
ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాలు..ప్రజా సమస్యలపై పోరు
మళ్లీ అధికారమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును
ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి చేరువయ్యే యోచన
తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ పార్టీ భావజాల వ్యాప్తికి నిర్ణయం
ప్రజా సమస్యలపై పోరుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యం
హరీశ్‌కు సంస్థాగత నిర్మాణం, శిక్షణ, సిల్వర్ జూబ్లీ నిర్వహణ బాధ్యతలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలతో సమన్వయం కవితకు
పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు 30 మందితో కోర్ గ్రూప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతల మధ్య పని విభజన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడంపై దృష్టి సారించింది. ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి దగ్గర కావాలని నిర్ణయించింది.
తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే అభిప్రాయంతో ఉంది. తద్వారా కొత్త తరాన్ని ఆకర్షించే ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఈ నెల 19న జరిగిన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.
కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు
పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు కీలక నేతల నడుమ పని విభజన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీ రామారావుకు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు బాధ్యతను అప్పగించనున్నారు. ఇప్పటికే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన రైతు ధర్నాల్లో పాల్గొన్న కేటీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుకు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు తదితరాలను హరీశ్ పర్యవేక్షిస్తారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా హరీశ్‌రావుకే అప్పగించనున్నట్లు సమాచారం.
అనుబంధ సంఘాలపై కవిత దృష్టి
ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత వరుస సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఉద్యమ శక్తుల ఏకీకరణ.. యువతకు చేరువ
ఉద్యమ కాలంలో పార్టీతో కలిసి వచ్చిన వ్యక్తులు, శక్తులకు తిరిగి దగ్గర కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ఏడాది పొడవునా సాగే పార్టీ రజతోత్సవాల్లో ఉద్యమంలో కలిసి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు, వివిధ జేఏసీల్లో క్రియాశీలంగా పనిచేసిన వారితో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయడంతో పాటు కొత్త తరానికి తెలంగాణ నేపథ్యం, రాష్ట్ర సాధన ఉద్యమం తదితరాలను పరిచయం చేయాలని, పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ పాత్ర, పదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో పుట్టిన పసికందులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న యువతగా ఎదిగారు. వారిలో తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తిని రగిలించేలా సదస్సులు, సమావేశాలు, సభలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ కార్యక్రమాలకు రూపకల్పన బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు అప్పగించనున్నారు.
కార్యాచరణ రూపకల్పనకు కోర్ గ్రూప్
పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ప్రణాళికల రూపకల్పనకు సుమారు 25 నుంచి 30 మంది సీనియర్ నేతలతో కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని అధినేత భావిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిన నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లకు చోటు కలి్పస్తారు. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోజనశాల, పార్కింగ్ తదితర వసతుల కల్పన పూర్తయిన తర్వాత మినీ సభలను తలపించేలా ఈ సమావేశాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment