింది. Hearty congratulations from all of us at NSE to Mahindra & Mahindra Ltd. One of India's leading automobile companies on completing 25 years of being listed on the NSE. #ThisDayThatYear #NSE #NSEIndia pic.twitter.com/mK2kGN9qw6 — NSEIndia (@NSEIndia) January 3, 2022 -
సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం
కన్నడ నటుడు సుదీప్ తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. అనూప్ భండారి దర్శకత్వంలో జాన్ మంజునాథ్, శాలినీ మంజునాథ్ నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్ క్రియేట్ చేసిన సుదీప్ ‘విక్రాంత్ రోణ’తో సరికొత్తగా పరిచయం అవుతున్నారు. బూర్జ్ ఖలీఫాలో ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం చుట్టారు. ఇండియన్ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టమిది. ఈ వేడుక కోసం 2000 అడుగుల ఎత్తున్న సుదీప్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ కటౌట్‌తో సుదీప్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్. -
పాతికేళ్ల బ్రౌన్ కేంద్రం
సి.పి.బ్రౌన్ (1798–1884) సుమారు 1827లో కడపలోని ఎర్రముక్కలపల్లెలో 15 ఎకరాల తోటను, ఓ పెద్ద బంగళాను వెయ్యి వరహాలకు (3500 రూపాయలకు) కొని రెండేళ్లపాటు ఆ భవనంలోనే వుండి సంస్కృతాంధ్ర పండితుల్ని సమకూర్చుకుని, తెలుగు కావ్య సముద్ధరణకు కంకణబద్దులయ్యారు. ఆ జిల్లావాడే అయిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి(1800–44) ఆజమాయిషీలో ఆ పండిత కూటమి, కార్యాలయం ‘బ్రౌన్ కాలీజా’గా పేరు మోసింది. పరిశోధక సాహసి బంగోరె(బండి గోపాలరెడ్డి) మాటల్లో చెప్పాలంటే, సి.పి.బ్రౌన్ ‘‘నిలవనీడ లేకుండా పోయిన తెలుగు కావ్యసరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో వొక సాహిత్య పర్ణశాల యేర్పరచి, ఆ వాగ్దేవి నిండు ముత్తయిదువులాగా నడయాడేలా’’ చేశారు. 20 సెంట్ల ప్రదేశంలో ఎర్రముక్కలపల్లెలో స్థాపించబడి, రెండు మూడు దశాబ్దాలపాటు సరస్వతీ నిలయంగా విరాజిల్లిన బ్రౌన్ కాలేజీ నేడు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఆశ్రయంలో వెలుగు జిలుగులు నింపుతోంది. బ్రౌనుకు నమ్మకస్తుడైన చెలికాడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి అకాలమరణం తర్వాత ‘బ్రౌన్ కాలీజా’ గతి ఏమైందో, 1855లో బ్రౌన్ స్వదేశానికి వెళ్లేదాకా వుండిందో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక! బ్రౌన్ దొర బంగళా, తోట ప్రాంతాన్ని కడప కోర్టువారు వేలం వేయగా కడపలో పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్ సి.ఆర్.కృష్ణస్వామి రెండు వేల రూపాయలకు కొన్నారు. అప్పటికే శిథిలమై ఉండిన ఆ బంగళా కాలక్రమంలో మరింత శిథిలం కాగా, 1987లో సి.ఆర్.కృష్ణస్వామి సుపుత్రులు సి.కె.సంపత్‌కుమార్, కడప కలెక్టర్ జంధ్యాల హరినారాయణ నేతృత్వంలో, జానమద్ది హనుమచ్ఛాస్త్రి సారథ్యంలో ఏర్పడిన సి.పి.బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు ధారాదత్తం చేశారు. హరినారాయణ గ్రామీణ క్రాంతి పథకం కింద మూడున్నర లక్షల మ్యాచింగ్ నిధి విడుదల చేసి, 1987 జనవరి 22వ తేదీన సి.పి.బ్రౌన్ స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయగా సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సభాధ్యక్షులుగా ఆశీర్వదించారు. ‘ఇంటికొక పువ్వయితే, దేవుడికో దండం’ అని పెద్దల మాట. మధ్యప్రదేశ్ బస్తర్‌లోని ఓ తెలుగుబిడ్డ డి.వి.ప్రసాద్ లాంటి సామాన్యుడు 10 రూపాయలు పంపగా, ఎంతోమంది వదాన్యులు వేలాది రూపాయలు సంతోషంగా గుమ్మరించారు. కడప కలెక్టర్లు పలు తడవలుగా నిధులు ఇచ్చారు. 1995 నవంబర్ 29న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రంథాలయమేమో ప్రారంభమయింది. మరి పుస్తకాలో? పోతేపల్లి వెంకన్న శ్రేష్ఠి 2500, బిరుదురాజు రామరాజు 2800, కోడూరి పుల్లారెడ్డి, ఇంకా ఎందరో మహానుభావులు ఎంతో విలువైన తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, కన్నడ పుస్తకాల్ని కానుకగా ఇచ్చారు. 1998 నవంబర్ 14, 15 తేదీల్లో బ్రౌన్ ద్విశత జయంతి మహోత్సవం జరిగింది. సి.నారాయణరెడ్డి ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2003లో రాజ్యసభ సభ్యుడిగా పది లక్షలు మంజూరు చేశారు. గ్రంథాలయ సమితి వారు రెండవ అంతస్థు భవనానికి సినారె పరిశోధన కేంద్రం అని నామకరణం చేసి ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు ప్రకటించుకొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి 2005 జనవరి 27న గ్రంథాలయాన్ని సందర్శించి, నిర్వహణకు 15 లక్షల గ్రాంటు మంజూరు చేయడమే కాకుండా, దాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించేలా ఆజ్ఞ జారీ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి గ్రంథాలయం పరిశోధనా కేంద్రంగా రూపొందింది. 2006 నవంబర్ 1 నుంచి యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మారింది. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని గ్రంథాలయంలో మెకంజీ కైఫియత్తుల 42 సంపుటాల జిరాక్స్ ప్రతులు, బ్రౌన్ లేఖల 17 సంపుటాల నకళ్లు ఉన్నాయి. 66 వేలకు పైగా వివిధ భాషల పుస్తకాలు ఉన్నాయి. మూడువేల పత్రికల ప్రత్యేక సంచికలు, తెలుగు ఎంఫిల్, పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ కేంద్రం తరఫున మెకంజీ కడప జిల్లా కైఫియత్తుల 7 సంపుటాల్ని, బ్రౌన్పై రెండు వ్యాస సంకలనాల్ని, నన్నెచోడుడు, నాచన సోమన, అన్నమాచార్యులు, అల్లసాని పెద్దన మొదలైన రాయలసీమ ప్రాచీన కవులపై వ్యాససంకలనాల్ని ప్రచురించారు. నెలనెలా సాహిత్య ప్రసంగాల్ని ఏర్పాటు చేసి, వాటిని కాలక్రమంలో ముద్రిస్తూవున్నారు. మూల మల్లికార్జునరెడ్డి సారథ్యంలో రజత జయంతి సందర్భంలో కడపజిల్లా సర్వస్వం, రజత జయంతి ప్రత్యేక సంచిక, తాళ్లపాక తిమ్మక్క వ్యాససంకలనం వగైరా విడుదల కానున్నాయి. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిశోధకుల పాలిట కల్పవృక్షమై వర్ధిల్లుగాక! - ఘట్టమరాజు 9964082076 -
ఆర్. నారాయణమూర్తి సినిమాకు 25 ఏళ్లు
