
సినిమా అభిమానులకు తీపివార్త. మరోసారి తెలుగు అగ్రతారలు ఒకే వేదికపై కలువనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు సొంత భవనం లేని తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఏకం కానున్నారు.
ఇప్పటి వరకూ 'మా' కు సొంత భవనం లేదు. దీనికోసం పలు సార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. నిధుల కొరతతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే దీనికి ఎట్టకేలకు మోక్షం అభించనుంది. ఈ మేరకు స్వంత భవన నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నామని, ఇందుకోసం ముమ్మర ప్రయత్నాలు చేపట్టినట్లు మా జనరల్ సెక్రటరీ అయిన సీనియర్ నటుడు నరేష్ ప్రకటించారు. సొంత కార్యాలయం నిర్మాణానికి నిధులు కావాలని, వాటికోసం భారీ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి ఈ నెల 10వ తేదీన కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగబోతోంది. పలువురితో ప్రత్యేక ప్రదర్శనలు.. సీనియర్ నటులకు సన్మానాలతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఇప్పటికే ఈకార్యక్రమానికి పలువురు అలనాటి స్టార్స్ కృష్ణ, కృష్ణంరాజులు మద్దతు పలుకుతున్నారు. సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు సైతం వంతు సహాయం అందిస్తామన్నట్లు నరేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా తమ వంతు సపోర్ట్ ఇస్తామని చెప్పారట. రామ్ చరణ్, ప్రభాస్ ఈ కార్యక్రమంలో భాగం అవుతారని నరేష్ తెలిపారు. ఏదేమైనా 'మా' సొంత భవనం నిర్మాణానికి తెలుగు సినీ రంగం అంతా మళ్లీ ఒకే వేదికపైకి రానుండటంతో సినీ అభిమానులకు పండుగనే చెప్పాలి.