చెన్నై మహాలింగ పురంలోని ప్రశాంత ఆలయ వాతా వరణానికి దగ్గరగా, అక్షరాలా అందుకు తగ్గట్లుగానే ఉంది నటుడు ‘శుభలేఖ’ సుధాకర్, గాయని శైలజల నివాసం. గేటు తీసుకొని వసారా దాటి లోపలకు అడుగుపెడితే, ఇంట్లోనూ అదే ప్రశాంతత. మధ్యతరగతి కుటుంబ జీవితానికి దగ్గరగా దేవుడి విగ్రహాలు, పటాలు, వెలిగించిన అగరొత్తుల పరిమళం... హంగామా లేని హుందాతనం, తెలియని సంతృప్తి ఏదో నట్టింట్లో నడయాడు తున్నట్లని పిస్తుంది. సుధాకర్‌ను పలకరిస్తే... ఆ మాటల్లోనూ అంతే స్వచ్ఛత... నిజాయతీ! వెండితెరపై వినోదం పండించడంతో మొదలుపెట్టి, బుల్లితెరపై విలనిజాన్ని పండిస్తూ ఇన్నేళ్ళుగా అలరిస్తున్న నటుడాయన. మూడుదశాబ్దాల పైగా చిరపరిచితుడైన ఆయన, ఎస్పీ శైలజల వివాహ బంధానికి ఇటీవలే సిల్వర్ జూబ్లీ అయింది. సూరావఝల బదులు ‘శుభలేఖ’ సినిమాయే ఇంటిపేరైపోయిన సుధాకర్‌తో భేటీ...
...::: రెంటాల జయదేవ
ఈ మధ్య సీరియల్స్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు. అటు దృష్టి పెట్టారా?
చెబితే ఇది చిత్రంగా ఉంటుంది కానీ, నిజం ఏమిటంటే సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉండడం వల్లే, టీవీలో కనిపిస్తున్నాను. 1989 డిసెంబర్ 21న నాకూ, ఎస్.పి. శైలజకూ పెళ్ళయింది. నిజానికి, మా పెళ్ళి వరకు మేమిద్దరం ఎవరి కెరీర్‌లలో వాళ్ళం చాలా బిజీగా ఉన్నాం. అలాంటిది, పెళ్లయిన తరువాత నుంచి చిత్రంగా ఇద్దరికీ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇంతలో సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళాలా, వద్దా అని సందిగ్ధావస్థ వచ్చింది. అలా మద్రాసులోనే ఉండిపోయాను.
మరి మీరు టీవీ రంగంలోకి ఎలా వచ్చారు?
అప్పట్లో ‘ఈ’ టి.వి. వారు ఒక సినిమా క్విజ్ పెట్టి, ఆ కార్యక్రమం నాతో చేయించారు. అలా నెలకు 5 రోజులు పని దొరికింది. ఆ తరువాత తమిళ ‘సన్’ టి.వి. వచ్చింది. సీరియల్స్‌లో నాకు అవకాశాలు వచ్చాయి. మద్రాసులో తమిళ, తెలుగు భాషల్లో తయారవుతున్న ధారావాహికల్లో నటిస్తున్నా.
అయితే, టీవీతో ఫుల్ బిజీ అన్న మాట!
(నవ్వేస్తూ...) ఇక్కడ వచ్చిన సమస్య అదే! టీవీలో డైలీ సీరియల్‌లో కనబడేసరికి, ఫుల్ బిజీ అనుకుంటారు. నెలలో 30 రోజులూ పని ఉండదు. కేవలం కొద్ది రోజులు పని ఉంటుంది. ఆ కొద్ది రోజుల్లో బాగా ప్లాన్ చేసి, సన్నివేశాలు తీస్తారు. ఆ కొద్ది దృశ్యాలే అక్కడొకటి ఇక్కడొకటి చొప్పున నెలంతా బుల్లితెరపై కనిపించేసరికి, ఆర్టిస్టుతో ‘మీరు చాలా బిజీగా ఉన్నారండీ’ అనేస్తారు. అయితే ఆదాయం మాటెలా ఉన్నా, నేను టీవీలో వేసిన పాత్రలు తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. సినిమాల్లో ఇంత వెరైటీ పాత్రలు నాకు వచ్చేవో, కాదో తెలియదు.
మీకు పేరు తెచ్చిన సీరియల్స్?
దర్శకుడు కె. బాలచందర్ గారు నిర్మాతగా, సముద్రఖని దర్శకత్వంలో తమిళం చేసిన ‘అన్ని’ సీరియల్ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ (‘వదిన’) మంచి పేరు తెచ్చింది.
