
డైరెక్టర్ శంకర్
25 ఏళ్లు... 12 సినిమాలు. శంకర్ కెరీర్ గ్రాఫ్ ఇది. సినిమాల లెక్క తక్కువగా ఉన్నా బాక్సాఫీస్‌పై శంకర్ గురిపెట్టిన లెక్క తప్ప లేదు. సిల్వర్ జూబ్లి ఇయర్‌లోకి ఎంటరైన ‘సిల్వర్ శంకర్’ గురించి కొన్ని విశేషాలు.
‘‘రెండున్నర గంటలు కథ వినాలా? అంత టైమ్ లేదు. ఓ గంటా గంటన్నరలో చెప్పేట్లు కథని కుదించి తీసుకొస్తే వింటా’... ఈ మాట అన్నది పెద్ద హీరో. ఆ హీరో ఎదుట ఉన్నది 30 ఏళ్ల కుర్రాడు. కళ్లల్లో ఎన్నో ఆశలు, మనసులో ఎన్నో ఆలోచనలు. ‘అవకాశం ఇస్తే చాలు.. నేనేంటో నిరూపించుకుంటా’.. కుర్రాడి కళ్లల్లో ధీమా. ఆ హీరోగారిని ఒప్పించాలనే తపన. వెనుదిరిగాడు. గంటా గంటన్నరలో కథ చెప్పడానికి రెడీ చేసుకున్నాడు. హీరోగారి అపాయింట్‌మెంట్ దొరికింది. ‘అబ్బే.. గంటన్నర కుదరదు. అరగంట.. అంతే’ అన్నారు. మళ్లీ శంకర్ ఆ హీరో గడప తొక్కలేదు.
ఇంకో స్టార్ హీరో.. ‘‘కథ బాగుంది కానీ ఆ హీరో అయితే బాగుంటుంది’’ అని ఓ ఉచిత సలహా. బాగున్నప్పుడు ఇతనే చేయొచ్చు కదా. అది వేరే విషయం. ఇంకా కొన్ని తిరస్కారాలు. కానీ ఆ కథను కుర్రాడు పక్కన పడేయలేదు. కథని నమ్మాడు. ‘‘ఇక్కడ చాన్స్ దొరుకుతుందేమో’’ అని నమ్మకం కుదిరిన ప్రతి ఆఫీసు గడప తొక్కాడు.. కుర్రాడు పట్టువదలని విక్రమార్కుడు. కాదు.. కాదు.. ‘షణ్ముగ శంకర్’. పాతికేళ్ల క్రితం ‘నేను షణ్ముగ శంకర్’ అని పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి.
ఇప్పుడు పరిచయ వాక్యాలు అవసరం లేని ‘స్టార్ డైరెక్టర్’. ఇంతకీ ఏ సినిమా కథ తీసుకుని శంకర్ బోలెడన్ని గడపలు ఎక్కారో తెలుసా? ‘సూపర్ డూపర్ హిట్ మూవీ జెంటిల్‌మేన్’. దర్శకుడిగా శంకర్‌కి ఇది ఫస్ట్ మూవీ. మొన్న జులై 30తో ఈ సినిమా విడుదలై పాతికేళ్లు. శంకర్ ఇవాళ 55వ పడిలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగా ఆయన వయసు 25. శంకర్ ఓవర్ నైట్ పైకి ఎదగలేదు. దాని వెనకాల చాలా కష్టం ఉంది. అసలు ఆయన లక్ష్యం డైరెక్షన్ కాదు.. యాక్షన్. సినిమా నటుడవ్వాలి. స్టార్ అవ్వాలి. కానీ చీటీలో వేరే రాసి పెట్టి ఉంది. యాక్షన్ నుంచి ‘డైరెక్షన్’ మారింది. అసలు శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? అంటే...
పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. చాలా చురుకైనవాడు. క్రియేటివిటీ అంటే చిన్నప్పుడే ఇష్టం. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలసి చేసిన కొన్ని నాటకాలు సినిమాల వరకూ తీసుకువచ్చేశాయి. ఇప్పుడు తమిళ ‘ఇళయ దళపతి’ విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌కి 1970లలో మంచి దర్శకుడిగా పేరుంది. శంకర్ వేసిన ఓ నాటకం చూసి, తన దగ్గర స్క్రీన్‌ప్లే రైటర్‌గా చేర్చుకున్నారాయన. ఆయన దగ్గరే శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు. ఆ తర్వాత మరో ప్రముఖ దర్శకుడు పవిత్రన్ దగ్గర సహాయ దర్శకుడిగా చేశారు.
