ఆ ప్రశ్న అడగ్గానే.. అఖిలేష్‌కు కోపం వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశంలో సహనం కోల్పోయారు. పార్టీ పగ్గాలను తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు అప్పగించాలంటూ బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన ప్రతిపాదన గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అఖిలేష్‌కు కోపం వచ్చింది.
'ఈ విలేకరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు. ఆయన చొక్కా కూడా కాషాయ రంగులో ఉంది. అతనితో పాటు ఇతర జర్నలిస్టులకు చెబుతున్నా.. మేలో ఏ తేదీ అయినా నిర్ణయించుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. అయితే ఆ తర్వాత మీరు నా కుటుంబం గురించి ఏ ప్రశ్న కూడా అడగరాదు' అని అఖిలేష్ అన్నారు. నీలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమవుతోందని, దేశం నాశనమైతే నీవు కూడా ఉండవంటూ ఆ విలేకరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ మీడియా సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అఖిలేష్ భద్రత సిబ్బంది ఓ సీనియర్ జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్, శివపాల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగిన సంగతి తెలిసిందే. ములాయం తన సోదరుడు శివపాల్ వర్గానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎస్పీ చీఫ్‌గా ఉన్న ములాయంను పదవి నుంచి తొలగించి, అఖిలేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఆయన వర్గీయులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వర్గాలు రాజీపడ్డాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలేష్ స్థానంలో ములాయంకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని వారి కుటుంబంలో డిమాండ్లు వస్తున్నాయి.