వేదిక మీద హైడ్రామా.. తోసిపారేసిన బాబాయ్!
సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవ వేడుకలు సాక్షిగా ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో లక్నోలో జరిగిన ఈ వేడుక సీనియర్ నేత, బాబాయ్ శివ్‌పాల్ యాదవ్, సీఎం అఖిలేశ్ యాదవ్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి వేదికగా మారింది. పార్టీ శ్రేణులు, ప్రజల ముందే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పరోక్ష వాగ్బాణాలు సంధించుకున్నారు.
ఆ తర్వాత కాసేపటికే రజతోత్సవ సభ వేదికపై హైడ్రామా చోటుచేసుకుంది. సభలో ఎస్పీ నేత జావేద్ అబిదీ అఖిలేశ్‌కు మద్దతుగా చాలా ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఎన్నికలకు ముందే అఖిలేశ్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. అఖిలేశ్ మద్దతుదారుడైన ఆయన ఇలా మాట్లాడుతుండగానే బాబాయ్ శివ్‌పాల్ దూసుకొచ్చి.. అబిదీని మధ్యలోనే అడ్డుకున్నారు. బలవంతంగా మైక్ ముందునుంచి అవతలకు గెంటేశారు. దీంతో సభ వేదికపై ఒకింత గందరగోళం నెలకొంది. పార్టీ యూపీ అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్ కనుసన్నల్లో ఎస్పీ రజతోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేశ్ మద్దతుదారుడికి ఈవిధంగా చేదు అనుభవం ఎదురవ్వడం గమనార్హం.
అంతకుముందు కూడా పార్టీ రజతోత్సవాల వేదిక సాక్షిగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాటల యుద్ధానికి దిగారు. తొలుత శివపాల్ యాదవ్ ప్రసంగించగా.. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడారు. తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తానని శివపాల్ అన్నారు. అయితే, కొంతమంది మాట వింటారు గానీ పార్టీ మొత్తం సర్వనాశనం అయిన తర్వాతే వింటారని అఖిలేష్ యాదవ్ దెప్పిపొడిచారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే మాత్రం.. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''మీరు నాకు కత్తిని బహుమతిగా ఇచ్చారు. కత్తి అంటూ ఇస్తే దాన్ని తిప్పి తీరుతా'' అని వ్యాఖ్యానించారు.