మనసు నటన మీద ఉండటంతో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. రాజేష్ ఖన్నా హీరోగా ఎస్.ఎ. చంద్రశేఖర్ తీసిన హిందీ సినిమా ‘జై శివ్ శంకర్’ శంకర్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫస్ట్ బాలీవుడ్ మూవీ. 1990లో అది విడుదలైంది. 1993లో శంకర్ ‘జెంటిల్‌మెన్’ ద్వారా దర్శకుడయ్యారు. ఇక నో యాక్షన్.. ఓన్లీ డైరెక్షన్ అని ఫిక్సయ్యారు. విశేషం ఏంటంటే.. ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా చిన్న బడ్జెట్ కథ రాసుకుంటారు. శంకర్ మాత్రం భారీ బడ్జెట్ స్టోరీ రాసుకున్నారు.
ఆ కథను నమ్మారు ప్రముఖ మలయాళ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేటీ కుంజుమోన్. పవిత్రన్‌తో అంతకు ముందు ఆయన ఓ సినిమా నిర్మించారు. ‘జెంటిల్‌మెన్’ కథ విని శంకర్‌కి కుంజుమోన్ 5000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. హీరో అర్జున్ కూడా నమ్మారు. కొత్త దర్శకుడ్ని నమ్మి కోటి రూపాయల బడ్జెట్‌తో ‘జెంటిల్‌మేన్’ తీస్తే దాదాపు మూడు కోట్లు వసూలు చేసింది. శంకర్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్. 1993 నుంచి ఇప్పటిదాకా.. అంటే.. ఈ 25 ఏళ్లల్లో రిలీజ్‌కి రెడీ అయిన ‘2.0’తో కలిసి శంకర్ తీసినవి 12 సినిమాలు.
శంకర్‌కి సామాజిక స్పృహ ఎక్కువ. ఆయన సినిమా కథలన్నీ సమాజంలో ఉన్న చెడు మీదే. పెద్దోళ్ల నుంచి దోచేసి, పేదవాళ్లకు ఇస్తాడు ‘జెంటిల్‌మేన్’. తర్వాత ‘భారతీయుడు’ లంచం తీసుకునే కొడుకుని చంపేస్తాడు. ‘జీన్స్’ అన్నారు. ఏడు వింతలను చూపించారు. కామన్ మేన్‌కి ఒకే ఒక్క రోజు సీఎం అయ్యే అవకాశం వస్తే.. సమాజ హితం కోసం ఏం చేస్తాడు? అన్నదే ‘ఒకే ఒక్కడు’. శంకర్ ప్రేమకథలు కూడా తీయగలరని రెండో సినిమా ‘ప్రేమికుడు’తోనే నిరూపించుకున్నారు. ‘బాయ్స్’ కూడా లవ్‌స్టోరీయే కదా.
శంకర్ తీసిన సినిమాల్లో ‘అపరిచితుడు’ది స్పెషల్ ప్లేస్. ఆ సినిమాలో అన్యాయాన్ని సహించలేని వ్యక్తిలోంచి అపరిచితుడు బయటికొస్తాడు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలనుకుంటాడు ‘శివాజీ’. ఆ తర్వాత చిట్టి రోబోను స్క్రీన్‌పైకి తెచ్చారు. హాలీవుడ్ మూవీలా ఉందని ‘రోబో’ని చూసి మన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆ తర్వాత ముల్లుని ముల్లుతోనే తీయాలంటూ పగ తీర్చుకునే ‘ఐ’ని స్క్రీన్‌పైకి వదిలారు శంకర్. మధ్యలో శంకర్ ‘3 ఇడియట్స్’కి రీమేక్‌గా ‘నన్బన్’ తీశారు. ఇప్పుడు శంకర్ ‘2.0’ని రెడీ చేశారు.
దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తీశారు. శంకర్ అంతే.. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటారు. పెద్ద సినిమాలే తీస్తారు. వసూళ్లు కూడా భారీగానే ఉంటాయి. తీసిన డజను సినిమాలూ ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇచ్చాయి. సిల్వర్ జూబ్లి ఇయర్‌లోకి ఎంటరైన శంకర్ నుంచి వెండితెర పైకి ఇంకా ఎలాంటి బ్రహ్మాండాలు వస్తాయంటే.. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఆన్ సెట్స్‌కి వెళ్లనుంది. యాక్షన్ టు డైరెక్షన్.. శంకర్ కెరీర్ డైరెక్షన్ భలేగా ఉంది కదూ.
Comments
Please login to add a commentAdd a comment