పాతికేళ్ళ తరువాత కూడా ఒక సినిమా గుర్తుందంటే... అందులోని పాత్రలు, పాటలు, అభినయం గుర్తున్నాయంటే.. ఆ సినిమా కచ్చితంగా ప్రత్యేకమే. దాసరి నారాయణరావు నిర్మాతగా, దర్శకుడిగా తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి హీరోగా రూపొందించిన ‘ఒరేయ్ రిక్షా’ ఆ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇవాళ్టికి ఈ సినిమాకు పాతికేళ్ళు. సరిగ్గా పాతికేళ్ళ క్రితం 1995. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావుకు ఎందుకో కాలం కలసిరాలేదు. వరుసగా కొన్ని ఫ్లాపులు. ఆర్థికంగా అనుకోని ఆటుపోట్లు! గతంలో ఆయనతో హిట్లు సాధించిన అగ్ర హీరోలు కూడా ఆ సమయంలో డేట్లు ఖాళీ లేవంటూ బిజీ మంత్రం పఠించసాగారు. సరిగ్గా అప్పుడే ఆయనకు తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి, అతని కోసం గతంలో తాను అనుకున్న ఓ మదర్ సెంటిమెంట్ కథ గుర్తొచ్చాయి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..: అంతకుముందు కొన్నేళ్ళ క్రితం దాసరి ఓ తల్లి సెంటిమెంట్ కథ అనుకున్నారు. అప్పట్లో సామాజిక విప్లవ కథాంశాలతో ముందుకొస్తున్న టి. కృష్ణ దర్శకుడిగా, ఆర్. నారాయణమూర్తి హీరోగా దాసరి ఆ కథను నిర్మించాలనుకున్నారు. టి. కృష్ణతో మాట్లాడారు కూడా. అంతా ఓకే. కానీ, బిజీగా ఉన్న టి. కృష్ణ క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. ఇప్పుడు టి. కృష్ణ లేరు. కానీ, ఆర్. నారాయణమూర్తి నమ్మినబంటులా గురువు గారి కోసం సిద్ధంగా ఉన్నారు. నిజానికి, ఈ మధ్య గ్యాప్‌లో నారాయణమూర్తి నిర్మాతగా, దర్శకుడిగా మారి, ‘అర్ధరాత్రి స్వతంత్రం, ఎర్రసైన్యం’ లాంటి వరుస విప్లవ సినిమాలు తీశారు. ఆ భారీ ఘన విజయాలతో ‘పీపుల్స్ స్టార్’ హీరోగా ఎదిగి, బిజీగా ఉన్న నారాయణమూర్తిని గురువు దాసరి పిలిచారు. గురువు గారి కోసం పైసా పారితోషికం లేకుండా, ఏం చేయడానికైనా శిష్యుడు సిద్ధమయ్యారు. మునుపటి తల్లీ కొడుకుల కథలో మరిన్ని అంశాలు జొప్పించి, లీడర్ వర్సెస్ క్యాడర్ అనేది ప్రధానాంశంగా, సినిమా తీద్దామన్నారు దాసరి. అలా దాసరి తన పేరు మీద దాసరి ఫిలిమ్ యూనివర్సిటీ పతాకం స్థాపించి, ఆ బ్యానర్‌పై తొలి సినిమాగా తీసిన చిత్రం ‘ఒరేయ్ రిక్షా’. సమకాలీన సామాజిక ఘటనలతో..: అంతకు ముందు వేషాల కోసం మద్రాసు వచ్చిన ఆర్. నారాయణమూర్తికి చిన్న వేషాలతో సినీజీవితమిచ్చిన దాసరి, కాలం మారి తన శిష్యుడు స్టార్ అయ్యాక, అడిగి హీరోగా పెట్టి మరీ తీసిన ఏకైక సినిమా ఇది. ఒక రాజకీయ నేత చెప్పిన మాటలు నమ్మి, అతని కోసం తన వాళ్ళతో ఓట్లన్నీ వేయించి, క్యాడర్‌గా ఒక రిక్షా కార్మికుడు శ్రమిస్తే, చివరకు ఆ లీడరే ఆ క్యాడర్ అందరినీ మోసం చేస్తే ఏమైందనేది కథాంశం. రాజకీయ నేతలు, పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ గనక ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడకపోతే, యువతరం మరో మార్గం లేక తుపాకీ పట్టుకొని అడవుల్లోకి పోవాల్సి వస్తుందని సినిమాలో చెప్పారు దాసరి. రిక్షా కార్మికుడు సూర్యంగా ఆర్. నారాయణమూర్తి, అతని భార్యగా రవళి, అతని చెల్లెలిగా మధురిమ (నటి ప్రభ మేనకోడలు), తల్లిగా శివపార్వతి, రాజకీయ నేతగా రఘునాథరెడ్డి నటించారు. నారాయణమూర్తి ప్రభృతుల అభినయం, నాటక రచయిత సంజీవి రాసిన పదునైన మాటలు, ముక్కురాజు కొరియోగ్రఫీ – ఇవన్నీ ‘ఒరేయ్ రిక్షా’ను పైయెత్తున నిలిపాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై..: దాసరితో సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్ పనిచేసిన తొలి చిత్రం ఇదే. ఆ తరువాత ఆ కాంబినేషన్లో ‘ఒసేయ్ రాములమ్మా’ సహా పలు చిత్రాలు వచ్చాయి. విప్లవ గాయకుడు గద్దర్ తాను రాసిన ‘రక్తంతో నడుపుతాను రిక్షాను..’ సహా పలు ప్రైవేట్ జనగీతాలను ఈ సినిమాలో వాడుకొనేందుకు అనుమతినిచ్చారు. ఆత్మీయుడు ఆర్. నారాయణమూర్తి కోసం పారితోషికమైనా తీసుకోలేదు. ఈ సినిమాలో ‘రక్తంతో నడుపుతాను.., జాగోరే జాగో జాగో.., జాతరో జాతర..’ – ఇలా అన్ని పాటలూ హిట్. అన్నాచెల్లెళ్ళ అనుబంధమూ కీలకమైన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’ అనే పాట రాసి ఇచ్చారు గద్దర్. ఈ పాట చిరస్థాయిగా నిలిచింది. ఆ పాట రాసిన గద్దర్‌కూ, పాడిన ‘వందేమాతరం’ శ్రీనివాస్‌కూ ఇద్దరికీ ప్రభుత్వం ఆ ఏడాది నంది అవార్డులు ప్రకటించింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో గద్దర్ ఆ అవార్డును తిరస్కరించడం వేరే కథ. మరపురాని గురుదక్షిణ: పూర్తిగా తిరుపతి పరిసరాల్లో, కొంత మద్రాసులో చిత్రీకరణ జరుపుకొన్న ‘ఒరేయ్ రిక్షా’ అప్పట్లో పెద్ద సంచలనం. పాతికేళ్ళ క్రితం 1995 నవంబర్ 9న రిలీజైన ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్‌గా నిలిచింది. పేరుతో పాటు పైసలూ తెచ్చింది. మచ్చుకు చెప్పాలంటే – షూటింగ్ వేళ గురువు గారికి ఇబ్బంది లేకుండా, ఈస్ట్ గోదావరి రైట్స్ కోసమంటూ 20 లక్షలు ముట్టజెప్పారు నారాయణమూర్తి. సినిమా విడుదలయ్యాక ఏకంగా అక్కడ 60 లక్షలు వసూలు చేసింది. మళ్ళీ దాసరికి కొత్త ఊపు తెచ్చింది. సాక్షాత్తూ దాసరి సతీమణి పద్మ సైతం ‘‘మీ గురువు ఋణం తీర్చుకున్నావయ్యా. మళ్ళీ మీ గురువును నిలబెట్టావయ్యా’’ అని తనతో అన్న విషయాన్ని ‘పీపుల్స్ స్టార్’ ఇప్పటికీ చెమర్చిన కళ్ళతో గుర్తు చేసుకుంటారు. తరువాత దాసరి ‘ఒసేయ్ రాములమ్మా’ లాంటి మరో ఆల్ టైమ్ హిట్ తీయడం వెనుక ‘ఒరేయ్ రిక్షా’ ప్రభావం కనిపిస్తుంది. బడుగు, బలహీన వర్గాల ఆత్మాభిమానాన్నీ, ఆత్మగౌరవాన్నీ చాటిచెప్పిన ఈ రెండు చిత్రాలూ దాసరి కెరీర్లో మైలురాళ్ళుగా మిగిలిపోయాయి. సాక్షాత్తూ దాసరి సైతం హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో కృష్ణ, నిర్మాత ఎమ్మెస్ రెడ్డి సమక్షంలో ‘‘విప్లవ సినిమాలు తీయడం ఓ ముళ్ళబాట. ఆ ముళ్ళబాటను సరిచేసి, రాస్తాగా మార్చాడు నా బిడ్డ ఆర్. నారాయణమూర్తి. ఆ రాస్తాలో ఇవాళ నేను, అనేకమంది పయనిస్తున్నాం’’ అని సభాముఖంగా మెచ్చుకోవడం గురువు ముఖతః శిష్యుడికి దక్కిన ఓ అపూర్వ గౌరవం. ఓ శిష్యుడు చెల్లించిన గురుదక్షిణగా చరిత్రలో మిగిలిపోయిన చిత్రం – ‘ఒరేయ్ రిక్షా’. – రెంటాల జయదేవ -
25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