ఆ మధ్య ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ’ల్లో పేరొచ్చినా...
(మధ్యలోనే అందుకుంటూ...) చాన్‌సలు రాలేదు. అదే విచిత్రం. ‘రక్తచరిత్ర-2’ కానీ, ‘బెజవాడ’ కానీ బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆడకపోవడం దెబ్బ అయింది. ‘ముత్యాల ముగ్గు’లో నటుడు మాడా ‘చేతికెంత? కాలికెంత?... హోల్ మొత్తం మీద కన్సెషన్ ఏమైనా ఉందా?’ అంటూ ఒక్క సీన్‌లో కనిపిస్తారు. అది ఆయనను మరో పదేళ్ళు నటుడిగా బతికించింది. కానీ, ఇవాళ సినిమా సక్సెస్‌ను బట్టే చూస్తున్నారు తప్ప, ఆర్టిస్ట్ సక్సెస్‌ను బట్టి లెక్కలోకి తీసుకోవడం లేదు.
అసలు మీరు నటన వైపు ఎలా వచ్చారు?
ప్రతి ఆర్టిస్టుకూ ఎవరో ఒక ఆర్టిస్ట్ ప్రేరణ ఉంటుంది. నేను అమితాబ్ సినిమాలు చూసి, నటుడిగా ఆయనను ఆరాధించి, సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పుడు వైజాగ్‌లో చదువుకొనే రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల సినిమాలు ఆరాధనగా చూసేవాణ్ణి. సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక పుట్టింది. అనేక పరిణామాల మధ్య మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు వచ్చింది. నటులు శ్యామలగౌరి, రాంకీ, అరుణ్ పాండ్యన్‌లు నా బ్యాచ్‌మేట్లు.
అసలు ఇన్‌స్టిట్యూట్‌లో నేర్పితే.... నటన వస్తుందంటారా?
(నవ్వేస్తూ...) నటన ఇలా చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పరు. నటించాల్సిన సన్నివేశాన్ని నిజజీవితంలోని సంఘటనతో సమన్వయం చేసుకుంటూ, దానికి ఎలా స్పందిస్తారో ఆలోచించి, అలా స్పందించమంటారు. ఆ ఆలోచనా ప్రక్రియను నేర్పుతారు. అప్పట్లో లక్ష్మీ కనకాల మా టీచర్. దేవదాస్ కనకాల కూడా మాకు నేర్పేవారు.
విశ్వనాథ్, బాపు, రాఘవేంద్రరావు, జంధ్యాల లాంటి దిగ్దంతుల దగ్గర పనిచేశారు. వాళ్ళ పని తీరెలా ఉండేది?
జంధ్యాల గారిది ఎక్కువగా డైలాగ్ మీద ఆధారపడి నడిచే పద్ధతి. యాక్టింగ్ కన్నా, డైలాగ్‌ను ఎక్కడ, ఎలా విరవాలి, ఎలా పలకాలన్నదానికి ప్రాధాన్యమిచ్చేవారు. కె. విశ్వనాథ్ గారేమో సహజమైన నటనకు ప్రాధాన్యమిస్తూ, ఫలానా డైలాగ్‌కు ఫలానా పని చేస్తూ, నటుడు అభినయించాలని చెబుతారు. బాపు గారి చిత్రీకరణలో ఫ్రేమింగ్‌కు ప్రాధాన్యం. ప్రతి దృశ్యం చక్కగా గీసిన బొమ్మలా ఉంటుంది. ఇలాంటి పెద్దలందరి దగ్గర నేర్చుకున్నదంతా తరగని గని అయింది. టీవీకొచ్చాక, రకరకాల పాత్రలు చులాగ్గా పోషించగలిగా.
కానీ, టీవీలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయా?
(విరక్తిగా...) పరిశ్రమకు కొత్తగా వచ్చి, కంటిన్యుటీ రాసుకొనే అసిస్టెంట్ దర్శకుడు సైతం టీవీలో ఆపద్ధర్మానికి రెండో రోజుకే దర్శకుడైపోతున్నాడు. ఎవరైనా యాక్టర్ కావచ్చు కానీ, దర్శకుడవడం సులభం కాదు. డెరైక్షనంటే యాక్షన్, కట్ చెప్పడం కాదు. కానీ, సీరియల్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు.
మీ దృష్టిలో సినిమాకూ, టీవీకీ తేడా?
టీవీలోలా సినిమాల్లో నటుడి మీద రకరకాల ప్రయోగాలు చేయరు. ఒక రకం పాత్రతో గుర్తింపొస్తే, ఆ తరహా పాత్రల్నే ఇస్తారు. కానీ టీవీ వార్తాపత్రికైతే, సినిమా మంచి పుస్తకం లాంటిది. పదేపదే చదువుకోవచ్చు.
