
సమాజ్‌వాదీలో మళ్లీ రగడ
రజతోత్సవ వేడుకల్లో అఖిలేశ్-శివ్‌పాల్ మాటల యుద్ధం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. బాబాయ్... అబ్బాయ్ వర్గాలుగా విడిపోయిన పార్టీ... కుటుంబ కలహాలతో జనం సాక్షిగా మళ్లీ రచ్చకెక్కింది. శనివారమిక్కడ జరిగిన ఎస్పీ రజతోత్సవ వేడుకల్లో సీఎం అఖిలేశ్ యాదవ్... పార్టీ చీఫ్ ములాయంసింగ్‌యాదవ్ సోదరుడు, రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్‌యాదవ్ మరోసారి కత్తులు దూసుకున్నారు.ములాయం కుమారుడు కనుకనే అఖిలేశ్ సీఎం కాగలిగారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించి శనివారం సభలో శివ్‌పాల్ మాటల యుద్ధానికి తెర లేపారు. ‘కొంతమందికి అదృష్టంతో కొన్ని దక్కుతాయి.
కొంతమందికి కష్టంతో, మరికొంత మందికి వారసత్వంతో లభిస్తాయి. కానీ, జీవితాంతం కష్టపడి పనిచేసినా కొందరికి ఏమీ దక్కవు’ అంటూ అఖిలేశ్‌ను ఉద్దేశించి అన్నారు. . అహర్నిశలూ పార్టీ కోసం శ్రమిస్తూ, నాలుగేళ్లుగా అఖిలేశ్‌కు ఎంతో సహకరిస్తున్నానన్న శివ్‌పాల్... ‘ఇంకా ఏమేం త్యాగాలు చేయమంటావో చెప్పు అఖిలేశ్... అందుకు సిద్ధంగా ఉన్నా. నేనెప్పుడూ సీఎం కావాలనుకోలేదు’ అని అన్నారు. మంత్రిగా తనను తొలగించినా, అవమానపరిచినా పార్టీ కోసం రక్తం చిందించడానికి ఎప్పుడూ వెనుకాడనన్నారు.
వెంటనే మైకందుకున్న అఖిలేశ్... ‘ప్రజాపతి (శివ్‌పాల్ వర్గం) నాకు కత్తి బహూకరించారు. మీరు కత్తి ఇచ్చి... దాన్ని ఉపయోగించకూడదంటారు’ అని చురకలంటించారు. ‘అవసరమైతే పరీక్ష పెట్టుకో. నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు. ములాయం, ఆర్జేడీ చీఫ్ లాలూ, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు సభలో పాల్గొన్నారు. ఇలాంటి కీలక సమయంలో గొడవలు తగవని శివ్‌పాల్, అఖిలేశ్‌కు సర్ది చెప్పారు. లాలూ జోక్యంతో శివ్‌పాల్... అఖిలేశ్ పనితీరు భేషంటూ కితాబిచ్చారు. సీఎం... శివ్‌పాల్‌కు పాదాభివందనం చేశారు. ఇరువురూ చేతులు కలిపారు.