‘నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో’ అంటుంది ఈ సినిమాలోని సిమ్రన్ పాత్ర పోషించిన కాజోల్ పసుప్పచ్చటి చేలలో. ‘అలా నిన్ను తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడటం ఎందుకూ?’ అంటాడు రాజ్ పాత్రలో ఉన్న షారుక్ ఖాన్.. అప్పటికే ఆమె కోసం లండన్ వదిలి పంజాబ్‌లోని పల్లెకు చేరుకుని ఆమె కుటుంబం ఆదరణ పొందే ప్రయత్నంలో ఉంటూ. కాజోల్ తండ్రి అమ్రిష్ పురికి తన కుమార్తెను తన ప్రాంతంలో తన బంధువర్గంలో ఇచ్చి చేయాలని కోరిక. కాని ఆమె షారుక్‌ను ప్రేమించింది. షారుక్ కుటుంబం ఏమిటో అమ్రిష్ పురికి తెలియదు. వాళ్లు ఎలాంటివాళ్లో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కాజోల్ ప్రేమకు నో చెబుతాడు. నో చెప్పిన వెంటనే కాజోల్ షారుక్ పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటే కథే లేదు. ‘మనకు మంచీ చెడు తెలుసు. మనకు ఏది సంతోషమో దానిని ఎంచుకోగలం. ఆ ఎంచుకున్నదానిని కుటుంబంలో భాగం చేయగలం. అంతవరకు ఓపికగా ఉండగలం’ అని రాజ్, సిమ్రన్ నమ్మడం వల్లే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ భారతీయులకు అంతగా నచ్చింది. అక్టోబర్ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత అది సృష్టించిందంతా చరిత్రే. కథ కొత్తది కాజోల్ లండన్‌లో ఉంటుంది. షారుక్ కూడా లండన్‌లోనే ఉంటాడు. కాజోల్ తండ్రి చాటు బిడ్డ. షారుక్ తండ్రిని స్నేహితుడుగా భావించే కుర్రవాడు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లిద్దరూ తమ గ్రాడ్యుయేషన్ అయిపోయాక విడివిడిగా విహారం కోసం యూరప్ యాత్రకు బయలుదేరి ట్రైన్లో పరిచయం అవుతారు. అప్పటికే కాజోల్కు పెళ్లి మాట నడిచి ఉంటుంది. పంజాబ్‌లో కుర్రాడున్నాడని తండ్రి చెప్పేసి ఉంటాడు. కాని ఆమె షారుక్‌తో ప్రేమలో పడుతుంది. షారుక్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కాని తండ్రి దీనిని అంగీకరించడు. వెంటనే కుటుంబాన్ని పంజాబ్‌కు మార్చి పెళ్లి పనులు మొదలెడతాడు. ఆమె కోసం షారుక్ పెళ్లికొడుకు స్నేహితుడిగా విడిది ఇంట్లో అడుగుపెట్టి కాజోల్ తల్లిదండ్రులను ఒప్పించి కాజోల్‌ను తనతో పాటు తీసుకువెళ్లడమే కథ. దీనికి ముందు హిందీలో వచ్చిన ‘ఏక్ దూజే కే లియే’, ‘కయామత్ సే కయామత్ తక్’ లాంటి ప్రేమ కథలు విషాదంతాలు. కాని ఇది సుఖాంతం. కుటుంబంతో పాటు సుఖాంతం. తారలు పుట్టిన వేళ బాలీవుడ్లో ఖాన్ త్రయం ఆమిర్, సల్మాన్, షారుక్ ఎస్టాబ్లిష్ అవుతున్న కాలం అది. షారుక్– కాజోల్ కలిసి అప్పటికే ‘బాజీగర్’, ‘కరణ్–అర్జున్’లలో నటించారు. కాని ఇంకా స్టార్డమ్ రాలేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పగ్గాలు యశ్ చోప్రా నుంచి అతని కుమారుడు ఆదిత్యా చోప్రా అందుకుంటూ మొదటిసారిగా ఒక కథ రాసి తండ్రికి వినిపించి డైరెక్ట్ చేయమన్నాడు. ‘కథ బాగుంది. నువ్వే చెయ్’ అని తండ్రి ప్రోత్సహించాడు. ఆ కథే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాకు హీరోగా షారుక్‌ను అడిగితే అప్పటికి ‘డిఫరెంట్ రోల్స్’ చేయాలని కోరుకుంటున్న షారుక్ కాదన్నాడు. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్ చేయాలి. ఆలోచించుకో’ అని ఆదిత్య చెప్పాక ఒప్పుకున్నాడు. సినిమా సూపర్‌హిట్ అయ్యాక షారుక్ పదే పదే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు ఈ సినిమా ఇచ్చినందుకు. కాజోల్ కథ విన్నాక వెంటనే ఒప్పుకుంది. సినిమా రిలీజయ్యాక వీరి జోడి ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జోడీగా నిలిచింది. అందరూ తలో చేయి ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ కథను ఆదిత్యా చోప్రా మూడేళ్లు రాశాడు. మొదట ఇది ఒక అమెరికన్, ఒక ఇండియన్ ప్రేమ కథ అనుకున్నాడు. కాని యశ్ చోప్రా సూచనతో హీరో హీరోయిన్లను ఎన్ఆర్ఐలుగా మార్చాడు. ఈ కథా తయారీలో ఆదిత్య దగ్గరి బంధువు, ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పాల్గొన్నాడు. సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్–లలిత్ సూపర్‌హిట్ పాటలు ఇచ్చారు. ఆనంద్ బక్షీ వాటిని రాశాడు. కెమెరా మన్మోహన్ సింగ్. కాస్ట్యూమ్స్ మనీష్ మల్హోత్రా. సినిమాకు టైటిల్‌ని కిరణ్ ఖేర్ సూచించింది. ‘చోర్ మచాయేంగే షోర్’ సినిమాలోని ‘లేజాయేంగే లేజాయేంగే’ పాటలోని లైన్ ఇది. టైటిల్ సూచించినందుకు ఆమె పేరును టైటిల్స్‌లో వేశారు కూడా. రిలీజయ్యాక.. ఈ సినిమా బడ్జెట్ ఆ రోజుల్లో 4 కోట్లు. కాని ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 250 కోట్లు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. ‘అందరూ పదే పదే చూసే సినిమాగా తీయాలి’ అనుకుని దర్శకుడు తీయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘షోలే’ ముంబైలోని మినర్వా థియేటర్లో ఐదేళ్లే ఆడింది. కాని ఈ సినిమా లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఆడుతూనే ఉంది. 25 వారాలంటే సిల్వర్ జూబ్లీ. కాని ఈ సినిమా 2014లో వేయి వారాలు దాటింది. పాటలు.. సన్నివేశాలు కాజోల్ మీద తీసిన ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’, షారుక్–కాజోల్‌ల మీద ఆవాల చేలలో తీసిన ‘తుజే దేఖాహై’, ఖవాలీ స్టైల్లో తీసిన ‘మెహందీ లాగా కే రఖ్నా’... ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్లయిమాక్స్‌లో కాజోల్ తండ్రి చేయి వదిలి షారుక్‌ను అందుకోవడానికి ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సీన్ అనేక సినిమాలలో సీరియస్‌గా, స్పూఫ్గా రిపీట్ అయ్యింది. ఈ సినిమాతోనే విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కథల్లో భాగం కావడం మొదలైంది. ఇవాళ్టికీ టీవీలో కోట్లాది మహిళా ప్రేక్షకుల, యవతీ యువకుల ప్రియమైన సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. అరుదైన గౌరవం ‘దిల్వాలే....’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూనే వస్తోంది. అయితే 25 ఏళ్ల సందర్భంగా ఓ కొత్త గౌరవం దక్కించుకుంది. లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ యానివర్సరీని పురస్కరించుకుని ప్రకటించారు. బాలీవుడ్‌కి సంబంధించి లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ఏర్పాటు చేయనున్న తొలి విగ్రహాలు ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఇది ఈ సినిమాకు దక్కిన గౌరవం’ అని చిత్రబృందం తెలిపింది. పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాల బొమ్మల చెంత మన ‘దిల్వాలే..’ చేరనుండడం భారతీయ సినిమాకు దక్కిన మంచి గౌరవం. – సాక్షి ఫ్యామిలీ -
2జీ రహిత భారత్..