చెన్నైలో ఉండడంతో హైదరాబాద్ పిలవడం లేదేమో!
1982 నుంచి ఇప్పటి దాకా గడచిన 32 ఏళ్ళలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, సినిమా వాళ్ళకు అవసరం అనుకుంటే, మీరు అంటార్కిటికాలో ఉన్నా పిలుస్తారు. అవసరం లేదనుకుంటే, పక్కనే, కళ్ళ ముందే ఉన్నా పిలవరు, పట్టించుకోరు. ఉన్నమాట చెప్పాలంటే, మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నా, ఎక్కువ మందికి పని లేదు. (కాస్త ఆవేశంగా...) ఏం మనకు రంగనాథ్ గారు, గిరిబాబు గారు - ఇలా ఎంత మంది లేరు. ఇవాళ నటించడం, డైలాగ్ చెప్పడం చేతగాని చాలామంది పరభాషా నటులతో పోలిస్తే, తండ్రి పాత్రలకో, మరో దానికో వాళ్ళు సరిపోరా? కనీసం చిన్న సినిమాలకు కూడా వాళ్ళు పనికిరారా? ఏమైనా ఆ దేవుడు నాకు ఒక తలుపు మూసినా, టీవీ అనే మరో తలుపు తెరిచాడు. అందుకే, జీవితంలో దేన్నీ నెగటివ్‌గా తీసుకోను.
మరి, పెళ్ళయ్యాక చాన్సుల్లేనప్పుడు మీ మానసిక పరిస్థితి?
అది చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఫోన్ మోగినా ఎవరి నుంచైనా వేషానికి పిలుపొచ్చిందేమో? నాకు కాకపోయినా కనీసం శైలజకైనా పాట ఛాన్స్ అయితే బాగుండు అనుకున్న రోజులు ఎన్నో! (గొంతు జీరపోతుండగా...) చివరకు బ్యాంకులో వంద రూపాయలే ఉన్న రోజులూ ఉన్నాయి. కనీసం నేను రెండు పూటలా ఆమెకు అన్నమైనా పెట్టగలనా అని భయపడ్డాను. ఇంతలో మాకో అబ్బాయి. మూడో ఏట మా అబ్బాయికి బాగా మాటలు వచ్చాయి. ‘నాన్న ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని ఉన్నాడేమిట’ని అంటాడేమో అని నాకు భయం వేసేది. మాటల్లో చెప్పలేని విషయం. పగవాడికి కూడా ఆ పరిస్థితి రాకూడదు. దేవుడి దయ వల్ల మా ఇంట్లో మళ్ళీ దీపం పెట్టింది, పొయ్యి వెలిగించింది టీవీనే!
అంత క్లిష్ట స్థితిలో మీరిద్దరికీ గొడవ...
(మధ్యలోనే అందుకొని...) అవకాశాలు లేకపోవడం ఒక రకంగా నెగటివ్ అయినా, మాకు పాజిటివ్ కూడా అయింది. చాలా పాఠాలు నేర్చుకున్నా. మాకు చేతిలో పని లేని కాలం మా ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసింది. ఎవరి దగ్గరా చేతులు చాచి అడగడం, అప్పు చేయడం లాంటివి మా ఇద్దరికీ నచ్చదు. అందుకే, ఉన్నదాంట్లోనే గుట్టుగా సంసారం నడిపాం. ఒక రూపాయి వస్తే, దానిలో అరవై పైసలే ఖర్చు చేసి, నలభై పైసలు రేపటి కోసం జాగ్రత్త చేస్తూ, ఇంటిని నడిపిన బెస్ట్ హౌస్‌వైఫ్ శైలజ.
కానీ, మీ బంధం సరిగ్గా లేదంటూ ఏవేవో వార్తలు....
(మధ్యలోనే...) ఉయ్ నెవర్ గేవ్ ఎ కేర్ ఫర్ ఇట్. మేము విడాకులు తీసుకున్నామని కూడా పత్రికల్లో వచ్చింది. ఇప్పటికీ ఆ మాట అడిగేవాళ్ళున్నారు. అప్పట్లో ఒక సినిమా పత్రిక ఎడిటర్ తమాషాగా రాసిన వార్తతో జరిగిన గొడవ ఇది. సారథీ స్టూడియోలో ‘ఈశ్వర్ అల్లా’ షూటింగ్‌లో ఉండగా ‘శివరంజని’ ఎడిటర్ బాలరెడ్డి గారు కలిశారు. ఆయన సెన్సేషన్ చేస్తూ ‘శుభలేఖ సుధాకర్, శైలజ విడిపోయారా?’ అని ఏదో సరదాగా రాశారు. అది గొడవ అయింది. ఆ వార్త చదివి పి.జె. శర్మ గారి లాంటి శ్రేయోభిలాషులు ఆవేశపడ్డారు. కానీ, పోనీలెమ్మని వదిలేశా. నాకెవరి మీదా కోపం లేదు. దాని వల్ల ఆరోగ్యం, ప్రశాంతత కోల్పోవడం తప్ప ఉపయోగం లేదు. చెప్పింది చెప్పినట్లు కాక, మరొకలా రాయడంతో వచ్చే తంటా ఇది. అప్పటికీ ఇప్పటికీ మా వివాహబంధం పటిష్ఠంగా ఉంది.