న్యూఢిల్లీ: ఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రారంభించిన 2జీ టెలిఫోనీ సర్వీసులను ఇక నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసి పాతికేళ్లయిన సందర్భంగా (సిల్వర్ జూబ్లీ) నిర్వహించిన కార్యక్రమంలో అంబానీ పాల్గొన్నారు. ‘ఒకవైపు భారత్‌తో పాటు మిగతా ప్రపంచం 5జీ టెలిఫోనీ ముంగిట్లో ఉండగా, దేశీయంగా ఇంకా 30 కోట్ల మంది 2జీ శకంలోనే చిక్కుబడి ఉండిపోయారు. వారు వాడుతున్న ఫీచర్ ఫోన్ల కారణంగా ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీసులు కూడా పొందలేకపోతున్నారు. కాబట్టి 2జీని చరిత్రలో కలిపేసే దిశగా ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన విధానపరంగా తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను‘ అని ఆయన చెప్పారు. ఫిక్సిడ్ లైన్ టెలిఫోన్ సర్వీసులతో కాల్పనిక అంశం వాస్తవ రూపం దాల్చిందని, అయితే కమ్యూనికేషన్‌కు సంబంధించి పాక్షిక స్వాతంత్య్రం మాత్రమే వచ్చిందని అంబానీ పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో మొబైల్ సేవల రాకతో భారత్ ఉజ్వల భవిష్యత్ దిశగా ప్రయాణం ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం రిలయన్స్ జియో 4జీ సేవలు మాత్రమే అందిస్తుండగా భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా 2జీ టెక్నాలజీతో సర్వీసులు అందిస్తున్నాయి. ప్రస్తుతం చౌకగా మొబైల్ సేవలు.. ప్రస్తుతం మొబైల్ ఫోన్ సర్వీసులు అత్యంత చౌకగా మారాయని అంబానీ తెలిపారు. ‘1995లో సెల్‌ఫోన్ నుంచి కాల్ చేస్తే నిమిషానికి రూ. 24 చార్జీ అయ్యేది. ఇందులో కాల్ చేసిన వారికి రూ. 16, అందుకున్నవారికి రూ. 8 వర్తించేది. ఇప్పుడు ఎలాంటి పరిమితులూ లేకుండా వాయిస్ కాల్స్ పూర్తి ఉచితంగా లభిస్తున్నాయి. గతంలోలాగా మొబైల్ సేవలు కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కావు. సంపన్నులు, పేదల మధ్య తారతమ్యాలను మొబైల్ టెలిఫోనీ సేవలు చెరిపేసినంతగా బహుశా చరిత్రలో మరొక టెక్నాలజీ సాధనం లేకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ ఫోన్ల ద్వారానే వార్తలు తెలుసుకోవడంతో పాటు వీడియోలు చూడటం, వీడియోలు తయారు చేయడం తదితర పనులన్నీ చేయగలుగుతున్నారని అంబానీ వివరించారు. పాతికేళ్ల క్రితం మొబిలిటీ విషయంలో సంపన్న దేశాలను భారత్ అనుసరించాల్సి వచ్చేదని, కీలక టెక్నాలజీలో ప్ర పంచ దేశాలకన్నా భారత్‌ను ముందు నిల పాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మెరుగుపడాలి: అన్షు ప్రకాశ్ గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నందున.. కనెక్టివిటీని మెరుగుపర్చడంపై టెలికం పరిశ్రమ దృష్టి పెట్టాలని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సూచించారు. టెలికం సేవలు ప్రస్తుతం ప్రాథమిక అవసరంగా మారాయని ఆయన చెప్పారు. అయితే, భారీ పెట్టుబడులు అవసరమయ్యే రంగం అయినందున రానున్న రోజుల్లో పరిశ్రమ పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రకాష్ తెలిపారు. భారత్‌కి భారీ స్థాయిలో వైర్‌లైన్ కమ్యూనికేషన్, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ అవసరమని ఆయన చెప్పారు. 5జీ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. భారత్ .. జియోపై ఫేస్బుక్, గూగుల్ ఆశలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల ద్వారా భారత మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవాలని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్, గూగుల్ భావిస్తున్నాయి. ఇన్వెస్టర్లతో సమావేశంలో ఈ రెండు కంపెనీలు భారత మార్కెట్ ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇందుకు నిదర్శనం. ‘భారత్‌లో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. జియోతో భాగస్వామ్యంతో వేల సంఖ్యలో కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలను వాట్సాప్‌లో భాగం చేయదల్చుకున్నాం. వాట్సాప్ ద్వారా క్రయవిక్రయాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. దీన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ముందుగా చెల్లింపుల సేవలతో దీనికి శ్రీకారం చుడతాం. తద్వారా వ్యాపారం మరింతగా పుంజుకోగలదు‘ అని జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులపై స్పందిస్తూ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. రిలయన్స్‌కి చెందిన డిజిటల్ వ్యాపారాల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారత్‌లో డిజిటైజేషన్‌కు ఊతమిచ్చేలా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో దాదాపు 10 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
సిల్వర్ శంకర్
25 ఏళ్లు... 12 సినిమాలు. శంకర్ కెరీర్ గ్రాఫ్ ఇది. సినిమాల లెక్క తక్కువగా ఉన్నా బాక్సాఫీస్‌పై శంకర్ గురిపెట్టిన లెక్క తప్ప లేదు. సిల్వర్ జూబ్లి ఇయర్లోకి ఎంటరైన ‘సిల్వర్ శంకర్’ గురించి కొన్ని విశేషాలు. ‘‘రెండున్నర గంటలు కథ వినాలా? అంత టైమ్ లేదు. ఓ గంటా గంటన్నరలో చెప్పేట్లు కథని కుదించి తీసుకొస్తే వింటా’... ఈ మాట అన్నది పెద్ద హీరో. ఆ హీరో ఎదుట ఉన్నది 30 ఏళ్ల కుర్రాడు. కళ్లల్లో ఎన్నో ఆశలు, మనసులో ఎన్నో ఆలోచనలు. ‘అవకాశం ఇస్తే చాలు.. నేనేంటో నిరూపించుకుంటా’.. కుర్రాడి కళ్లల్లో ధీమా. ఆ హీరోగారిని ఒప్పించాలనే తపన. వెనుదిరిగాడు. గంటా గంటన్నరలో కథ చెప్పడానికి రెడీ చేసుకున్నాడు. హీరోగారి అపాయింట్మెంట్ దొరికింది. ‘అబ్బే.. గంటన్నర కుదరదు. అరగంట.. అంతే’ అన్నారు. మళ్లీ శంకర్ ఆ హీరో గడప తొక్కలేదు. ఇంకో స్టార్ హీరో.. ‘‘కథ బాగుంది కానీ ఆ హీరో అయితే బాగుంటుంది’’ అని ఓ ఉచిత సలహా. బాగున్నప్పుడు ఇతనే చేయొచ్చు కదా. అది వేరే విషయం. ఇంకా కొన్ని తిరస్కారాలు. కానీ ఆ కథను కుర్రాడు పక్కన పడేయలేదు. కథని నమ్మాడు. ‘‘ఇక్కడ చాన్స్ దొరుకుతుందేమో’’ అని నమ్మకం కుదిరిన ప్రతి ఆఫీసు గడప తొక్కాడు.. కుర్రాడు పట్టువదలని విక్రమార్కుడు. కాదు.. కాదు.. ‘షణ్ముగ శంకర్’. పాతికేళ్ల క్రితం ‘నేను షణ్ముగ శంకర్’ అని పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు పరిచయ వాక్యాలు అవసరం లేని ‘స్టార్ డైరెక్టర్’. ఇంతకీ ఏ సినిమా కథ తీసుకుని శంకర్ బోలెడన్ని గడపలు ఎక్కారో తెలుసా? ‘సూపర్ డూపర్ హిట్ మూవీ జెంటిల్‌మేన్’. దర్శకుడిగా శంకర్‌కి ఇది ఫస్ట్ మూవీ. మొన్న జులై 30తో ఈ సినిమా విడుదలై పాతికేళ్లు. శంకర్ ఇవాళ 55వ పడిలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగా ఆయన వయసు 25. శంకర్ ఓవర్ నైట్ పైకి ఎదగలేదు. దాని వెనకాల చాలా కష్టం ఉంది. అసలు ఆయన లక్ష్యం డైరెక్షన్ కాదు.. యాక్షన్. సినిమా నటుడవ్వాలి. స్టార్ అవ్వాలి. కానీ చీటీలో వేరే రాసి పెట్టి ఉంది. యాక్షన్ నుంచి ‘డైరెక్షన్’ మారింది. అసలు శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? అంటే... పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. చాలా చురుకైనవాడు. క్రియేటివిటీ అంటే చిన్నప్పుడే ఇష్టం. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలసి చేసిన కొన్ని నాటకాలు సినిమాల వరకూ తీసుకువచ్చేశాయి. ఇప్పుడు తమిళ ‘ఇళయ దళపతి’ విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌కి 1970లలో మంచి దర్శకుడిగా పేరుంది. శంకర్ వేసిన ఓ నాటకం చూసి, తన దగ్గర స్క్రీన్‌ప్లే రైటర్‌గా చేర్చుకున్నారాయన. ఆయన దగ్గరే శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు. ఆ తర్వాత మరో ప్రముఖ దర్శకుడు పవిత్రన్ దగ్గర సహాయ దర్శకుడిగా చేశారు. మనసు నటన మీద ఉండటంతో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. రాజేష్ ఖన్నా హీరోగా ఎస్.ఎ. చంద్రశేఖర్ తీసిన హిందీ సినిమా ‘జై శివ్ శంకర్’ శంకర్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫస్ట్ బాలీవుడ్ మూవీ. 1990లో అది విడుదలైంది. 1993లో శంకర్ ‘జెంటిల్మెన్’ ద్వారా దర్శకుడయ్యారు. ఇక నో యాక్షన్.. ఓన్లీ డైరెక్షన్ అని ఫిక్సయ్యారు. విశేషం ఏంటంటే.. ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా చిన్న బడ్జెట్ కథ రాసుకుంటారు. శంకర్ మాత్రం భారీ బడ్జెట్ స్టోరీ రాసుకున్నారు. ఆ కథను నమ్మారు ప్రముఖ మలయాళ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేటీ కుంజుమోన్. పవిత్రన్తో అంతకు ముందు ఆయన ఓ సినిమా నిర్మించారు. ‘జెంటిల్మెన్’ కథ విని శంకర్‌కి కుంజుమోన్ 5000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. హీరో అర్జున్ కూడా నమ్మారు. కొత్త దర్శకుడ్ని నమ్మి కోటి రూపాయల బడ్జెట్‌తో ‘జెంటిల్‌మేన్’ తీస్తే దాదాపు మూడు కోట్లు వసూలు చేసింది. శంకర్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్. 1993 నుంచి ఇప్పటిదాకా.. అంటే.. ఈ 25 ఏళ్లల్లో రిలీజ్‌కి రెడీ అయిన ‘2.0’తో కలిసి శంకర్ తీసినవి 12 సినిమాలు. శంకర్‌కి సామాజిక స్పృహ ఎక్కువ. ఆయన సినిమా కథలన్నీ సమాజంలో ఉన్న చెడు మీదే. పెద్దోళ్ల నుంచి దోచేసి, పేదవాళ్లకు ఇస్తాడు ‘జెంటిల్‌మేన్’. తర్వాత ‘భారతీయుడు’ లంచం తీసుకునే కొడుకుని చంపేస్తాడు. ‘జీన్స్’ అన్నారు. ఏడు వింతలను చూపించారు. కామన్ మేన్‌కి ఒకే ఒక్క రోజు సీఎం అయ్యే అవకాశం వస్తే.. సమాజ హితం కోసం ఏం చేస్తాడు? అన్నదే ‘ఒకే ఒక్కడు’. శంకర్ ప్రేమకథలు కూడా తీయగలరని రెండో సినిమా ‘ప్రేమికుడు’తోనే నిరూపించుకున్నారు. ‘బాయ్స్’ కూడా లవ్‌స్టోరీయే కదా. శంకర్ తీసిన సినిమాల్లో ‘అపరిచితుడు’ది స్పెషల్ ప్లేస్. ఆ సినిమాలో అన్యాయాన్ని సహించలేని వ్యక్తిలోంచి అపరిచితుడు బయటికొస్తాడు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలనుకుంటాడు ‘శివాజీ’. ఆ తర్వాత చిట్టి రోబోను స్క్రీన్‌పైకి తెచ్చారు. హాలీవుడ్ మూవీలా ఉందని ‘రోబో’ని చూసి మన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆ తర్వాత ముల్లుని ముల్లుతోనే తీయాలంటూ పగ తీర్చుకునే ‘ఐ’ని స్క్రీన్‌పైకి వదిలారు శంకర్. మధ్యలో శంకర్ ‘3 ఇడియట్స్’కి రీమేక్‌గా ‘నన్బన్’ తీశారు. ఇప్పుడు శంకర్ ‘2.0’ని రెడీ చేశారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తీశారు. శంకర్ అంతే.. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటారు. పెద్ద సినిమాలే తీస్తారు. వసూళ్లు కూడా భారీగానే ఉంటాయి. తీసిన డజను సినిమాలూ ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇచ్చాయి. సిల్వర్ జూబ్లి ఇయర్లోకి ఎంటరైన శంకర్ నుంచి వెండితెర పైకి ఇంకా ఎలాంటి బ్రహ్మాండాలు వస్తాయంటే.. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఆన్ సెట్స్‌కి వెళ్లనుంది. యాక్షన్ టు డైరెక్షన్.. శంకర్ కెరీర్ డైరెక్షన్ భలేగా ఉంది కదూ. -
ఒకే వేదికపై రామ్‌చరణ్, ప్రభాస్
సినిమా అభిమానులకు తీపివార్త. మరోసారి తెలుగు అగ్రతారలు ఒకే వేదికపై కలువనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు సొంత భవనం లేని తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఏకం కానున్నారు. ఇప్పటి వరకూ 'మా' కు సొంత భవనం లేదు. దీనికోసం పలు సార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. నిధుల కొరతతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే దీనికి ఎట్టకేలకు మోక్షం అభించనుంది. ఈ మేరకు స్వంత భవన నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నామని, ఇందుకోసం ముమ్మర ప్రయత్నాలు చేపట్టినట్లు మా జనరల్ సెక్రటరీ అయిన సీనియర్ నటుడు నరేష్ ప్రకటించారు. సొంత కార్యాలయం నిర్మాణానికి నిధులు కావాలని, వాటికోసం భారీ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి ఈ నెల 10వ తేదీన కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగబోతోంది. పలువురితో ప్రత్యేక ప్రదర్శనలు.. సీనియర్ నటులకు సన్మానాలతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈకార్యక్రమానికి పలువురు అలనాటి స్టార్స్ కృష్ణ, కృష్ణంరాజులు మద్దతు పలుకుతున్నారు. సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు సైతం వంతు సహాయం అందిస్తామన్నట్లు నరేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా తమ వంతు సపోర్ట్ ఇస్తామని చెప్పారట. రామ్ చరణ్, ప్రభాస్ ఈ కార్యక్రమంలో భాగం అవుతారని నరేష్ తెలిపారు. ఏదేమైనా 'మా' సొంత భవనం నిర్మాణానికి తెలుగు సినీ రంగం అంతా మళ్లీ ఒకే వేదికపైకి రానుండటంతో సినీ అభిమానులకు పండుగనే చెప్పాలి. -
జులై 17న దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
కల్లూరు (రూరల్): సిల్వర్ జూబ్లీ కళాశాలలోని అంబేడ్కర్ రీజనల్ సెంటర్లో దూర విద్య సప్లిమెంటరీ పరీక్షలు జులై 17నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఏపీ ఆన్లైన్లో చెల్లించడానికి ఈ నెల 28న ఆఖరని, ప్రతి పరీక్షకు రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పీజీ మొదటి సంవత్సరం జులై 17 నుంచి 22వరకు, ద్వితీయ సంవత్సరం 24 నుంచి 29 వరకు, ఎంబీఏ మూడవ సంవత్సరం 31 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరవ్వాలని, ఇతర వివరాలకు అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. -
సమాజ్‌వాదీలో మళ్లీ రగడ
-
సమాజ్‌వాదీలో మళ్లీ రగడ
రజతోత్సవ వేడుకల్లో అఖిలేశ్-శివ్‌పాల్ మాటల యుద్ధం లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. బాబాయ్... అబ్బాయ్ వర్గాలుగా విడిపోయిన పార్టీ... కుటుంబ కలహాలతో జనం సాక్షిగా మళ్లీ రచ్చకెక్కింది. శనివారమిక్కడ జరిగిన ఎస్పీ రజతోత్సవ వేడుకల్లో సీఎం అఖిలేశ్ యాదవ్... పార్టీ చీఫ్ ములాయంసింగ్‌యాదవ్ సోదరుడు, రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్‌యాదవ్ మరోసారి కత్తులు దూసుకున్నారు.ములాయం కుమారుడు కనుకనే అఖిలేశ్ సీఎం కాగలిగారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించి శనివారం సభలో శివ్‌పాల్ మాటల యుద్ధానికి తెర లేపారు. ‘కొంతమందికి అదృష్టంతో కొన్ని దక్కుతాయి. కొంతమందికి కష్టంతో, మరికొంత మందికి వారసత్వంతో లభిస్తాయి. కానీ, జీవితాంతం కష్టపడి పనిచేసినా కొందరికి ఏమీ దక్కవు’ అంటూ అఖిలేశ్‌ను ఉద్దేశించి అన్నారు. . అహర్నిశలూ పార్టీ కోసం శ్రమిస్తూ, నాలుగేళ్లుగా అఖిలేశ్‌కు ఎంతో సహకరిస్తున్నానన్న శివ్‌పాల్... ‘ఇంకా ఏమేం త్యాగాలు చేయమంటావో చెప్పు అఖిలేశ్... అందుకు సిద్ధంగా ఉన్నా. నేనెప్పుడూ సీఎం కావాలనుకోలేదు’ అని అన్నారు. మంత్రిగా తనను తొలగించినా, అవమానపరిచినా పార్టీ కోసం రక్తం చిందించడానికి ఎప్పుడూ వెనుకాడనన్నారు. వెంటనే మైకందుకున్న అఖిలేశ్... ‘ప్రజాపతి (శివ్‌పాల్ వర్గం) నాకు కత్తి బహూకరించారు. మీరు కత్తి ఇచ్చి... దాన్ని ఉపయోగించకూడదంటారు’ అని చురకలంటించారు. ‘అవసరమైతే పరీక్ష పెట్టుకో. నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు. ములాయం, ఆర్జేడీ చీఫ్ లాలూ, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు సభలో పాల్గొన్నారు. ఇలాంటి కీలక సమయంలో గొడవలు తగవని శివ్‌పాల్, అఖిలేశ్‌కు సర్ది చెప్పారు. లాలూ జోక్యంతో శివ్‌పాల్... అఖిలేశ్ పనితీరు భేషంటూ కితాబిచ్చారు. సీఎం... శివ్‌పాల్‌కు పాదాభివందనం చేశారు. ఇరువురూ చేతులు కలిపారు. -
వేదిక మీద హైడ్రామా.. తోసిపారేసిన బాబాయ్!