మీ కెరీర్లలో మీ బావ గారైన ఎస్పీబీ అండదండలు లేవా?
ఊహల మాటెలా ఉన్నా, ఉన్న నిజం ఏమిటంటే, ఆయనెప్పుడూ మా కెరీర్‌లో జోక్యం చేసుకోలేదు, చేసుకోరు. జోక్యం చేసుకోవాలని మేము ఆశించనూ లేదు! ‘ఆయన కలిగించుకొని మీకు సిఫార్సు చేయవచ్చు కదా’ అన్నవాళ్ళూ ఉన్నారు. అది తప్పు. ప్రతిభను బట్టి వాళ్ళు స్వశక్తితో పైకి రావాలే తప్ప, ఆయనెలా సిఫార్సు చేస్తారు!
కానీ, ఓదార్పుకు ఎవరిని ఆశ్రయించేవారు?
జీవితం చాలా గొప్ప టీచర్. అది మనకెంతో నేర్పుతుంది. మా తాత గారికి12వ సంతానం మా నాన్న గారు. ఆ రోజుల్లో ఆయనకు ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్‌లో సీటొచ్చినా, స్థోమత లేక చేర్చలేకపోయారు. అందుకే, మేము ఒక్క పిల్లాడు చాలని ఫుల్‌స్టాప్ పెట్టేశాం. అయిదో ఏట నుంచే మా అబ్బాయి శ్రీకర్‌కి కూడా అన్నీ చెబుతూ వచ్చాం. ఇవాళ వాడు ఢిల్లీ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఎం.బి.ఏ. చదువు స్థాయికి చేరాడు.
ఇన్నేళ్ళ జీవితం మీకు నేర్పిన పాఠం?
జీవితం పేకముక్కల సెట్టు లాంటిది. ఏ కార్డు ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. అన్నిటికీ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అమితాబ్‌తో వాళ్ళ నాన్నగారు హరివంశ్ రాయ్ బచ్చన్ ‘మన్ జో సోచా - హువా తో అచ్ఛా! నహీ హువా తో బహుత్ అచ్ఛా!!’ అని చెప్పారట. ఏది జరిగినా, అంతా మన మంచికే అనుకోవడమంటే అదే.
ఫొటోలు: వన్నె శ్రీనివాసులు, చెన్నై
నేను పెద్దగా పుస్తకాలు చదవను. కానీ, మా ఆవిడ శైలజకు పుస్తకాలే ఆప్తమిత్రులు. చదివిన విషయాలు ఆమె ప్రస్తావిస్తుంటే, ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకుంటుంటా. బి.కావ్‌ు చదివినా, ఆర్థిక నిర్వహణ నాకు తెలియదు. ఒడుదొడుకులనెదుర్కొన్నా, ఇవాళ మేము ఈ మాత్రం ఆర్థికంగా స్థిరంగా ఉన్నామంటే అది శైలజ సమర్థతే. సంపాదించే ప్రతి రూపాయిలో కొంత పిల్లాడి చదువుకూ, కొంత భవిష్యత్ అవసరాలకూ ఆదా చేశాకే, మిగిలినది ఖర్చు చేస్తాం. నేను, మా ఆవిడ, మా అబ్బాయి - ముగ్గురం కలసి, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. నిర్ణయాలు తీసుకుంటుంటాం. మా అబ్బాయి శ్రీకర్ కూడా పుస్తకాలు తెగ చదువుతాడు. మొదటి రోజు, మొదటి ఆటే సినిమాలు చూస్తాడు. వాటి గురించి అద్భుతంగా విశ్లేషిస్తాడు. వాడిప్పుడు ఢిల్లీలో మీడియా మేనేజ్‌మెంట్‌లో ఎం.బి.ఎ. చేస్తున్నాడు.
టీవీ మా పొయ్యి వెలిగించింది!
Published Sat, Jan 17 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM
Advertisement