-
వేదిక మీద హైడ్రామా.. తోసిపారేసిన బాబాయ్!
సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవ వేడుకలు సాక్షిగా ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో లక్నోలో జరిగిన ఈ వేడుక సీనియర్ నేత, బాబాయ్ శివ్‌పాల్ యాదవ్, సీఎం అఖిలేశ్ యాదవ్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి వేదికగా మారింది. పార్టీ శ్రేణులు, ప్రజల ముందే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పరోక్ష వాగ్బాణాలు సంధించుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే రజతోత్సవ సభ వేదికపై హైడ్రామా చోటుచేసుకుంది. సభలో ఎస్పీ నేత జావేద్ అబిదీ అఖిలేశ్‌కు మద్దతుగా చాలా ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఎన్నికలకు ముందే అఖిలేశ్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. అఖిలేశ్ మద్దతుదారుడైన ఆయన ఇలా మాట్లాడుతుండగానే బాబాయ్ శివ్‌పాల్ దూసుకొచ్చి.. అబిదీని మధ్యలోనే అడ్డుకున్నారు. బలవంతంగా మైక్ ముందునుంచి అవతలకు గెంటేశారు. దీంతో సభ వేదికపై ఒకింత గందరగోళం నెలకొంది. పార్టీ యూపీ అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్ కనుసన్నల్లో ఎస్పీ రజతోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేశ్ మద్దతుదారుడికి ఈవిధంగా చేదు అనుభవం ఎదురవ్వడం గమనార్హం. అంతకుముందు కూడా పార్టీ రజతోత్సవాల వేదిక సాక్షిగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాటల యుద్ధానికి దిగారు. తొలుత శివపాల్ యాదవ్ ప్రసంగించగా.. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడారు. తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తానని శివపాల్ అన్నారు. అయితే, కొంతమంది మాట వింటారు గానీ పార్టీ మొత్తం సర్వనాశనం అయిన తర్వాతే వింటారని అఖిలేష్ యాదవ్ దెప్పిపొడిచారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే మాత్రం.. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''మీరు నాకు కత్తిని బహుమతిగా ఇచ్చారు. కత్తి అంటూ ఇస్తే దాన్ని తిప్పి తీరుతా'' అని వ్యాఖ్యానించారు. -
కత్తులు నూరుకున్న బాబాయ్ అబ్బాయ్
ఉత్తర ప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్ అబ్బాయ్‌ల మధ్య ఉన్న లుకలుకలు మరోసారి బహిరంగ వేదికపై బయటపడ్డాయి. పార్టీ రజతోత్సవాల వేదిక సాక్షిగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాటల యుద్ధానికి దిగారు. తొలుత శివపాల్ యాదవ్ ప్రసంగించగా.. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడారు. తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తానని శివపాల్ అన్నారు. అయితే, కొంతమంది మాట వింటారు గానీ పార్టీ మొత్తం సర్వనాశనం అయిన తర్వాతే వింటారని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే మాత్రం.. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''మీరు నాకు కత్తిని బహుమతిగా ఇచ్చారు. కత్తి అంటూ ఇస్తే దాన్ని తిప్పి తీరుతా'' అని వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అంతకుముందు చెప్పారు. మతవాద శక్తులు విజయం సాధించకుండా.. మనం మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతామని కార్యకర్తలతో అన్నారు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) రక్తమాంసాలు ధారపోసి ఈ పార్టీ పెట్టారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఇప్పటికి చాలాదూరం వచ్చామని, ఇక పార్టీని మరో మెట్టు పైకి ఎక్కించాలని, మనమంతా కలిసి ఈ పని చేయాలని చెప్పారు. గత కొన్నేళ్లుగా రోడ్లనిర్మాణం, ఇతర అంశాల్లో చాలా రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. -
కత్తులు నూరుకున్న బాబాయ్ అబ్బాయ్
-
సైయంట్ ప్రత్యేక డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ .. సిల్వర్ జూబిలీ వేడుకల సందర్భంగా ప్రత్యేక డివిడెండు ప్రకటించింది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 2.50 (50 శాతం) అందించనున్నట్లు వివరించింది. ప్రత్యేక డివిడెండు రూపంలో మొత్తం రూ. 34 కోట్లు చెల్లించనున్నట్లు సైయంట్ పేర్కొంది. ప్రత్యేక డివిడెండుకు రికార్డు తేది సెప్టెంబర్ 9 కాగా, చెల్లింపు తేది సెప్టెంబర్ 16. మరోవైపు, ఉద్యోగులకు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (ఆర్ఎస్యూ) పథకం కింద షేర్లను కేటాయించనున్నట్లు, ఆర్థికంగా దీని ప్రభావం రూ. 34 కోట్ల మేర ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. -
టీవీ మా పొయ్యి వెలిగించింది!
చెన్నై మహాలింగ పురంలోని ప్రశాంత ఆలయ వాతా వరణానికి దగ్గరగా, అక్షరాలా అందుకు తగ్గట్లుగానే ఉంది నటుడు ‘శుభలేఖ’ సుధాకర్, గాయని శైలజల నివాసం. గేటు తీసుకొని వసారా దాటి లోపలకు అడుగుపెడితే, ఇంట్లోనూ అదే ప్రశాంతత. మధ్యతరగతి కుటుంబ జీవితానికి దగ్గరగా దేవుడి విగ్రహాలు, పటాలు, వెలిగించిన అగరొత్తుల పరిమళం... హంగామా లేని హుందాతనం, తెలియని సంతృప్తి ఏదో నట్టింట్లో నడయాడు తున్నట్లని పిస్తుంది. సుధాకర్‌ను పలకరిస్తే... ఆ మాటల్లోనూ అంతే స్వచ్ఛత... నిజాయతీ! వెండితెరపై వినోదం పండించడంతో మొదలుపెట్టి, బుల్లితెరపై విలనిజాన్ని పండిస్తూ ఇన్నేళ్ళుగా అలరిస్తున్న నటుడాయన. మూడుదశాబ్దాల పైగా చిరపరిచితుడైన ఆయన, ఎస్పీ శైలజల వివాహ బంధానికి ఇటీవలే సిల్వర్ జూబ్లీ అయింది. సూరావఝల బదులు ‘శుభలేఖ’ సినిమాయే ఇంటిపేరైపోయిన సుధాకర్‌తో భేటీ... ...::: రెంటాల జయదేవ ఈ మధ్య సీరియల్స్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు. అటు దృష్టి పెట్టారా? చెబితే ఇది చిత్రంగా ఉంటుంది కానీ, నిజం ఏమిటంటే సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉండడం వల్లే, టీవీలో కనిపిస్తున్నాను. 1989 డిసెంబర్ 21న నాకూ, ఎస్.పి. శైలజకూ పెళ్ళయింది. నిజానికి, మా పెళ్ళి వరకు మేమిద్దరం ఎవరి కెరీర్లలో వాళ్ళం చాలా బిజీగా ఉన్నాం. అలాంటిది, పెళ్లయిన తరువాత నుంచి చిత్రంగా ఇద్దరికీ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇంతలో సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళాలా, వద్దా అని సందిగ్ధావస్థ వచ్చింది. అలా మద్రాసులోనే ఉండిపోయాను. మరి మీరు టీవీ రంగంలోకి ఎలా వచ్చారు? అప్పట్లో ‘ఈ’ టి.వి. వారు ఒక సినిమా క్విజ్ పెట్టి, ఆ కార్యక్రమం నాతో చేయించారు. అలా నెలకు 5 రోజులు పని దొరికింది. ఆ తరువాత తమిళ ‘సన్’ టి.వి. వచ్చింది. సీరియల్స్‌లో నాకు అవకాశాలు వచ్చాయి. మద్రాసులో తమిళ, తెలుగు భాషల్లో తయారవుతున్న ధారావాహికల్లో నటిస్తున్నా. అయితే, టీవీతో ఫుల్ బిజీ అన్న మాట! (నవ్వేస్తూ...) ఇక్కడ వచ్చిన సమస్య అదే! టీవీలో డైలీ సీరియల్లో కనబడేసరికి, ఫుల్ బిజీ అనుకుంటారు. నెలలో 30 రోజులూ పని ఉండదు. కేవలం కొద్ది రోజులు పని ఉంటుంది. ఆ కొద్ది రోజుల్లో బాగా ప్లాన్ చేసి, సన్నివేశాలు తీస్తారు. ఆ కొద్ది దృశ్యాలే అక్కడొకటి ఇక్కడొకటి చొప్పున నెలంతా బుల్లితెరపై కనిపించేసరికి, ఆర్టిస్టుతో ‘మీరు చాలా బిజీగా ఉన్నారండీ’ అనేస్తారు. అయితే ఆదాయం మాటెలా ఉన్నా, నేను టీవీలో వేసిన పాత్రలు తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. సినిమాల్లో ఇంత వెరైటీ పాత్రలు నాకు వచ్చేవో, కాదో తెలియదు. మీకు పేరు తెచ్చిన సీరియల్స్? దర్శకుడు కె. బాలచందర్ గారు నిర్మాతగా, సముద్రఖని దర్శకత్వంలో తమిళం చేసిన ‘అన్ని’ సీరియల్ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ (‘వదిన’) మంచి పేరు తెచ్చింది. ఆ మధ్య ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ’ల్లో పేరొచ్చినా... (మధ్యలోనే అందుకుంటూ...) చాన్సలు రాలేదు. అదే విచిత్రం. ‘రక్తచరిత్ర-2’ కానీ, ‘బెజవాడ’ కానీ బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆడకపోవడం దెబ్బ అయింది. ‘ముత్యాల ముగ్గు’లో నటుడు మాడా ‘చేతికెంత? కాలికెంత?... హోల్ మొత్తం మీద కన్సెషన్ ఏమైనా ఉందా?’ అంటూ ఒక్క సీన్లో కనిపిస్తారు. అది ఆయనను మరో పదేళ్ళు నటుడిగా బతికించింది. కానీ, ఇవాళ సినిమా సక్సెస్‌ను బట్టే చూస్తున్నారు తప్ప, ఆర్టిస్ట్ సక్సెస్‌ను బట్టి లెక్కలోకి తీసుకోవడం లేదు. అసలు మీరు నటన వైపు ఎలా వచ్చారు? ప్రతి ఆర్టిస్టుకూ ఎవరో ఒక ఆర్టిస్ట్ ప్రేరణ ఉంటుంది. నేను అమితాబ్ సినిమాలు చూసి, నటుడిగా ఆయనను ఆరాధించి, సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పుడు వైజాగ్‌లో చదువుకొనే రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్ల సినిమాలు ఆరాధనగా చూసేవాణ్ణి. సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక పుట్టింది. అనేక పరిణామాల మధ్య మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. నటులు శ్యామలగౌరి, రాంకీ, అరుణ్ పాండ్యన్లు నా బ్యాచ్మేట్లు. అసలు ఇన్స్టిట్యూట్లో నేర్పితే.... నటన వస్తుందంటారా? (నవ్వేస్తూ...) నటన ఇలా చేయాలంటూ ఇన్స్టిట్యూట్లో చెప్పరు. నటించాల్సిన సన్నివేశాన్ని నిజజీవితంలోని సంఘటనతో సమన్వయం చేసుకుంటూ, దానికి ఎలా స్పందిస్తారో ఆలోచించి, అలా స్పందించమంటారు. ఆ ఆలోచనా ప్రక్రియను నేర్పుతారు. అప్పట్లో లక్ష్మీ కనకాల మా టీచర్. దేవదాస్ కనకాల కూడా మాకు నేర్పేవారు. విశ్వనాథ్, బాపు, రాఘవేంద్రరావు, జంధ్యాల లాంటి దిగ్దంతుల దగ్గర పనిచేశారు. వాళ్ళ పని తీరెలా ఉండేది? జంధ్యాల గారిది ఎక్కువగా డైలాగ్ మీద ఆధారపడి నడిచే పద్ధతి. యాక్టింగ్ కన్నా, డైలాగ్‌ను ఎక్కడ, ఎలా విరవాలి, ఎలా పలకాలన్నదానికి ప్రాధాన్యమిచ్చేవారు. కె. విశ్వనాథ్ గారేమో సహజమైన నటనకు ప్రాధాన్యమిస్తూ, ఫలానా డైలాగ్‌కు ఫలానా పని చేస్తూ, నటుడు అభినయించాలని చెబుతారు. బాపు గారి చిత్రీకరణలో ఫ్రేమింగ్‌కు ప్రాధాన్యం. ప్రతి దృశ్యం చక్కగా గీసిన బొమ్మలా ఉంటుంది. ఇలాంటి పెద్దలందరి దగ్గర నేర్చుకున్నదంతా తరగని గని అయింది. టీవీకొచ్చాక, రకరకాల పాత్రలు చులాగ్గా పోషించగలిగా. కానీ, టీవీలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయా? (విరక్తిగా...) పరిశ్రమకు కొత్తగా వచ్చి, కంటిన్యుటీ రాసుకొనే అసిస్టెంట్ దర్శకుడు సైతం టీవీలో ఆపద్ధర్మానికి రెండో రోజుకే దర్శకుడైపోతున్నాడు. ఎవరైనా యాక్టర్ కావచ్చు కానీ, దర్శకుడవడం సులభం కాదు. డెరైక్షనంటే యాక్షన్, కట్ చెప్పడం కాదు. కానీ, సీరియల్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు. మీ దృష్టిలో సినిమాకూ, టీవీకీ తేడా? టీవీలోలా సినిమాల్లో నటుడి మీద రకరకాల ప్రయోగాలు చేయరు. ఒక రకం పాత్రతో గుర్తింపొస్తే, ఆ తరహా పాత్రల్నే ఇస్తారు. కానీ టీవీ వార్తాపత్రికైతే, సినిమా మంచి పుస్తకం లాంటిది. పదేపదే చదువుకోవచ్చు. చెన్నైలో ఉండడంతో హైదరాబాద్ పిలవడం లేదేమో! 1982 నుంచి ఇప్పటి దాకా గడచిన 32 ఏళ్ళలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, సినిమా వాళ్ళకు అవసరం అనుకుంటే, మీరు అంటార్కిటికాలో ఉన్నా పిలుస్తారు. అవసరం లేదనుకుంటే, పక్కనే, కళ్ళ ముందే ఉన్నా పిలవరు, పట్టించుకోరు. ఉన్నమాట చెప్పాలంటే, మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నా, ఎక్కువ మందికి పని లేదు. (కాస్త ఆవేశంగా...) ఏం మనకు రంగనాథ్ గారు, గిరిబాబు గారు - ఇలా ఎంత మంది లేరు. ఇవాళ నటించడం, డైలాగ్ చెప్పడం చేతగాని చాలామంది పరభాషా నటులతో పోలిస్తే, తండ్రి పాత్రలకో, మరో దానికో వాళ్ళు సరిపోరా? కనీసం చిన్న సినిమాలకు కూడా వాళ్ళు పనికిరారా? ఏమైనా ఆ దేవుడు నాకు ఒక తలుపు మూసినా, టీవీ అనే మరో తలుపు తెరిచాడు. అందుకే, జీవితంలో దేన్నీ నెగటివ్‌గా తీసుకోను. మరి, పెళ్ళయ్యాక చాన్సుల్లేనప్పుడు మీ మానసిక పరిస్థితి? అది చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఫోన్ మోగినా ఎవరి నుంచైనా వేషానికి పిలుపొచ్చిందేమో? నాకు కాకపోయినా కనీసం శైలజకైనా పాట ఛాన్స్ అయితే బాగుండు అనుకున్న రోజులు ఎన్నో! (గొంతు జీరపోతుండగా...) చివరకు బ్యాంకులో వంద రూపాయలే ఉన్న రోజులూ ఉన్నాయి. కనీసం నేను రెండు పూటలా ఆమెకు అన్నమైనా పెట్టగలనా అని భయపడ్డాను. ఇంతలో మాకో అబ్బాయి. మూడో ఏట మా అబ్బాయికి బాగా మాటలు వచ్చాయి. ‘నాన్న ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని ఉన్నాడేమిట’ని అంటాడేమో అని నాకు భయం వేసేది. మాటల్లో చెప్పలేని విషయం. పగవాడికి కూడా ఆ పరిస్థితి రాకూడదు. దేవుడి దయ వల్ల మా ఇంట్లో మళ్ళీ దీపం పెట్టింది, పొయ్యి వెలిగించింది టీవీనే! అంత క్లిష్ట స్థితిలో మీరిద్దరికీ గొడవ... (మధ్యలోనే అందుకొని...) అవకాశాలు లేకపోవడం ఒక రకంగా నెగటివ్ అయినా, మాకు పాజిటివ్ కూడా అయింది. చాలా పాఠాలు నేర్చుకున్నా. మాకు చేతిలో పని లేని కాలం మా ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసింది. ఎవరి దగ్గరా చేతులు చాచి అడగడం, అప్పు చేయడం లాంటివి మా ఇద్దరికీ నచ్చదు. అందుకే, ఉన్నదాంట్లోనే గుట్టుగా సంసారం నడిపాం. ఒక రూపాయి వస్తే, దానిలో అరవై పైసలే ఖర్చు చేసి, నలభై పైసలు రేపటి కోసం జాగ్రత్త చేస్తూ, ఇంటిని నడిపిన బెస్ట్ హౌస్‌వైఫ్ శైలజ. కానీ, మీ బంధం సరిగ్గా లేదంటూ ఏవేవో వార్తలు.... (మధ్యలోనే...) ఉయ్ నెవర్ గేవ్ ఎ కేర్ ఫర్ ఇట్. మేము విడాకులు తీసుకున్నామని కూడా పత్రికల్లో వచ్చింది. ఇప్పటికీ ఆ మాట అడిగేవాళ్ళున్నారు. అప్పట్లో ఒక సినిమా పత్రిక ఎడిటర్ తమాషాగా రాసిన వార్తతో జరిగిన గొడవ ఇది. సారథీ స్టూడియోలో ‘ఈశ్వర్ అల్లా’ షూటింగ్లో ఉండగా ‘శివరంజని’ ఎడిటర్ బాలరెడ్డి గారు కలిశారు. ఆయన సెన్సేషన్ చేస్తూ ‘శుభలేఖ సుధాకర్, శైలజ విడిపోయారా?’ అని ఏదో సరదాగా రాశారు. అది గొడవ అయింది. ఆ వార్త చదివి పి.జె. శర్మ గారి లాంటి శ్రేయోభిలాషులు ఆవేశపడ్డారు. కానీ, పోనీలెమ్మని వదిలేశా. నాకెవరి మీదా కోపం లేదు. దాని వల్ల ఆరోగ్యం, ప్రశాంతత కోల్పోవడం తప్ప ఉపయోగం లేదు. చెప్పింది చెప్పినట్లు కాక, మరొకలా రాయడంతో వచ్చే తంటా ఇది. అప్పటికీ ఇప్పటికీ మా వివాహబంధం పటిష్ఠంగా ఉంది. మీ కెరీర్లలో మీ బావ గారైన ఎస్పీబీ అండదండలు లేవా? ఊహల మాటెలా ఉన్నా, ఉన్న నిజం ఏమిటంటే, ఆయనెప్పుడూ మా కెరీర్లో జోక్యం చేసుకోలేదు, చేసుకోరు. జోక్యం చేసుకోవాలని మేము ఆశించనూ లేదు! ‘ఆయన కలిగించుకొని మీకు సిఫార్సు చేయవచ్చు కదా’ అన్నవాళ్ళూ ఉన్నారు. అది తప్పు. ప్రతిభను బట్టి వాళ్ళు స్వశక్తితో పైకి రావాలే తప్ప, ఆయనెలా సిఫార్సు చేస్తారు! కానీ, ఓదార్పుకు ఎవరిని ఆశ్రయించేవారు? జీవితం చాలా గొప్ప టీచర్. అది మనకెంతో నేర్పుతుంది. మా తాత గారికి12వ సంతానం మా నాన్న గారు. ఆ రోజుల్లో ఆయనకు ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్‌లో సీటొచ్చినా, స్థోమత లేక చేర్చలేకపోయారు. అందుకే, మేము ఒక్క పిల్లాడు చాలని ఫుల్స్టాప్ పెట్టేశాం. అయిదో ఏట నుంచే మా అబ్బాయి శ్రీకర్‌కి కూడా అన్నీ చెబుతూ వచ్చాం. ఇవాళ వాడు ఢిల్లీ మీడియా మేనేజ్మెంట్లో ఎం.బి.ఏ. చదువు స్థాయికి చేరాడు. ఇన్నేళ్ళ జీవితం మీకు నేర్పిన పాఠం? జీవితం పేకముక్కల సెట్టు లాంటిది. ఏ కార్డు ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. అన్నిటికీ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అమితాబ్‌తో వాళ్ళ నాన్నగారు హరివంశ్ రాయ్ బచ్చన్ ‘మన్ జో సోచా - హువా తో అచ్ఛా! నహీ హువా తో బహుత్ అచ్ఛా!!’ అని చెప్పారట. ఏది జరిగినా, అంతా మన మంచికే అనుకోవడమంటే అదే. ఫొటోలు: వన్నె శ్రీనివాసులు, చెన్నై నేను పెద్దగా పుస్తకాలు చదవను. కానీ, మా ఆవిడ శైలజకు పుస్తకాలే ఆప్తమిత్రులు. చదివిన విషయాలు ఆమె ప్రస్తావిస్తుంటే, ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకుంటుంటా. బి.కావ్‌ు చదివినా, ఆర్థిక నిర్వహణ నాకు తెలియదు. ఒడుదొడుకులనెదుర్కొన్నా, ఇవాళ మేము ఈ మాత్రం ఆర్థికంగా స్థిరంగా ఉన్నామంటే అది శైలజ సమర్థతే. సంపాదించే ప్రతి రూపాయిలో కొంత పిల్లాడి చదువుకూ, కొంత భవిష్యత్ అవసరాలకూ ఆదా చేశాకే, మిగిలినది ఖర్చు చేస్తాం. నేను, మా ఆవిడ, మా అబ్బాయి - ముగ్గురం కలసి, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. నిర్ణయాలు తీసుకుంటుంటాం. మా అబ్బాయి శ్రీకర్ కూడా పుస్తకాలు తెగ చదువుతాడు. మొదటి రోజు, మొదటి ఆటే సినిమాలు చూస్తాడు. వాటి గురించి అద్భుతంగా విశ్లేషిస్తాడు. వాడిప్పుడు ఢిల్లీలో మీడియా మేనేజ్మెంట్లో ఎం.బి.ఎ. చేస్తున్నాడు. -
పశ్చాత్తాపంలో ‘రామన్న’
ప్రతి ఎన్నికల్లోనూ కూటములు మార్చడంలో స్వయం కృతాపరాధంపై పీఎంకే అధినేత రాందాసు తీవ్ర పశ్చాత్తాపం చెందుతున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీకి సమయం దగ్గర పడుతుండడంతో తన మదిలోని వేదనను కార్యకర్తల ముందు వెళ్లగక్కారు. చేసిన తప్పులు పునరావృతం కానివ్వనని హామీ ఇస్తూ, సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సాక్షి, చెన్నై : వన్నియర్ సామాజిక వర్గం సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ పీఎంకే. తొలుత వన్నియర్ సంఘం గా ఉన్నా, 1989 జూలై 16న పాటాలి మక్కల్ కట్చిగా ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను పీఎంకే ఎదుర్కొంది. కేంద్రంలోనూ తన సత్తా చాటుకుని మంత్రి పదవులను సైతం గతంలో దక్కించుకుంది. ఇక రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంగా అలుపెరగని ఉద్యమాన్ని సాగిస్తున్న పార్టీ పిఎంకే. అయితే, ప్రతి ఎన్నికల్లోనూ కూటములను మారుస్తూ వచ్చిన పీఎంకేకు ప్రస్తుతం గడ్డు కాలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇతర పార్టీల తీర్థాన్ని పుచ్చుకోగా, వేల్ మురుగన్ వంటి నేతలు కొత్త పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో నమోదైన హత్యాయత్నం కేసు, ధర్మపురి ప్రేమ కుల చిచ్చు, మరక్కానం అల్లర్లు ఆ పార్టీని వెంటాడుతూ వస్తున్నాయి. ఆ పార్టీ జిల్లా స్థాయి శ్రేణులు గూం డా చట్టం కింద కటకటాల్లో కాలం గడపాల్సిన పరిస్థితి. ఇక సీనియర్ నేత కాడు వెట్టి గురు జాతీయ భద్రతా చట్టం కింద నెలల తరబడి కటకటాలకే పరిమితమై, ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఇలా అనేక అవాంతరాల్ని ఎదుర్కొంటున్న పీఎంకే అసెంబ్లీలో రెండంకెల సభ్యుల నుంచి సింగిల్ డిజిట్‌కు దిగజారింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి అడుగులు వేసినా, ఎన్నికల అనంతరం ఒప్పందాలు బెడిసి కొట్టడంతో డీలా పడాల్సిన పరిస్థితి. ధర్మపురిలో తనయుడు అన్భుమణి మాత్రం నెగ్గినా, ఇత ర నియోజకవర్గాల్లో ఎక్కడ కేడర్ దూరమవుతుందోనన్న బెంగ రాందాసును వెంటాడుతోంది. పార్టీ గత ఏడాది సిల్వర్ జూబ్లీలో అడుగు పెట్టినా, చడీ చప్పుడు చేయకుండా ఉన్న రామన్న ముగింపు వేడుకలను అయినా, జరుపుకుందామంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పశ్చాత్తాపం మంగళవారం పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఉద్దేశించి, సిల్వర్ జూబ్లీ వేడుకలకు పిలుపు నిస్తూ ప్రకటనను రాందాసు విడుదల చేశారు. అందులో పార్టీ ప్రస్తానం గురించి వివరించారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను గుర్తు చేస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేశా రు. పీఎంకే ప్రస్తుతం ఇబ్బంది పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటములను మార్చి చేసిన తప్పుకుగాను, ప్రస్తుతం ఈ పరిస్థితి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, పార్టీ శ్రేణుల్ని ఆకర్షించే యత్నం చేశారు. ఇక మీదట ఇలాంటివి పునరావృతం కావని పార్టీ కేడర్‌కు హామీ ఇచ్చారు. 2016లో పీఎంకే రాజ్యం తప్పనిసరి అని, ఆ విజయోత్సవ వేడుకల్ని ముందుగానే పార్టీ సిల్వర్ జూబ్లీలో జరుపుకుందామని పిలుపునిచ్చారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధం కావాలని పేర్కొన్నారు.